ఎం.సి.సి.ఉల్లంఘనపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు.

 *ఎం.సి.సి.ఉల్లంఘనపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు


*

*•గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాదీనం*

*•ఎటు వంటి కార్యక్రమానికైనా అనుమతిని తప్పని సరిగా పొందరాలి*

*•డిఎస్సీ నిర్వహించాలా, వద్దా అనేది ఇ.సి. నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది*

*•ఎం.సి.సి. ఉల్లంఘనలను అరికట్టేందుకు సి-విజిల్ యాప్ ను వినియోగించాలి* 

*•హింస రహిత, రీ పోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నాం*

*రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా*


అమరావతి, మార్చి20 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత మూడు రోజుల్లో ఎం.సి.సి. ఉల్లంఘనలపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయని, రూ.3.39 కోట్ల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ ను స్వాదీనం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.   ఈ నెల 16 వ తేదీన ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి సందర్బంగా తీసుకున్న చర్యలను బుధవారం రాష్ట్ర సచివాలయం ఎన్నికల మీడియా కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో  ఆయన  వివరించారు.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో హింస రహిత, రీ పోలింగ్ కు అవకాశం లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అయితే దురదృష్ట వశాత్తు ఈ మద్య కాలంలో  గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లలో కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఇటు వంటి హింసాత్మక సంఘటనలకు దారితీసిన  కారణాలను,  చట్టపరంగా తీసుకున్న చర్యలను వివరించేందుకు సంబందిత జిల్లాల ఎస్పీలు రేపు తమ కార్యాలయానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరుస్తున్నామని,  ఎం.సి.సి. ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు  ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నుండే ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నుండి విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ దాదాపు రూ.176 కోట్లు విలువైన నగదు, విలువైన లోహాలు, నార్కొటిక్స్ ను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. మద్యం ఉత్పత్తి, విక్రయాలపై  ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది ఇదే   రోజులతో పోల్చుకుంటూ మద్యం ఉత్పత్తి, పంపిణీ, నిల్వలను రెగ్యులర్ గా పర్యవేక్షించడం జరుగుచున్నదని, గత ఏడాది ఉన్న సాదారణ ఉత్పత్తి, నిల్వలు కంటే ఈ ఏడాది తక్కువ స్థాయిలో ఉన్నట్లు గమనించడం జరిగిందన్నారు.


అదే విధంగా ఆస్తుల వికృతీకరణ (Defacement) కు సంబందించి 94 కేసులు, వాహనాలు, లౌడ్ స్పీకర్లు దుర్వినియోగంతో పాటు చట్టవిరుద్దమైన సమావేశాలు, ఓటర్లను ప్రేరేపించడానికి సంబందించి 37 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.   రాజకీయ నేతల ఫొటోలు, ప్రకటనలకు సంబందించి ప్రజా ఆస్తుల పరిధిలో 1.99 లక్షలు మరియు ప్రైవేటు ఆస్తుల పరిధిలోని 1.15 లక్షల  వాల్ పెయింటిగ్స్ ను, పోస్టర్లను, బ్యానర్లను మరియు ఇతర వస్తువులను తొలగించడం జరిగిందని తెలిపారు.

                                                                                                                                                                                     రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు అవుతోందని, ఎలాంటి కార్యక్రమానికైన అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. సువిధా యాప్ ద్వారా అనుమతులు తీసుకోవచ్చని, ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకూ 392 ధరఖాస్తులు అందాయని, వాటిలో 10 తమ పరిధిలోవి కాగా మిగిలినవి జిల్లా ఎన్నికల అధికారుల పరిధిలో ఉన్నట్లు తెలిపారు.  ఎం.సి.సి. ఉల్లంఘనకు సంబందించిన ఫిర్యాదులను సీ విజిల్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న  100 నిముషాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు దాదాపు 1,173 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకూ 1,307 ఫిర్యాదులు అందాయని, వాటిలో 74 శాతం పరిష్కరించండ జరిగిందన్నారు. సి-విజిల్ పిర్యాధుల్లో 95 శాతం మేర పరిష్కరించే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ యాప్ ను  విస్త్రత స్థాయిలో అందరూ వినియోగిస్తూ ఎం.సి.సి. ఉల్లంఘనలను నియంత్రించేందుకు సహకరించాలని  రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.


ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం, వారితో సాన్నిహిత్యంగా ఉండటం ఎం.సి.సి. నియమాలకు విరుద్దమన్నారు. ఫిర్యాదులు అందిన 46 మంది వాలంటీర్లను, కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుండి తొలగించామని, కొందరిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టామాని తెలిపార.


ఈ నెల 30 తేదీ నుండి జరుగన్ను డిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, వాయిదా వేయవద్దని మరికొందరు అభ్యర్థులు విస్తృత స్థాయిలో తమ కార్యాలయానికి మెయిల్స్ చేశారన్నారు.  ఈ పరీక్షలకు దాదాపు 4.72 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఈ అంశానికి సంబందించి విద్యాశాఖ నుండి వచ్చే ప్రతిపాదనలను  రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ద్వారా ఎన్నికల సంఘాని పంపించం జరుగుతుందన్నారు. ఈ ప్రతిపాదనలపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.


అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరేంధ్రప్రసాద్ సి-విజిల్ యాప్ వినియోగం, ఆ యాప్ ద్వారా అందే పిర్యాధులపై తీసుకునే తక్షణ చర్యలను వివరించారు. అదనపు సీఈవో  పి. కోటేశ్వరరావు    ఈ పాత్రికేయుల సమావేశంలో  పాల్గొన్నారు.                                                                                                                                                        



Comments