బేతంచెర్లలో 'వాల్మీకి భవన్'ను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

 *పత్రికా ప్రకటన


*బేతంచెర్లలో 'వాల్మీకి భవన్'ను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో సమరయోధులు వాల్మీకులు*


*పఫ్ షీట్ నిర్మాణాలకు పాత రేకుల షెడ్డుకు తేడా తెలియని ప్రతిపక్షాలు*


*కాంట్రాక్టర్లు బాగుపడతారనే డోన్ లో గత పాలకులు ఏ నిర్మాణం చేపట్టలేదా?*


*అధికారం ఉన్నా లేకున్నా జనంతో ఉండే వారే సీమలో మొగోళ్లు!*


*చుక్క నీరు లేని ప్రాంతాన్ని నీళ్లు చాలని కుళాయి కట్టేసేలా చేశాం*


*జనం గొంతెండుతున్నా జనం గొంతులు కోసే ఫ్యాక్షనా మీ రాజకీయం?*


*జీపు మీద తుపాకి పెట్టి బెదిరించే పిట్టలదొరలను లేకుండా చేశాం*


*సామాన్యులకు ఉపయోగపడే ఒక్క మంచి పనైనా మీ హయాంలో చేశారా?*


*అధికారమే పరమావధిగా ఏకమైన కుట్రల కూటమి ప్రజల కన్నీళ్లకు ఏం సమాధానం చెబుతుంది?*బేతంచెర్ల, నంద్యాల జిల్లా, మార్చి, 14 (ప్రజా అమరావతి); బేతంచెర్లలో రూ.2 కోట్లతో నిర్మించిన 'వాల్మీకి భవన్'ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. హెచ్ కొట్టాల గ్రామ సమీపంలో 1.50 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన వాల్మీకి భవనం గురువారం మంత్రి బుగ్గన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో సమరయోధులు వాల్మీకులని పేర్కొన్నారు. వాల్మీకులు మన ముందు తరాల ప్రభుత్వ పాలనలో తలారులుగా  కీలక భూమిక పోషించారన్నారు. పోలీస్ వ్యవస్థ లేని కాలంలో రక్షకభటుల్లా గ్రామాలను రక్షించడంలో వారి పాత్ర ఎంతో ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలతో సత్సంబంధాలు, మంచి చేసే గుణం వాల్మీకులకున్న నేపథ్యంలో రాష్ట్రంలోనే వారి కోసం ఎక్కడా లేని విధంగా వాల్మీకి భవన నిర్మాణం ఏర్పాటు చేసినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.


*అత్యాధునిక పఫ్ షీట్లకు పాత రేకుల షెడ్లకు తేడా తెలియని వెర్రి విపక్షాలు*


డోన్ నియోజకవర్గంలో టీడీపీ విపక్ష నాయకులకు అత్యాధునికంగా ఏర్పాటు చేసి పఫ్ షీట్ల నిర్మాణం విలువ తెలియకపోవడం వారి అవగాహన రాహిత్యమన్నారు. అద్భుత నిర్మాణాలని రేకుల షెడ్లని మాట్లాడడమే అందుకు నిదర్శనమన్నారు. వివిధ లేయర్ల వారీ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ షీట్ల వల్ల ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా ఎక్కువ కాలం మన్నిక ఉండేలా జాగ్రత్తలు తీసుకుని మరీ శ్లాబుల కన్నా ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టి డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక ఆకృతులతో నిర్మాణాలు చేపట్టినట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే గుడి, బడి, ఆస్పత్రి, రోడ్ల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే అదేమి అభివృద్ధి అంటున్న ఇలాంటి స్వార్థ ప్రతిపక్షాలు డోన్ ప్రజలకు అవసరమా అని మంత్రి ప్రశ్నించారు. ఏ భవనాలనైనా కాంట్రాక్టర్లు కట్టడం ఎప్పటినుంచో ఉన్న పద్ధతి.మరి నిర్మాణాలను కాంట్రాక్టర్లు కట్టక ఎవరు కట్టాలనుకుంటున్నారో ప్రతిపక్షాలు చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు లాభాలు రాకూడదు, ప్రజలకు మేలు జరగకకూడదనే ఏ చిన్న అభివృద్ధి దిశగా మీరు ఏ ఆలోచన చేయలేదా అని మంత్రి బుగ్గన సూటిగా ప్రశ్నించారు. బీసీల పేరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి ఏ ఒక్క బీసీకైనా ఉపయోగపడే ఒక్క పనైనా చేశారా చెప్పాలన్నారు. కనుమకింద కొట్టాలలో ఒక వృద్ధురాలు భవన నిర్మాణాల ప్రారంభోత్సవాల అనంతరం తనతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు మీ ఊరికి కూడా వచ్చారా అని ప్రశ్నించినప్పుడు ఇంతవరకూ ఎవరూ రాలేదు నాయనా..మా మంత్రి రాజా రెడ్డి రోడ్డేశాడు..కాబట్టి ఇప్పుడు వస్తారని అవ్వ మాట్లాడిన విషయాలను మంత్రి ప్రస్తావించారు. ఎంబాయ్ ని బొంబాయ్ చేస్తామని గత ప్రభుత్వ నాయకులు ఏమీ చేయలేదన్నారు. కానీ, మన ప్రభుత్వ హయాంలో బేతంచెర్లలోని గోరుమాను కొండను విద్యాలయాల నిర్మాణాలతో లండన్ లా మార్చామన్నారు. కాంట్రాక్టర్లు లాభాలొస్తాయనే ఏ పని చేయకుండా ప్రతిపక్షాలు ఏళ్లకేళ్లు కాలక్షేపం చేశాయని విమర్శించారు.


