ఎన్టీఆర్ జిల్లా, మార్చి 26 (ప్రజా అమరావతి);
*అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి నిఘా కట్టుదిట్టం*
- ప్రలోభాలకు ఆస్కారం లేని వాతావారణంలో ఎన్నికల నిర్వహణకు కృషి
- నగదు, మద్యం, విలువైన వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
- ఎన్‌టీఆర్, సూర్యాపేట జిల్లాల అధికారుల మధ్య మంచి సమన్వయం
- ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని.. అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి ప్రత్యేక చెక్‌పోస్ట్‌లతో నిఘాను కట్టుదిట్టం చేసినట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
మంగళవారం జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు టోల్‌ప్లాజా సమీపంలోని రామ్‌కో లెర్నింగ్ సెంటర్ సమావేశమందిరంలో ఎన్‌టీఆర్ జిల్లా, సూర్యాపేట జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు జిల్లాల కలెక్టర్లు ఎస్.డిల్లీరావు, ఎస్.వెంకటరావు, ఎన్‌టీఆర్ జిల్లా సీపీ కాంతిరాణా టాటా, సూర్యాపేట జిల్లా ఎస్‌పీ బీకే రాహుల్ హెగ్డే, ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్‌తో పాటు సరిహద్దు నియోజకవర్గాల ఆర్‌వోలు, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఐటీ, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్‌టీ, అటవీ, బ్యాంకింగ్ తదితర శాఖల నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు వెంబడి నగదు, మద్యం, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విషయంలో ఇప్పటికే తీసుకున్న చర్యలు, కొనసాగించాల్సిన చర్యలు, రెండు జిల్లాల మధ్య సమన్వయం, సహకారం తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రలోభాలకు తావులేని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించే క్రమంలో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు జిల్లాల సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగిందని.. నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు వంటి వాటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి నిఘాను పటిష్టం చేశామని.. రెండు జిల్లాల అధికారుల మధ్య మంచి సమన్వయంతో, సమాచార మార్పిడితో సహకారంతో మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. ఫ్లయింగ్ స్వ్కాడ్స్ బృందాలు (ఎఫ్ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలైన్స్ బృందాలు (ఎస్ఎస్‌టీ) క్రియాశీలంగా పనిచేస్తున్నాయని.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కూడా సమర్థవంతంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. రెండు జిల్లాల ఉన్నతాధికారులు, నోడల్ అధికారుల మధ్య పరస్పర సహకారం బాగుందని.. ఇదేవిధమైన సహకారాన్ని ఎన్నికలు ముగిసేవరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. ముక్త్యాల, గరికపాడు, వత్సవాయి తదితర చెక్‌పోస్టులు ముఖ్యమైనవని.. చాలా కీలకమైన గరికపాడు చెక్‌పోస్టును ఇప్పటికే బలోపేతం చేశామని.. అవసరం మేరకు మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ చెక్‌పోస్టులు 24 గంటల పాటు పనిచేస్తున్నాయన్నారు. సరిహద్దు ప్రాంత గ్రామాల్లో గత ఎన్నికల్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
*సరిహద్దుల సమన్వయ సమావేశంతో గొప్ప మేలు: సీపీ కాంతిరాణా టాటా*
ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా మాట్లాడుతూ నగదు, మద్యం వంటి వాటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, సరిహద్దు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు రెండు జిల్లాల సరిహద్దుల సమన్వయ సమావేశం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పోలీస్, సెబ్, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, బ్యాంకింగ్ తదితర ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల మధ్య సమన్వయానికి దోహదం చేస్తుందన్నారు. నాలుగైదు పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 ఉమ్మడి చెక్‌పోస్టులు ఉన్నాయని.. 9 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులతో పాటు మరో ఆరు చెక్‌పోస్టులు జిల్లాలోపల పనిచేస్తున్నాయని.. అవసరం మేరకు వీటి సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. సరిహద్దుకు రెండువైపులా శాంతిభద్రతలు, నగదు, మద్యం వంటి వాటి అక్రమ రవాణా తదితరాలకు సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు అధికారుల మధ్య సమన్వయం, సహకారం అవసరమవుతుందని పేర్కొన్నారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. గత పదిరోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో రూ. 1.5 కోట్ల మేర నగదుతో పాటు మొత్తం దాదాపు రూ. 3.60 కోట్ల విలువైన సీజర్లు జరిగినట్లు తెలిపారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు సీజ్ చేసినట్లు సీపీ కాంతిరాణా టాటా వివరించారు.
*
సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు మాట్లాడుతూ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం, ఇన్ఫర్మేషన్ షేరింగ్ తదితరాల ద్వారా మంచి సహకారం లభించిందని.. ఇదే రకమైన సహకారాన్ని ఈ ఎన్నికల సమయంలో ఎన్‌టీఆర్ జిల్లాకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంటెగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని.. ఒక్కో చెక్‌పోస్టు వద్ద పది మందికి తగ్గకుండా సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. ఎన్‌టీఆర్, పల్నాడ్ జిల్లాలకు సరైన సహకారం అందించడం ద్వారా ఎన్నికలను నిష్పాక్షపాతంగా, ప్రలోభాలకు ఆస్కారం లేని వాతావరణంలో నిర్వహించడంలో భాగస్వాములమవుతామని కలెక్టర్ వెంకటరావు పేర్కొన్నారు.
*
సూర్యాపేట జిల్లా ఎస్‌పీ బీకే రాహుల్ హెగ్డే మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుకు సంబంధించి రామాపురం ఎక్స్ రోడ్, దొండపాడు వంటి క్రాస్ పాయింట్స్ ఉన్నాయని.. ఈ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి.. వాటిని పోలీస్ కంట్రోల్‌రూం, ఎన్నికల కంట్రోల్‌రూంలకు అనుసంధానించినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర, అంతర శాఖల చెక్‌పోస్టుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీజర్స్ రిలీజ్‌కు జిల్లాస్థాయి గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ పనిచేస్తోందని ఎస్‌పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
ఎన్‌టీఆర్ జిల్లాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఎస్‌పీ బీకే రాహుల్ హెగ్డేలను ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా, జేసీ డా. పి.సంపత్ కుమార్ తదితరులు సత్కరించారు.
సమావేశంలో నందిగామ ఆర్‌వో ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట ఆర్‌వో జి.వెంకటేశ్వర్లు, కోదాడ ఆర్‌డీవో సీహెచ్ సూర్యనారాయణ, ఎన్‌టీఆర్ జిల్లా ఏడీపీసీ, పోలీస్ నోడల్ అధికారి ఎం.కృష్ణమూర్తినాయుడు, ఎల్‌డీఎం కె.ప్రియాంక, రెండు జిల్లాల పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా తదితర శాఖల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment