బాపట్లను టూరిజం హబ్‌గా మారుస్తా. ఆక్వా, ఆర్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తాం.*ఐదేళ్ళ జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు*


*ఐదేళ్ళుగా రాష్ట్రానికి పట్టిన శని మే13 తేదికి వదలిపోతుంది*


*ఖజానాలో ఉన్న డబ్బులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛను ఇవ్వలేక జగన్ రెడ్డి తిరిగి నాపై బురద జల్లుతున్నాడు*


*రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000 చేసింది నేనే. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దకే తెచ్చి అందించే బాధ్యత నాదే*


*బాపట్లను టూరిజం హబ్‌గా మారుస్తా. ఆక్వా, ఆర్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తాం


*


*బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దోపిడీదారుడు.. ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్ధి సేవాభావం కలవాడు*


*బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఒక రౌడి.. ఎన్డీఏ ఎంపీ అభ్యర్ధి నిజాయితీగల ఐపీఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి*


*ఎవరు కావాలో మీరే తేల్చుకోండి...!*


- *బాపట్ల ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు*


బాపట్ల (ప్రజా అమరావతి):- బాపట్లలో ఎక్కడ చూసినా తెలుగింటి ఆడపడుచులే కనబడుతున్నారు. నేను ఎక్కడికెళ్ళినా యువతే ఉంటున్నారు. యువత ఎక్కడ ఉంటే విజయం వారిదే.

నేనెన్నో సార్లు బాపట్లకు వచ్చాను. కానీ నేడు ప్రజాగళాన్ని వినిపించేందుకు వస్తే బాపట్ల బ్రహ్మరధం పట్టింది. ప్రజల స్పందన చూస్తుంటే నాకు గెలుపుపై ఏ మాత్రం అనుమానం లేదు.

ఐదేళ్ళుగా రాష్ట్రానికి పట్టిన శని మే13 తో వదులుతోంది. ఈస్టర్ రోజు బాపట్లలో ఉండడం నా అదృష్టం. భారత రాజ్యాంగాన్ని రాసి మనకి హక్కులు ఇచ్చిన అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టింది మార్చి నెలలోనే

గత సంవత్సరం డిసెంబర్ లో నేను బాపట్లకు వచ్చాను. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వారికి ధైర్యాన్ని ఇచ్చాను.

ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా చితికిపోయింది. వ్యవసాయ ఆధారిత కూలీలు ఇబ్బందులు పడ్డారు. వారికి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు.

వరదలు వస్తే కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల పొలాలు నాశనమయ్యాయి. ధాన్యం కొనలేదు. కొన్నవాటికి డబ్బులు ఇవ్వలేదు. పక్కనే మిల్లు ఉన్నా ఎక్కడో ఉన్న మిల్లుకు పంపించి రైతుల పొట్ట కొట్టారు. రైతంటే కనీస గౌరవం లేని ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం

కరోనా సమయంలో అందరికి లాక్ డౌన్ చేసినా రైతుకు మాత్రం లాక్ డౌన్ లేదు. వారికి కూడా లాక్ డౌన్ పెట్టి ఉంటే మనకు తిండి ఉండేది కాదు.

అన్నదాత కష్టాల్లో ఉంటే నేనొస్తున్నాని తెలిసి పరదాలు కట్టుకొని జగన్  రెడ్ కార్పెట్ మీద వచ్చాడు

ఐదేళ్ళు ఆకాశంలోనే తిరిగాడు,  కిందున్న చెట్లు కొట్టేశాడు. రెండు ఫోటోలు తీసుకొని ఒక్క రూపాయి సాయం కూడా చేయలేదు. దీనికి అదనంగా కరువు వచ్చింది. కనీసం వేసవిలో తాగు నీరు ఇవ్వలేని దద్దమ్మ జగన్ రెడ్డి.

తమ్ముళ్లు ఆకాశంలో ఎగురుతూ తెలుగుదేశం జెండాలు ఎగరేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కార్యకర్తలకు నా అభినందనలు. మీ ఉత్సాహం చూస్తుంటే మనకి ఇక అన్ స్టాపబుల్

మూడు పార్టీల కలయిక మా కోసం కాదు.. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మాత్రమే. ఐదు సంవత్సరాల దుష్టపాలనను మీరు చూశారు. ఒక అహంకారి రాష్ట్రాన్ని అతలాకుతం చేశాడు.

మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, మీ జీవన ప్రమానాలు మెరుగవ్వాలి. కానీ అలా జరగలేదు. ప్రజలపై బాదుడే బాదుడు. తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ రేట్లు, నిత్యవసర సరుకుల ధరలు, చెత్త పన్నులు, వేధింపులు పెరిగాయి.

నరేంద్రవర్మ ఎలాంటి వాడో, ఇక్కడున్న వైకాపా అభ్యర్ధి ఎలాంటి వాడో ప్రజలే తేడాలు చూడాలి.

నేను పట్టిసీమను తీసుకొచ్చి కృష్ణా డెల్టా ద్వారా మీకు నీళ్ళు అందించాను. నేను తీసుకువచ్చానని అహంకారంతో జగన్ రెడ్డి పట్టిసీమను వాడటం ఆపేసాడు.

జగన్ రెడ్డి ఇచ్చిన ఇంటి జాగాలను రద్దు చేయను. ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఇంకా ఆర్థిక సాయాన్ని అందించి బ్రహ్మాండమైన ఇళ్లు కట్టిస్తాను.

బాపట్లకు టిడ్కో ఇళ్లను రానివ్వకుండా చేశాడు. మన రాష్ట్రానికి రెండు కళ్లు అమరావతి, పోలవరం.

తెలుగు జాతి కోసం హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశాను. ఎయిర్ పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్ కట్టాం, ఐటికి ప్రాధాన్యతనిచ్చాం.

ఇక్కడున్న మన పార్లమెంటు అభ్యర్ధి కృష్ణ ప్రసాద్ కూడా నాడు ఐపిఎస్ అధికారిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో ఉండి అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నారు.

రాష్ట్రం విడిపోవడంతో మనం నష్టపోయాం. మరలా పట్టుదలగా అమరావతికి నేను ప్లాన్ చేశా. మరలా తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే బాపట్లలోనే ఉద్యోగాలు చేసుకునేవారు.

అమరావతి అభివృద్ధి కాలేదు. 34 వేల ఎకరాలు నా మీద నమ్మకంతో రైతులు భూములను త్యాగం చేశారు. వారికి తిరిగి కొంత భూమిని కూడా ఇచ్చాను.

అమరావతిలోని భూములను పాడుపెట్టి 3 లక్షల కోట్ల  రూపాయిల ప్రజా ధనాన్ని జగన్  విధ్వంసం చేశాడు. సంపదను నాశనం చేసి మీ నెత్తిన రూ.13 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు.

ఈ అప్పును సాక్షి పేపర్ కడుతుందా? భారతి సిమెంట్ కడుతుందా? మీరే పన్నుల ద్వారా కట్టాలి. దానికి మాత్రం సమాధానం చెప్పరు

రాష్ట్రానికి రెండో కన్ను పోలవరాన్ని నాశనం చేశాడు. పోలవరం ద్వారా రాయలసీమకు నీరు అందించవచ్చు, ప్రతీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది  నా సంకల్పం. టెండర్లు మార్చి పోలవరాన్ని గోదావరిలో కలిపాడు.

ఆక్వా రైతులు ఎవరైనా బాగుపడ్డారా? టీడీసీ హయాంలో రాష్ట్రంలో 2లక్షల ఆక్వా హెక్టార్ల సాగును ప్రోత్సాహించాం. 3 రెట్లు ఖర్చులు పెరిగినా ఆదాయం మాత్రం లేదు. 10 ఎకరాలు పెట్టి జోన్, నాన్ జోన్ అని ఆంక్షలు పెట్టారు.

ఈ రాష్ట్రానికి కోస్టల్‌లో ఆక్వా కల్చర్ అవసరం. రూ.1.50 పైసాకే అందరికి కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. మత్స్యకారులను దెబ్బతీసే విధంగా జీవో నెం.217 తీసుకువచ్చారు. అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేసి మీకు స్వేచ్ఛనిస్తాను. చెరువులను మీకే ఇస్తాను.

ముఖ్యమంత్రి ఒక విచిత్రమైన వ్యక్తి. నా జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ఇతన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడంలేదు. నా బీసీలు అంటూ బీసీలకు అందించిన 30 పథకాలను రద్దు చేశాడు. ఐదేళ్ళలో ఒక్క బీసీకి ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు.

తన అక్కను వేధిస్తున్నాడని తిరగబడ్డ అమర్నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి రోడ్డు మీద తగలబెట్టాడు. జైలికి వెళ్ళిన రెండు నెలలోనే నిందుతులు బయటతిరుగుతున్నారు. అలాంటి వారి మక్కెలు విరగ్గొడతా...

నా ఎస్సీలు అంటాడు...నేనిచ్చిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. దళిత డ్రైవర్‌ను చంపేసి డోర్ డెలివరీ చేస్తూ నా ఎస్సీలు అంటాడు.

మాస్క్ అడిగిన డాక్టర్ను పిచ్చోడిని చేసి చంప్పాడు. అంబేద్కర్ పేరుతో విదేశి విద్యను తీసుకొస్తే ఆ పేరు మార్చి జగన్ రెడ్డి పేరు తన పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయలేదు. అంబేద్కర్ కంటే గొప్పోడివా..అని జగన్ రెడ్డిని అడుగుతున్నా..

బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన అంబేద్కర్ కు అన్యాయం జరుగుతుంటే మేము ఉపేక్షించం. సబ్ ప్లాన్‌, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నీ మూసేశాడు. అందరితోపాటే రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నాడు తప్ప.. జగన్ రెడ్డి ఎస్సీలకు చేసిందేమి లేదు.

నా మైనార్టీలు అంటూ 10 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలపై దాడులు పెరిగాయి. వేధింపులు భరించలేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారు. మేము పొత్తు పెట్టుకుంటే జగన్ రెడ్డికి నిద్ర రాదు. అందుకే కుట్రలు చేసైనా పొత్తు చెడగొట్టాలని ప్రయత్నాలు చేశాడు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనిద్దరం కలవాలని పవన్, నేను నిర్ణయించుకున్నాం.

రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింతగా దూసుకువెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న జగన్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా. కేంద్రంలో మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లులన్నిటికీ జగన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. నన్ను విమర్శించే హక్కు జగన్ రెడ్డికి లేదు.

ఉర్దూ యూనివర్సిటీలు తీసుకువచ్చాం, హజ్ హౌస్‌లు కట్టాం, దుకాణ్ అవుర్ మాకాణ్ ఇచ్చాం. ఆడబిడ్డల షాదీ కోసం మొత్తం రూ.150 కోట్లు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఐదేళ్ళుగా మైనార్టీలకు జగన్ రెడ్డి ఏమైనా చేశాడా?

2014-19లో ముస్లీం కోసం 4% ఉద్యోగాలు కూడా సుప్రీం కోర్టులో ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో తెలుగు జాతి కోసం మూడు పార్టీలు కలిసాం. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే ఈ పొత్తు.

ఒంటిమిట్టలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ఓ చేనేత భూమిని బలవంతంగా లాక్కున్నారు. అతని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. జగన్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనికి పొంతన లేదు.

మద్యపాన నిషేధమని చెప్పి మద్యం ధరలు మూడు రేట్లు పెంచేశాడు. జే బ్రాండ్, నాశిరకం మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఏ మద్యం షాపులో కూడా డిజిటల్ పేమెంట్ చెల్లింపులు లేవు. ఈ చిదంబర రహస్యమేంటో ప్రజలే అర్థం చేసుకోవాలి.

రూ.200 వచ్చే కరెంటు ఛార్జీలను రూ.2000 చేశాడు. రూ.1000 దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.5 వేలు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఇళ్లు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక ఆర్మీని పెట్టుకొని ఇసుకను దోచేస్తున్నాడు.

జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి రావాలంటే జగన్ రావాలి, జగన్ ఉండాలి. గంజాయి, డ్రగ్స్, నాశిరక మద్యంతో కుటుంబాలు నాశనమవుతున్నాయి. బాపట్లలో కూడా గంజాయి కల్చర్ పెరిగింది. అందులో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం కూడా ఉంది. దుర్మార్గులు రాష్ట్రాన్ని తగలబెడుతున్నారనేది నా బాధ. అందుకే నేను వచ్చాను.

పిల్లలకు ఉద్యోగాల కోసం పోరాడాం. అందరిని జగన్ రెడ్డి వేధించాడు. ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టాడు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతా.

సంపద సృష్టించడం, నీతి వంత పాలన, అభివృద్ధి చేయడం, ఉద్యోగాలు ఇవ్వడం అన్నీ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే సూపర్ సిక్స్ తీసుకువచ్చాం. ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాజకీయాల్లో 8% రిజర్వేషన్‌లు తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.

డ్వాక్రా సంఘాలు నేను పెట్టా. ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్ పెట్టాను. మరుగుదొడ్లు కట్టించాను. దీపం కింద ఎప్పుడో నేను ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఆడబిడ్డలను ఆధారంగా చేసుకొని నాలుగు హామీలు ఇస్తున్నాను. ఎట్లా ఇస్తావ్ అని జగన్ రెడ్డి అడుగుతున్నాడు. నేను చెప్పను.. సంపద సృష్టించి చేసి చూపిస్తా. ఆదాయం పెరిగితే తిరిగి పేదవాడికే ఇస్తా. ఎక్కడ పేదరికమున్నా అక్కడ నేనుండి నా అనుభవంతో పేదరికాన్ని తగ్గిస్తా.

ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు ఆంక్షలు లేకుండా నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఎంత మంది బిడ్డలున్నా ఒక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్‌లు ఇస్తాం. ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తాం. వికలాంగులకు పింఛను పెంచి, వారికి ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. మీకు నేనే డ్రైవర్‌ని, అనుభవం, సేఫ్ డ్రైవర్ ని. ఎవరికి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని మీ గమ్యం చేర్చడం నా బాధ్యతా. దాన్ని నేను నెరవేస్తా.

మీ పిల్లల్ని బాగా చదివించి మీకు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. అన్నదాత పథకం కింద ప్రతీ రైతులు ఏడాదికి రూ.20 వేలు ఇచ్చి రైతును రాజు చేస్తా. గిట్టుబాటు ధర, వ్యవసాయ ఆధునీకరణ తీసుకువస్తాం. అప్పులు తగ్గించి, ఆదాయం పెంచుతాం. 20 లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇప్పిస్తా. నేను వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై మొదట సంతకాన్ని పెడతా. 

నువ్వు ఏం చేశావ్ అని జగన్ రెడ్డి నన్ను అడుగుతున్నాడు. నా ట్రాక్ రికార్డ్ చెప్పాక తిరిగి నోరు ఎత్తలా. 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేశా ఈ 14 ఏళ్ళలో 8 సార్లు డీఎస్సీ ఇచ్చాను. ఎన్టీఆర్ 3 సార్లు ఇచ్చారు. తెదెపా హయాంలో మొత్తం 11 సార్లు ఇచ్చాం. ఇప్పుడున్న  టీచర్లలో 75 శాతం మంది మేము నియమించిన వాళ్ళే.

దురదృష్టవశాత్తు జగన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క డీఎస్సీ పెట్టలేదు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఏపీపీఎస్సీలో డీఎస్పీ, సబ్ కలెక్టర్, ఆర్డీవో ఉద్యోగాలను జగన్ రెడ్డి అమ్ముకున్నాడు. మళ్లీ పరీక్షలు నిర్వహించి మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తాం.

ప్రపంచంలోని కంపెనీలను మన రాష్ట్రానికి తీసుకువస్తాను. ఇవి వచ్చేంత వరకు యువతకు అండగా ఉండి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. మరలా డబ్బులు కావాలంటే ఒక విజన్ కావాలి. ఆ విజన్ ను నేనెప్పుడో తయారు చేశాను. 1999లో తయారుచేసిన 2020 విజన్ ను మీరు హైదరాబాద్ లో చూస్తున్నారు.

రూ.2 వందల ఉన్న పింఛన్‌ను రూ.2 వేలు చేసింది నేనే. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి రాగానే పించను రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దకే పంపిణీ చేసే బాధ్యత నాది. జగన్ రెడ్డి ఉన్న పింఛను డబ్బులను కాంట్రాక్టర్‌లకు దోచిపెట్టాడు. ఇప్పుడు మా మీద బురద జల్లుతున్నాడు. అప్పులతో కాకుండా ఆదాయంతో ప్రజలను ఆదుకునే బాధ్యత నాది.

బాపట్ల పట్టణంలో యువతకు ఉద్యోగ కల్పన చేస్తాం. డ్రైనేజి, కలుషిత త్రాగు నీరు, దోమలు వంటి సమస్యలను పరిష్కరిస్తాం. బాపట్లలో కొత్త రిజర్వాయిర్‌ను నిర్మాణం చేస్తాం. బాపట్లను టూరిజం హబ్‌గా మారుస్తా. ఆక్వా, ఆర్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తాం. బాపట్లలోని హెచ్‌డిపిఏ టెక్నాలజీ ద్వారా మంచి నీరు అందిస్తాం. ఒరుగంటి రెడ్డిలకు ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా పైకి తీసుకువస్తా.

అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. పేదవాడికి కడుపు నిండా అన్నం పెడుతుంటే ఓర్వలేని వ్యక్తి జగన్ రెడ్డి. బాపట్లలో నరేంద్ర వర్మ నాయకత్వంలో 508 రోజుల నుంచి అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాడు. ఫౌండేషన్ ద్వారా రూ.5 కే మినరల్ వాటర్‌ను 31 గ్రామాలకు అందిస్తున్నాడు. పేదల వైద్య ఖర్చులకు ఆర్ధిక సాయం చేస్తున్నాడు. పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు, ఇమామ్, మౌజంలకు రంజాన్ తోఫా, మసీద్, చర్చి, గుడుల నిర్మాణాలకు ఆర్ధిక సాయం చేస్తున్నాడు. దివ్యాంగులకు సాయం చేశాడు. ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఉచిత పుస్తకాలు సరాఫరాలు చేశారు. ఇదే వర్మ బ్రాండ్. రాజకీయాలు కాదు సేవా భావమే వర్మ అభిమతం. బాపట్ల ప్రజలకు సేవలందించాలనే వర్మ రాజకీయాల్లోకి వచ్చాడు.

బాపట్లలో కోనా రఘుపతి ఇసుక మాఫియాతో ఇసుకను దోచేస్తున్నాడు. 50 అడుగుల లోతుకి ఇసుకను ఊడ్చేశాడు. దీని వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జగనన్న కాలనీలంటూ తక్కువ ధరలకు భూములను కొని ఎక్కువ ధరలకు అమ్ముకొని అందులో కూడా డబ్బులు కొట్టేసిన ఘనుడు. బాపట్లలో ఎవరైనా వెంచర్ వేయాలంటే ఎకరాకు రూ.10 లక్షల చొప్పున కప్పం కట్టాలి. వేరే వాళ్ళణి పెట్రోల్ బంకు పెట్టనివ్వకుండా..ఒక్కటే పెట్రోల్ బంకు పెట్టుకొని అరాచకాలు చేస్తున్నాడు.

సూర్యలంక తీర భూములపై కన్ను వేశాడు. టూరిజానికి పనికి వచ్చే 4 వేల ఎకరాల భూములను కొట్టేయాలని చూశాడు. భవన్నారాయణ స్వామి ఆలయానికి కోట్లు రూపాయిల విరాళాలు సేకరించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.

రానున్న ఎన్నికలు మా కోసం కాదు.. ఈ రాష్ట్రం కోసం. ఎన్డీఏకు మీరు ఓటు వేస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు. ధరల బాదుడు ఉండదు. కక్ష రాజకీయాలు ఉండవు. ప్రజాస్వామ్యంపై దాడులు ఉండవు. వ్యవస్థలు నిర్వీర్యం కావు. ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించి నెం.1 స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తాం. నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వస్తాం.

సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా తీసుకువెళ్ళి అభివృద్ధి చేస్తాం. సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. సంక్షేమాన్ని ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్.

ఈ రోజు మన మీటింగ్‌కు వచ్చి రద్దీ ఎక్కువగా ఉందని ఇంటికి తిరిగి వెళ్తున్న మన కార్యకర్త కుంచాల వెంకటరత్నంను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మరణించాడు. కుంచాల వెంకటరత్నానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మన కుటుంబసభ్యుడి మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల నేను ఏమీ హామీ ఇవ్వకూడదు. కానీ వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాను.

బాపట్ల ఉమ్మడి పార్లమెంటు అభ్యర్ధి కృష్ణ ప్రసాద్‌ను నేను వ్యక్తిగతంగా అతని పని తీరును చూశాను. నేను సీఎంగా ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలుగా ఐపిఎస్ అధికారిగా నా దగ్గర పని చేశాడు. మంచి వ్యక్తి. నీతి నిజాయితిగా బ్రతికి పది మందికి ఉపయోగపడ్డాడు. అందుకే వెతికి వెతికి ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కృష్ణ ప్రసాద్‌ను నిలబెట్టాం. బాపట్ల ఎంపీగా కృష్ణ ప్రసాద్‌ను, ఎమ్మెల్యే నరేంద్ర వర్మను గెలిపించాల్సిన బాధ్యత బాపట్ల ప్రజలపై ఉంది.

Comments