వచ్చేసాధారణ ఎన్నికలు పటిష్ట నిర్వహణపై ఇప్పటి నుండే కార్యాచారణ సిద్ధం చేయండి:సిఎస్

 వచ్చేసాధారణ ఎన్నికలు పటిష్ట నిర్వహణపై ఇప్పటి నుండే కార్యాచారణ సిద్ధం చేయండి:సిఎస్

అమరావతి,4 జనవరి (ప్రజా


అమరావతి):రానున్నసాధారణ ఎన్నికలను పటిష్టంగా సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.రానున్నఎన్నికల సన్నద్ధతపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు.ఈ సమావేశంలో ముఖ్యంగా రిటర్నింగ్ అధికారులు,సహాయ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధం ఉన్నవివిధ అధికారుల ఖాళీల భర్తీతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం,జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు అంశాలపై సిఈఓ ముఖేష్ కుమార్ మీనాతో సిఎస్ జవహర్ రెడ్డి చర్చించారు.వెంటనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని స్పష్టం చేశారు.అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడు నాలుగేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నఅధికారుల తప్పనిసరి బదిలీ,కొత్తవారికి పోస్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎస్.డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.అదే విధంగా పోలింగ్ కేంద్రాల వారీగా ఉండాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపై ఆయన సిఇఓ ఇతర అధికారులతో సమీక్షించారు.

రానున్నఎన్నికల్లో డబ్బు,మద్యం వంటివి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు,సిబ్బందితో కూడిన అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ చెక్కు పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉందని అందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సమీక్షించారు.సరిహద్దు నిఘా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఎపి,ఒడిస్సా రాష్ట్ర అధికారులుతో త్వరలో ఒక సమన్వయ సమావేశం నిర్వహించాలని దీనిపై ఒడిస్సా సిఎస్ తో తాను మాట్లాడతానని చెప్పారు.రానున్నసాధారణ ఎన్నికల నిర్వహణపై ముఖ్యంగా పోలీస్,రెవెన్యూ,ఎక్సైజ్,వాణిజ్య పన్నులు,రవాణా,ఆర్ అండ్బి,పంచాయితీరాజ్,విద్యా,మున్సిపల్ తదితర శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.ఎన్నికలను అత్యంత పారదర్శకంగా సజావుగా సకాలంలో నిర్వహించాల్సిన ప్రక్రియని కావున ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతా యుతంగా పనిచేయాల్సి ఉంటుందని ఆదిశగా సంబంధిత శాఖలన్నీతగిన సన్నాహక కసరత్తును మొదలు పెట్టాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 9వ తేదీన రాష్ట్రానికి రానుందని తెలిపారు.10వ తేదీన విజయవాడలో సిఎస్,డిజిపి,సిఇఓ సహా ఎక్సైజ్,వాణిజ్య పన్నులు,ఆర్ అండ్బి,అటవీ, విద్యా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నున్నారని వివరించారు.రాష్ట్రంలో 46వేల 165 పోలింగ్ కేంద్రాలున్నాయని వాటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు గురించి తీసుకోవాల్సిన అంశాలపై సిఎస్ దృష్టికి తీసుకువచ్చి వీటిపై జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని సిఎస్ కు చెప్పారు.అదే విధంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో విభిన్నప్రతిభావంతులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై కూడా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉందని అన్నారు.రాష్ట్ర ఎన్నికల కార్యాలయం,జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్ పై నియమించాల్సి ఉందని సిఇఓ చెప్పగా వెంటనే తగిన ప్రతిపాదనలు పంపాలని సిఎస్ జవహర్ రెడ్డి సూచించారు.ఇంకా ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ లాజిస్టిక్ ఏర్పాట్లు,మెన్ అండ్ మెటీరియల్,కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

రాష్ట్ర ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ యం.రవి ప్రకాశ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో 29 ఇంటిగ్రేటెడ్ చెక్కు పోస్టులున్నాయని వాటిని పటిష్టంగా నిర్వహించడం ద్వారా డబ్బు,మద్యం,గంజాయి ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు.వీటితో పాటు రాష్ట్రంలో 76 పోలీస్ చెక్కు పోస్టులు,14 అటవీ చెక్కు పోస్టులున్నాయని వీటన్నిటి ద్వారా నిఘాను మరింత ముమ్మరం చేయడం జరుగుతుందని చెప్పారు.

ఇంకా ఈసమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,చీఫ్ కమీషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గిరిజా శంకర్,అదనపు పిసిసిఎఫ్ విజిలెన్స్ గోపీనాథ్,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ యం.రవి ప్రకాశ్,రవాణా శాఖ కమీషనర్ మణీశ్ కుమార్ ఎస్ఎల్బిసి కన్వీనర్ తదితర అధికారులు పాల్గొన్నారు.ఆదే విధంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి.రాజశేఖర్,రజత్ భార్గవ,ముఖ్య కార్యదర్శి శ్యామలరావు,కమీషన్ర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కె.భాస్కర్,సిడిఎంఏ కోటేశ్వరరావు తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.


Comments