*వేర్వేరుగా ఉండి వందల ప్రాణాలు తీసిన మీరా కలిసిపోయి అభివృద్ధి చేసేది?*


40 ఏళ్లు రాజకీయాలు చేసిన డోన్ విపక్ష నాయకులు 200 మంది అమాయకులను బలితీసుకున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అలాంటిది అధికారం కోసం కలిసిపోయిన మీ కుట్రల కూటమి ఆ బాధిత కుటుంబాల కన్నీళ్లకు ఏం సమాధానం చెబుతరాని ప్రశ్నించారు. సామరస్యంగా జనంతో మమేకం కావాల్సిన రాజకీయ నాయకులు వారికి మరింత చిచ్చు పెట్టి చంపిరాపోరా తర్వాత చూసుకుందామని రెచ్చగొట్టిన మీరా నాయకులు అన్నారు.  ఈ ఐక్యత నాటి నుంచే ఉండి ఉంటే వందల కుటుంబాలు ప్రశాంతంగా బతికేవి కావా అన్నారు. ప్రతిపక్షాల అర్థంలేని బెదిరింపులకు చిన్నపిల్లలు కూడా భయపడరన్నారు. గూటుపల్లి, తవుసుపల్లెల్లో జీపు మీద తుపాకి పెట్టి జనాల్ని భయపెట్టిన ప్రతిపక్షాలు ఆ అభివృద్ధినే కొనసాగిస్తారా సమాధానం చెప్పాలన్నారు. గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో పిట్టల దొరలకు చోటు లేకుండా చేశామన్నారు. అధికారం ఉన్నా లేకున్నా జనం కోసం నిలబడిన వారే సీమలో మొగోడన్నారు. తాగునీరు లేని పల్లెలు గొంతెండుతున్నా మీరు గొంతులు కోసే రాజకీయాలు చేసిన సందర్భాలను ప్రజలు మరచిపోలేదన్నారు. చుక్క నీరు దొరకని డోన్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో నీరెక్కువయి కుళాయిని కట్టేసుకునేలా అభివృద్ధి చేశామన్నారు. బుగ్గనకు టికెట్ వస్తుందా అని నన్ను విమర్శించిన నాటి నాయకులు నేడు నాపై పోటీకి టికెట్ కోసం అల్లాడే పరిస్థితి వచ్చిందన్నారు. కానీ, నా మీద విశ్వాసంతో ముఖ్యమంత్రి మొట్టమొదట ప్రకటించిన సీట్ డోన్ అని, ప్రజలు ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించినందుకే డోన్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. అభివృద్ధి పనికి పునాది రాయి కూడా వేయని విపక్షాలు పూర్తి కాకుండా ప్రారంభోత్సవాలు చేశామని తనను విమర్శించడం హాస్యాస్పదమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.


Comments