మీ భాగస్వామ్యం వల్లే 'డోన్ అభివృద్ధి' సాకారం : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*మీ భాగస్వామ్యం వల్లే 'డోన్ అభివృద్ధి' సాకారం : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*



*ఈ ఐదేళ్లూ కుటుంబంతో కన్నా ఎక్కువ గడిపింది మీతోనే*


*అభివృద్ధిలో మమేకమైన అధికారులందరికీ కృతజ్ఞతాభినందనలు*


*వృత్తిని అంకితభావంగా పని చేసే అధికారుల వల్లనే ఇది సాధ్యం : డోన్ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో జరిగిన కృతజ్ఞత సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*ఉద్యోగ జీవితంలో గుర్తుండిపోయేలా డోన్ లోనే పనిచేశామంటూ అధికారుల ప్రశంసలు*


*డోన్ పట్టణంలోని కె.వి.ఎస్ పార్కులో రూ.45 లక్షలతో నిర్మించిన యోగా సెంటర్ ప్రారంభోత్సవం*


డోన్, నంద్యాల జిల్లా, మార్చి,15 (ప్రజా అమరావతి); మీ అందరి భాగస్వామ్యం వల్లనే 'డోన్ అభివృద్ధి' సాధించిందంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన నియోజకవర్గంలోని అధికారుల సేవలను మెచ్చుకున్నారు. ఈ ఐదేళ్లు తన కుటుంబంతో కన్నా కుటుంబసభ్యుల వంటి అధికార యంత్రాంగంతోనే ఎక్కువ సమయం గడిపానని మంత్రి పేర్కొన్నారు. కనీస సౌకర్యాల లేమి సహా ఫ్యాక్షన్ ముద్రతో డోన్ కి రావడానికే భయపడే అధికారులు..ఇపుడు డోన్ లో పోస్టింగ్ కోరుకునే స్థాయిలో రూపురేఖలు మార్చగలిగామన్నారు. నమ్మి ఓటేసిన ప్రజలు, డోన్ కోసం ఏమడిగినా కాదనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకాభిమానమే ముందుకు నడిపించాయన్నారు. సమయం ప్రకారం పూర్తి కాని కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఏ అధికారి మనసునైనా నొప్పించి ఉంటే అన్యదా భావించవద్దని, అది పని పూర్తి కావడానికి పడ్డ ఆరాటం తప్ప వ్యక్తిగత ఆవేశం కానే కాదని మంత్రి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో భవన నిర్మాణ ఆకృతుల విషయంలో చూపే శ్రద్ధ, రోడ్డు నిర్మాణంలో ఎగువదిగువలకు తావు లేకుండా జాగ్రత్తపడడం, పది కాలాల పాటు చల్లగా ఉండేలా పఫ్ రూఫ్ షీట్ టెక్నాలజీ వినియోగం, ఆస్పత్రి,విద్యాలయాల్లో ప్రశాంత వాతవరణం కోసం ప్రత్యేక ప్రాధాన్యత, ఆలయాల చరిత్ర చెక్కు చెదరకుండా పున:వైభవం, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఇలా శాశ్వతమైన పనులను కోవిడ్ ను పక్కనపెట్టి మూడేళ్లలోనే పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి అధికారికి పేరుపేరునా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ప్రజా సేవలో అంకితభావంతో పనిచేస్తే  ప్రజల ద్వారా ఎన్నో ప్రశంసలు మనకు మరింత శ్రమించే ఉత్సహమిస్తాయని మంత్రిగా ఈ అనుభవం నేర్పిందన్నారు. కుటుంబాన్ని, పిల్లలని, బంధువులను పట్టించుకోకుండా..మంత్రి హోదాలో నియోజకవర్గం, సెక్రటరీయేట్, జిల్లా, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కోసారి నేనెక్కడున్నా అని నిద్రలేచి చూసుకున్న సందర్భాలున్నాయన్నారు. 1990లో మొదలైన తన రాజకీయం 2019 వరకూ అంటే సుమారు ముఫ్పై ఏళ్లు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాడడానికే సరిపోయిందన్నారు. ఆ అనుభవం వల్లే  ఎంత తీరికలేకున్నా ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిని ప్రణాళికతో మీ అందరి కృషితో పూర్తి చేయగలిగామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని.. ప్రతి మనిషికి ఒక రోజొస్తుందని, ఆ రోజు వచ్చేదాకా శ్రమించడం విశ్రమించకూడకపోవడమే అసలైన విజయమని మంత్రి వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు కోసం చేసిన ప్రయత్నాల్లో ఎన్నో విషయాలు మీ అందరి ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఏ పని చేసినా ఏ రంగంలోనైనా ఆత్మసాక్షితో పని చేసే వాతావరణం ఉండడం అవశ్యమన్నారు. ఐఐటీ రామయ్య కోచింగ్ సెంటర్ లో ఐఐటీ ప్రతిభ ఉన్న అభ్యర్థులనే వెలికి తీసుకుని ఎక్కువ శాతం విజయం సాధించినట్లు మంచి అధికారులను వెతికి తెచ్చుకుని అభివృద్ధిలో డోన్ ను పరుగులు పెట్టించగలిగామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.


*మంత్రి బుగ్గన కృషికి, వ్యక్తిత్వానికి డోన్ నియోజకవర్గ అధికార యంత్రాంగం ప్రశంసలు*


అంతకు ముందు ఆర్డీవో మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ పరిచయమైన అనతికాలంలోనే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారి నాయకత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో మంత్రులు ఎంత మంది ఉన్నా మహామంత్రి తిమ్మరసుకే మహామంత్రి హొదా దక్కిందన్నారు. సీఎం వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రి బుగ్గన కూడా మహామంత్రి అన్నారు. నిర్మాణాలు, ఆకృతుల నిర్మాణంపై చూపే ప్రత్యేక శ్రద్ధ మొగలులు, చోళుల చరిత్రలో చదువుకున్నట్లు భవిష్యత్ తరాలు కూడా  మంత్రి బుగ్గన నిర్మాణాల గురించి తెలుసుకుంటాయన్నారు. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో రాగద్వేషాలు, తనపర భేదాలు లేకుండా మనసుకు నచ్చినట్లు లా అండ్ ఆర్డర్ కోసం పని చేసింది మంత్రి బుగ్గన నాయకత్వంలోని డోన్ నియోజకవర్గంలోనే అన్నారు. డోన్ మున్సిపల్ కమిషనర్ జయరాం మాట్లాడుతూ..కార్పొరేషన్లు, మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా డోన్ మున్సిపాలిటీని తీర్చిదిద్దారని మంత్రి కృషిని ప్రశంసించారు. రూ.6 కోట్లతో మున్సిపల్ భవన నిర్మాణం కట్టిన తీరు రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. సూక్ష్మమైన విషయాలను పరిశీలించే ప్రతి విషయంలో సమగ్ర అవగాహన కలిగిన మంత్రి బుగ్గన సారథ్యంలో పని చేయడం సవాల్ అని ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి అన్నారు. కానీ సవాళ్లను అధిగమించి పని చేసిన తీరును జీవితంలో మరవలేమన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ రహదారులు ఎలా నిర్మించాలో , ఎలా నిర్మిస్తే ఎగుడుదిగుడులు ఉండవో కూడా అవగాహన కలిగి ఆదేశించిన తొలి రాజకీయ నాయకుడు బుగ్గన అన్నారు. ఎక్కడో నీళ్లు రాకపోతే కానీ మా డిపార్ట్ మెంట్ ఉందని తెలియని ఆర్ డబ్ల్యూఎస్ విభాగాన్ని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణంతో నియోజకవర్గ ప్రజలందరికీ తమ శాఖ మీద గౌరవం కలిగేలా చేసిన నాయకుడు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అని ఆ విభాగానికి చెందిన ప్రాజెక్ట్ మేనేజర్ పేర్కొన్నారు. మైనింగ్ ఫండ్ ని  వినియోగించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులెన్నో చేపట్టి డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో బుగ్గన చాటారని జిల్లా మైనింగ్ అధికారి తెలిపారు. మంత్రిగారిని చూడగానే ప్రశాంతమైన ముఖం, చిరునవ్వు గుర్తొస్తాయని, అంత ఒత్తిడిలో ఆయన అలా ఉండడం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.


అనంతరం డోన్ పట్టణంలోని కె.వి.ఎస్ పార్కులో రూ.45 లక్షలతో ఏర్పాటు చేసిన యోగా సెంటర్  ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. గత పాతికేళ్ల కాలంలో ఎంత మందిని అడిగినా కనీస స్థలం కేటాయించలేదని, కానీ మంత్రి బుగ్గన పెద్ద మనసు వల్లే యోగా సెంటర్ ఇంత అద్భుతంగా నిర్మించుకోవడం సాధ్యమైందని గీతా యోగాసన సంఘం సభ్యులు మంత్రి చొరవపట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం యోగా సెంటర్ సభ్యులందరితో మంత్రి బుగ్గన కలిసి ఫోటో దిగారు.



Comments