ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ...

 ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ...


  మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి గణపతి నగర్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని గణపతి నగర్ లోని ఇందిరానగర్ డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ రోగులకు, సాధారణ ప్రజానీకాన్ని చైతన్యం చేస్తూ ఎయిడ్స్ నియంత్రణ, నిర్మూలన గురించి అవగాహన కల్పించడమే ఎయిడ్స్ దినోత్సవం ప్రధాన ఉద్దేశమన్నారు. 2023 ఎయిడ్స్ దినోత్సవాన్ని లెట్ కమ్యూనిటీ లీడ్ గా ప్రకటించారన్నారు. హెచ్ఐవీ వైరస్ రక్తంలోనూ శరీర ద్రవాలైన వీర్యంలో ఎక్కువ శాతం ఉంటుందని, లాలాజలంలో తల్లిపాలల్లో తక్కువ శాతం ఉంటుందన్నారు. రక్తం ద్వారా ఎయిడ్స్ వ్యాధి  ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని, సురక్షం కాని సూదులు వాడటం, పచ్చబొట్లు పొడిపించుకోవడం, క్షవరం చేయించుకోవడం సమయాల్లో రక్తం ద్వారా ఒకరి నుండి మరొకరికి సోకే ప్రమాదం ఉందన్నారు. జ్వరం అలసట, ఆకలి మందగించడం, విరోచనాలు, బరువు తగ్గటం వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు టీబీ వచ్చే ప్రమాదం ఉందని టీబీ పరీక్షలు కూడా చేయించుకోవాలన్నారు.ఎయిడ్స్ లక్షణాలు కనిపించిన వారు సమీపంలోని ప్రభుత్వ ఆస్పటల్లోని ఐసీటీసీ సెంటర్లలో వైద్య సేవలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయలక్ష్మి, ఏ ఎన్ఎంలు, ఆశాలు, హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments