దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాను.

 ఓటుకు లక్ష పంచినా పిఠాపురంలో జనసేనదే గెలుపు 


• దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాను.


  

• విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం.


• శ్రీమతి వంగా గీత, శ్రీ చలమలశెట్టి సునీల్ భవిష్యత్తులో జనసేనలోకి రావాలని కోరుకుంటున్నాం


• కాకినాడ లోక్ సభ స్థానం జనసేన అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ 


• జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం


అమరావతి (ప్రజా అమరావతి ):- పిఠాపురం గెలుపుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి... విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తానని వెల్లడించారు.  జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచి దేశం మొత్తం మనవైపు చూసేలా చేద్దామన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 160 మంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు పాల్గొన్నారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పిఠాపురం నాకు ప్రత్యేకమైన నియోజకవర్గం. గెలుపు కోసం ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోలేదు. రాష్ట్రం కోసం పని చేసే నన్ను.. గెలిపించే నియోజకవర్గం ఉండాలన్న సమయంలో పిఠాపురం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు మా నియోజకవర్గంలో పోటీ చేయ్ నిన్ను అసెంబ్లీకి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పిన తీరు నా గుండెకు తాకింది. 2009, 2019లో పిఠాపురం నుంచి పోటీ చేయమని చాలా మంది అడిగారు. అప్పుడు కుదర్లేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.  

• అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తిని 

అందరిని కలుపుకొని వెళ్లే వ్యక్తిని... సమస్యను తగ్గించే వ్యక్తిని... సమాజాన్ని కలిపే వ్యక్తిని... ఒక్కసారి నేను పని చేయడం చూస్తే నన్ను ఎప్పటికి వదులుకోరు. మీ అందరి, సహకారం, దీవెనలతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో బలమైన విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారికి చేయూతనిచ్చే పథకాలు లేవు. కడుపు కాలిన మత్స్యకారుల బాధను అర్ధం చేసుకోగలను. ఉప్పాడ గ్రామం నిత్యం కోతకు గురవుతోంది. ఇప్పటికే పాత ఉప్పాడ గ్రామం మూడొంతులు కోతకు గురైంది. గుడి.. బడి.. రోడ్డు.. ఇళ్లు అనే తేడాలేదు. సర్వం కడలి గర్భంలో కలిసిపోతోంది. దానికి శాశ్వత పరిష్కారం చూపించాలి. నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది.  దానిని నిలువరించలేకపోతున్నామని చాలా మంది పెద్దలు నిస్సహాయత వ్యక్తం చేశారు. మన ప్రభుత్వంలో సహజవనరులు దోపిడీకి గురికాకుండా చూసుకుంటాం.  ప్రజలను భయపెట్టే శక్తులను సంపూర్ణంగా నిలువరించే బాధ్యత తీసుకుంటాను. 

• వైసీపీ వాళ్ళా బీసీలకు అండగా ఉండేది?

పిఠాపురంలో నన్ను నిలువరించే బాధ్యత పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నారంట. ఢిల్లీలో ఆయన్ని ఒక సందర్భంలో కలసినప్పుడు- చిత్తూరు జిల్లాలోని తమ నియోజకవర్గంలో తమకి పోటీగా బయటవారిని రానియ్యం... అని చెప్పారు. వాళ్ళ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన నుంచి యాదవ సమూహానికి చెందిన యువకుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ వ్యక్తి బయటకు వెళ్లి పార్టీ పెడితే.. అతనిపై దాడి చేశారు. ఇలాంటి వాళ్లు బీసీలకు అండగా ఉన్నామని చెబుతారు. ఇలాంటి వాళ్ళా బీసీలకు అండగా ఉండేది? మళ్ళీ క్లాస్ వార్ అని మాట్లాడుతారు. వారి ఉద్దేశం తాము తప్ప ఎవరూ రాజకీయాల్లోకి రాకూడదు. అది సరికాదు అని నేను అంటున్నా. 

• ఓటుకు లక్ష ఇచ్చేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో?

నేను రాజకీయాల్లో దశాబ్దకాలంగా పోరాడుతున్నాను. ప్రజాస్వామ్యంలో నేను ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప ఎవరికీ హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకలు ఉండకూడదని రూ.100 కోట్లు, 150 కోట్లు ఖర్చుపెడతాం అంటున్నారు. అవసరం అయితే కుటుంబానికి లక్ష రూపాయిలు ఇచ్చి ఓట్లు కొనేయమని చెబుతున్నారు. అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలే ఆలోచించాలి. మద్యపాన నిషేధం అన్న సీఎం సారా వ్యాపారిగా మారిపోయారు. వారి డబ్బు తాలూకు శక్తి నాకు తెలుసు. కానీ పిఠాపురంలోని శక్తి పీఠం అమ్మవారి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటే మనిషికి లక్ష పంచినా జనసేనే గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నే గెలుస్తాడు. 

• శ్రీమతి వంగా గీత గారు జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా 

శ్రీమతి వంగా గీత గారు 2009లో పి.ఆర్.పి. ద్వారా ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్లారు. ప్రస్తుతం దురదృష్టవశాత్తు నాకు ప్రత్యర్ధిగా ఉన్నారు. భవిష్యత్తులో గీత గారు వైసీపీ వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నాను. శ్రీ చలమలశెట్టి సునీల్ గారు బాగా పరిచయం ఉన్నవారే. 2009లో పి.ఆర్.పి. ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. సునీల్ గారు ఇటీవల ఒక పెళ్లిలో కూడా కలిశారు. ఆయన మంచి వారేగాని తప్పు పార్టీని ఎంచుకున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానంలో జనసేన భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. కాకినాడ రాష్ట్రానికి కీలకమైన ప్రాంతం.  ఈ రోజు పార్టీలో చేరేందుకు అన్ని కులాల నుంచి వచ్చారు. నా కులానికి నేను అభిమానిస్తా... మిగతా కులాలను గౌరవిస్తాను. 

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ అదృశ్యమైందని నాకు స్వయంగా సందేశం పంపారు. నన్ను మాట్లాడమని అడిగారు. ఆ సమయంలో ఆయన టీడీపీని తిట్టిపోశారు. అదే గొంతుక వైసీపీ రాగానే అడగడం మానేసింది. టీడీపీ ఉన్నప్పుడు ఒకలా.. వైసీపీ వస్తే మరోలా మాట్లాడకూడదు. ప్రతి పాలసీ మీద అవగాహనతో మాట్లాడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య లేవనెత్తినప్పుడు శ్రీ అమిత్ షా గారితో నేరుగా చెప్పాను. అది మా ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సమస్య అని. ప్రైవేటీకరణ వద్దని కేంద్రంలో పెద్దలను కోరాను. ఈ రోజు వరకు ఆపగలిగాను. కాయిలా పడిన పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణ శ్రీ పీవీ నరసింహారావు గారి హయాంలో మొదలయ్యింది. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో నాది ఇప్పటికీ ఒకటే మాట. నేను ఏది మాట్లాడినా సాధ్యమైనంత వరకు సాధించేందుకే ప్రయత్నం చేస్తాను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే.. ఎలా సాధ్యపడుతుంది అని ప్రశ్నించారు. ఈ రోజు చేసి చూపించాను. వ్యూహం నాకు వదిలేయమన్నాను. ఈ రోజు ప్రధాన మంత్రి గారు సభకు వచ్చారు. 

పిఠాపురంని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. భారతదేశంలో ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అనే స్థాయికి తీసుకువస్తాను. రాష్ట్రాన్ని ఏ విధంగా చూపించాలో.. అందుకు మోడల్ గా ముందు పిఠాపురాన్ని మారుస్తాను. అభిమాన బలాన్ని పిఠాపురం తీసుకువచ్చి కూర్చోబెడతా. జాబ్ మేళా, జాబ్ క్యాలెండర్ల పెట్టేందుకు ఒక్కోసారి ప్రభుత్వాలు కూడా అవసరం లేదు. పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనివ్వను. సెరీ కల్చర్ రైతులకు పట్టు మార్కెట్ ఏర్పాటు చేస్తాను. ఉప్పాడ చీరలకు ప్రత్యేక మార్కెటింగ్ సౌకర్యం తీసుకువస్తాను. దేశ, విదేశాల్లో నా అభిమానులు స్థిరపడి మంచి స్థానాల్లో ఉన్నారు. వారి సహకారంతో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను.

• కాకినాడను గంజాయి ప్యారడైజ్ గా మార్చారు 

కేంద్ర నాయకత్వం ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారు. నేను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోనే అడుగుపెడతా అని చెప్పాను. ముందుగా రాష్ట్రానికి ఆ తర్వాత దేశానికి సేవ చేస్తానని చెప్పా. శ్రీ ఉదయ్ శ్రీనివాస్ నా కోసం త్యాగం చేశాడు. అందుకే ఆయన్ని ఎంపీ అభ్యర్ధిగా పంపుతున్నాను. కాకినాడ పార్లమెంటు భారీ మెజార్టీతో గెలవాలి. శ్రీ ఉదయ్ శ్రీనివాస్ నాకు సోదరుడి లాంటి వారు. 


రాష్ట్రానికి సుస్థిరత ఇవ్వాలని వైసీపీకి మనసులో లేదు. అందుకే రాష్ట్రం ఇలా తయారయ్యింది. నా కేడర్ ని నేను రక్షించుకుంటా. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు శ్రీ కొట్టే సాయి మీద చెంపదెబ్బ పడితే ఢిల్లీ వెళ్లే వాడిని ఆగి మరీ తిరుపతి వెళ్లాను. కాకినాడను పెన్షనర్ల ప్యారడైజ్ అంటారు. అలాంటి కాకినాడ ప్యారడైజ్ ఫర్ గంజాయి తయారైంది. క్రైమ్ సిటీగా మారింది. వీటిని నిలువరించాలంటే బలమైన వ్యక్తులు ప్రజాప్రతినిధులగా ఉండాలి. శ్రీ మోదీ గారి ఆలోచన 2029 గురించి కాదు. 2047 లక్ష్యంగా సమాజం మొత్తం మార్చాలని ఆలోచిస్తున్నారు. అది జరగాలంటే యువ నాయకత్వం అవసరం. పిఠాపురం ఎమ్మెల్యేగా నేను. కాకినాడ ఎంపీగా శ్రీ ఉదయ్ పోటీ చేయబోతున్నాం. ఈ ఎన్నికలు గీటు రాయి. దశాబ్దం తర్వాత నాకు ఓటు వేయమని నోరు తెరిచి అడుగుతున్నాను. నాలుగు దశబ్దాల చరిత్ర ఉన్న టీడీపీకి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు ఒక బలమైన అలయెన్స్ తీసుకువచ్చాను.  

• పిఠాపురంలో లక్ష ఓట్ల మెజార్టీ రావాలి 

ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో గాజు గ్లాసు మీద డైలాగ్ శ్రీ హరీష్ శంకర్ ఒత్తిడితో చెప్పాను. గ్లాసుకి ఉన్న లక్షణం పగిలే కొద్ది పదునెక్కుద్దని. ఒక దశాబ్దం అధికారం లేకుండా పార్టీ నడిపించిన వాడిని. 21 ఎమ్మెల్యే, రెండు పార్లమెంటు సీట్లు కొట్టి చూపించామంటే భారత దేశం ఆంధ్రా వైపు చూసేలా చేస్తాను. ఇవాళ మనం లేకపోతే పొత్తులేని పరిస్థితి. రెండు చేతులు ఎత్తి నమస్కరించి రాష్ట్రం కోసం కలసి రావాలని కోరాను. మన నేల తల్లిని మనమే కాపాడుకోవాలి. గుడ్డిగా ఓటు వేయొద్దు. అన్నీ ఆలోచించి మంచివారిని ఎన్నుకోండి. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం మనం తీసుకుంటున్నాం. భవిష్యత్తులో స్థానిక ఎన్నికల్లో మూడో వంతు పదవులు తీసుకుందాం. కష్టపడే వారిని గుర్తుపెట్టుకుని తప్పకుండా న్యాయం చేస్తాం. మనమంతా జాషువా చెప్పిన విశ్వనరులం. కులాలు, మతాలు, ప్రాంతాలు దాటి పిఠాపురం అభివృద్ధి చేసుకుందాం. పిఠాపురం లక్ష ఓట్ల మెజారిటీ రావాలి. కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలని అన్నారు. 

• మన కూటమి విజయం కోసం బటన్ నొక్కండి : శ్రీ బి.మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు

పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాటలోనూ మంచే ఉంటుంది. పది మంది బాగు కోరుకునే వ్యక్తి ఆయన. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి వ్యక్తి ఓటు వేసే రోజు బాధ్యతగా వ్యవహరించాలి. గత ఐదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్నవారు పని చేయాని బటన్లు నొక్కారు.. మే 13న ప్రతి ఓటరూ మన కూటమి గెలుపు కోసం బటన్ నొక్కండి. ఎన్డీఏ కూటమి గెలిపించేలా బలంగా పని చేయండి అని అన్నారు

• శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే బాధ్యత తీసుకుందాం: శ్రీ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ లోక్ సభ అభ్యర్థి

కాకినాడ లోక్ సభ జనసేన అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “పిఠాపురం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని ఆ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం కోరుకుంది. స్వయానా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం వెయ్యి రెట్లు ఆనందాన్నిచ్చింది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనమంతా లక్ష మెజారిటీతో గెలిపించాలి. ఆ బాధ్యత పిఠాపురం ఓటర్లు అందరం తీసుకుందాం” అన్నారు.

Comments