జనన,మరణ రిజిస్ట్రేషన్ చట్టం 2023 పై సిఎస్ సమీక్ష.

 జనన,మరణ రిజిస్ట్రేషన్ చట్టం 2023 పై సిఎస్ సమీక్ష


అమరావతి,12 మార్చి  (ప్రజా అమరావతి):జనన,మరణ నమోదు(సవరణ చట్టం 2023)పై మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నకిలీ జనన,మరణ ధృవీకరణ పత్రాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనగా గ్రామ,మున్సిపల్, ఆసుపత్రులు తదితర స్థాయిల్లో జరిగే జనన,మరణ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సకాలంలో సక్రమంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.అంతేగాక నకిలీ లేదా డూప్లికేట్ జనన,మరణ ధృవీకరణ పత్రాలను నియంత్రించేందుకు వీలుగా పాత రికార్డుల డేటా బేస్ అంతటినీ డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.ఈ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలు,మార్గదర్శకాల నోటిఫికేషన్ వచ్చే లోగా క్షేత్ర స్థాయి అధికారులందరికీ ఈచట్టం అమలుకు సంబంధించిన పూర్తి అవగాహన కల్పించేందుకు తగిన సమాచారాన్ని అందించాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జననాలతో పాటు మరణాలు కూడా గ్రామ,మున్సిపాలిటీల స్థాయిలోను ప్రభుత్వ,ప్రవేట్ ఆసుపత్రులు సహా ప్రతి చోటా సకాలంలో సక్రమంగా రిజిష్టర్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రవేట్ నెట్ వర్కు ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల ద్వారా జనన,మరణ రిజిస్ట్రేషన్ల నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి.కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవరించిన జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం 2023 అక్టోబరు 1 నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు.ఈచట్టంలోని ముఖ్యాంశాలను వివరిస్తూ ఈ నూతన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశానికి,డ్రైవింగ్ లైసెన్సు జారీ,ఓటరు జాబితా సవరణ,వివాహ రిజిస్ట్రేషన్,పాస్ పోర్టు జారీ,ఆధార్ కార్డు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లోను,వివిధ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్,స్థానిక సంస్థల్లోను ఉద్యోగ నియామకానికి పుట్టిన తేది ధృవీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు.ఇంకా ఇందుకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారరు.

ఈసమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్,గ్రామ,వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్ అభిషేక్ గౌడ,న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర రావు తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments