క్షయ లేని సమాజం అందరి లక్ష్యం కావాలి : ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్.



క్షయ లేని సమాజం అందరి లక్ష్యం కావాలి : ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్



జిల్లా కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలేన దినోత్సవం


విజయనగరం, మార్చి 24 (ప్రజా అమరావతి):

క్షయ లేని సమాజం అందరి లక్ష్యం కావాలని ట్రైనీ సహాయ కలెక్టర్‌ బి.సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్ పేర్కొన్నారు. ప్రపంచ టి.బి.దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యీ వ్యాధిపై ప్రజల్లో నెలకొని వున్న అపోహలను తొలగించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇది పూర్తిగా నయం చేయదగిన వ్యాధి అనే అంశంపై తగిన అవగాహన కలిగించాల్సి వుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో యీ వ్యాధి నిర్ఱారణ మరింత సులువుగా మారిందని, దీనిని వినియోగించుకొని ప్రతి కేసును గుర్తించడం ద్వారా యీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలమన్నారు. యీ వ్యాధి నయం చేసేందుకు ప్రభుత్వమే రోగులకు పూర్తిస్థాయిలో మందులు అందజేస్తోందని, వాటిని వైద్యులు సూచించిన విధంగా వినియోగించి వ్యాధిగ్రస్తులు యీ వ్యాధి నుంచి విముక్తి పొందాలన్నారు. జిల్లాలో పది మండలాల్లో క్షయ వ్యాధి చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి వ్యాధిగ్రస్తునికి నెలకు రూ.500 సహాయంగా అందజేయడం జరుగుతుందన్నారు. యీ సందర్భంగా జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించి, క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. క్షయవ్యాధిని కనుగొన్న రాబర్ట్‌ కోచ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.భాస్కరరావు మాట్లాడుతూ సకాలంలో వ్యాధిని గుర్తించి మందులు వేసుకుంటే వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. ఆధునిక పద్ధతుల్లో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నందున టి.బి.నిర్ధారణ సులభతరమైందని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.గౌరీశంకర్‌ అన్నారు. ప్రతి గర్భిణీ ప్రసవం అయిన వెంటనే శిశువుకి బి.సి.జి. టీకా తక్షణమే వేయిస్తే మున్ముందు టి.బి. వ్యాధి సోకకుండా నియంత్రించగలమన్నారు.

జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారిణి డా.రాణి మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా యీ వ్యాధి నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యీ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఎవరికి త్వరగా వ్యాపిస్తుంది, యీ వ్యాధి వల్ల శరీరంలో ఏ అవయవాలు ప్రభావితమవుతాయనే అంశాలను వివరించారు.

యీ కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు.



Comments