రైతాంగాన్ని ఆదుకోండి.


అమరావతి (ప్రజా అమరావతి);

*రైతాంగాన్ని ఆదుకోండి*


*పంట నష్టం అంచనకు వచ్చిన కేంద్ర బృందానికి టీడీపీ నేతల వినతి*


మిచౌంగ్ తుపాను ధాటికి రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో పర్యటించింది. వర్షాలకు తడిచిపోయిన పంటను పరిశీలించారు. రైతుల్ని ఆదుకోవడంలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు. ఈ మేరకు కేంద్ర బృందాన్ని కలిసి వినతిపత్రం అందించారు. దెబ్బతిన్న పంటలను దగ్గరుండి అధికారులకు చూపించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. నష్ట పోయిన ప్రతీ రైతును ఆదుకోవాలని విన్నవించారు.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు, నియోజవర్గ ఇంచార్జ్‌లు దెబ్బతిన్న పంటలను చూపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వేముల శివాజీ తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో పర్యటించిన కేంద్ర బృందాన్ని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ వేగేశన నరేంద్ర ఆధ్వర్యంలో పంటలను చూపించారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని, మీరైనా రైతాంగాన్ని కాపాడాలని వినతిపత్రం అందజేశారు.

Comments