హెచ్ఐవీ ఎయిడ్స్ రహిత సమాజమే మన లక్ష్యం.. నిర్మూలనే మన ధ్యేయం.

 

విజయవాడ (ప్రజా అమరావతి);


హెచ్ఐవీ ఎయిడ్స్ రహిత సమాజమే మన లక్ష్యం.. నిర్మూలనే మన ధ్యేయం


లెట్ కమ్యూనిటీస్ లీడ్ అంటే హెచ్ఐవీ నివారణకు కమ్యూనిటీ నాయకత్వం వహించాలి

ఎయిడ్స్ ఉన్న వారిని సమాజంలో కలుపుకోవాలి

ఏఆర్టీ మందులు తీసుకుంటూ సాధారణ జీవితం సాధ్యం

హెచ్ఐవీ మందులు అన్ని సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి.

ఎయిడ్స్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది..

హెచ్ఐవీ వ్యాప్తి మన రాష్ట్రంలో 95 శాతం తగ్గుదల

: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్

హెచ్ఐవీ ఎయిడ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయిలో లెట్ కమ్యూనిటీస్ లీడ్  అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఏపీఎస్ఏసీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశంలో ఉన్న మొత్తం హెచ్ఐవి రోగుల సంఖ్యలో మన రాష్ట్రంలో 13% మాత్రమే ఉన్నారన్నారు.  రాష్ట్రంలో ఉన్న కమ్యూనిటీ పెద్దలు, భాగస్వాములు కలిసి హెచ్ఐవిని ఎదుర్కోవడానికి అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టడంతో  రాష్ట్రంలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ శాతం 2014తో పోలిస్తే 2021 కి 68% తగ్గిందన్నారు. అదే విధంగా ఎయిడ్స్ మరణాల సంఖ్య 73.75 శాతానికి తగ్గాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త కార్యక్రమాలను నిర్వహించి వాటితో సత్ఫలితాలు సాధించి దేశానికే మార్గదర్శకంగా నిలవగా ఈ పద్ధతులను దేశమంతా అనుసరించడం గర్వకారణమన్నారు. ఇకపై రాష్ట్రంలో కొత్త హెచ్ఐవీ కేసులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏఆర్టీ మందులు తీసుకుంటూ హెచ్ఐవీ రోగులు సాధారణ జీవితం గడపవచ్చని సూచించారు. ఏఆర్టీ మందులు రాష్ట్రంలో అన్ని హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. హెచ్ఐవీ రోగులకు మానసిక స్థైర్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 

                   గర్భిణీ స్త్రీలలో హెచ్ఐవి మరియు సిఫిలిస్ లేకుండా చూడడం, వివక్షను తొలగించడం ప్రమాదకర ప్రవర్తన కలిగిన వారిలో సుఖ వ్యాధులు మరియు జననేంద్రియ వ్యాధులకు ప్రత్యేక సేవలు అన్ని చోట్ల అందేలా చూడడంతో హెచ్ఐవీ వ్యాప్తిని అరికట్టగలిగామని ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ వివరించారు. రాష్ట్రంలో15 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల వారిలో హెచ్ఐవి 0.67% ఉండగా, హిజ్రాలు/ ట్రాన్స్ జెండర్స్ లో 4.61% ,  ఖైదీలలో 3.25%, స్వలింగ సంపర్కులలో 2.06%, సెక్స్ వర్కర్స్ లో 1.78%, మాదక ద్రవ్యాలు వినియోగించే వారిలో 1.78%, వలసదారులలో 0.93%, ట్రక్కర్స్ లో 0.6 శాతంగా ఉందని తెలిపారు.  

                  NACO ఆదేశాల మేరకు రాష్ట్రంలో మే 23 నుండి యూత్ ఫెస్ట్ - 2023 నిర్వహించామని, ప్రధానంగా మారథాన్ మరియు క్విజ్ పోటీలు కూడా నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాల్లో నిలిచిన వారిని అక్టోబర్ 8వ తారీఖున గోవాలో నిర్వహించిన జాతీయస్థాయి 10 కే మారథాన్ కు పంపించామన్నారు. రాష్ట్రానికి చెందిన ట్రాన్స్ జెండర్స్ ఇద్దరు తొలి, ద్వితీయ బహుమతులు సాధించారని చెప్పారు. హెచ్ఐవి తో పాటు యోగ, శారీరక వ్యాయామం, పోషకాహారంపై రాష్ట్ర యువతలో అవగాహన కల్పించి వారిలో డయాబెటిస్, రక్త పోటు రాకుండా చేయడం కోసం ప్రత్యేకంగా సేఫ్ లైఫ్ క్యాంపెయిన్ ను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం మొదటగా APSACS, UNICEF మరియు కేఎల్ యూనివర్సిటీలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందులో 66 మంది సభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆరు నెలల ఫెలోషిప్ ను పూర్తి చేశారని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం ఎలా, వ్యాధులకు దూరంగా ఉండడం ఎలా, వ్యాధులు ఉన్న వారిని ఎక్కడికి వెంటనే పంపాలి తదితర విషయాలను గ్రామస్థాయిలో జనాభాకు తెలపడం జరిగిందన్నారు. అలాగే సేఫ్ లైఫ్ క్యాంపెయిన్ ను మరో నాలుగు యూనివర్సిటీల్లో కూడా ఈ సంవత్సరం చేపట్టడానికి UNICEF సహకారంతో APSACS సిద్ధంగా ఉందన్నారు.

                          ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం మాట్లాడుతూ 1990 నుంచి తన వంతుగా హెచ్ఐవీ రోగులకు అవగాహన కల్పించటంతో పాటు వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి వారు సాధారణ జీవనం సాగేలా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం వరకు హెచ్ఐవీ రోగుల్లో ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానంలో ఉండేదని కానీ ఇప్పుడే మన ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటంతో మన జనాభాలో కేవలం 0.2 శాతం మాత్రమే ఉందని వివరించారు. 2030 నాటికి హెచ్ఐవీ రోగాన్ని మన సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు మందులు అందుబాటులో ఉండటంతో భయపడాల్సిన పనిలేదన్నారు. ఎయిడ్స్ ఉన్న వారిని సైతం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వివాహం కూడా చేసుకోవచ్చని తెలిపారు. 

                   కార్యక్రమానికి ముందుగా పురవీధుల్లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మఖ్య అతిథులు పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ నిర్మూలనకు విశేష కృషి చేసిన సంస్థలు, ప్రతినిధులకు అవార్డులను అందచేశారు. ముందుగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ ఎస్పీ రాహుల్, అడిషనల్ ప్రాజెక్ట్ డైరక్టర్ కోటేశ్వరి, సుబ్రహ్మణ్యం, మంజుల, ఉషారాణి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 


Comments