యువత, పట్టణ ప్రాంత ప్రజలు ఓటు వేసేందుకు ముందుకురావాలి : జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌.



*యువత, పట్టణ ప్రాంత ప్రజలు ఓటు వేసేందుకు ముందుకురావాలి : జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌


*


విజయనగరం, మార్చి 30 (ప్రజా అమరావతి):

పట్టణ ప్రాంతాల్లో ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారి శాతం తక్కువగా వుంటోందని, దీనితోపాటు యువత కూడా ఓటువేసేందుకు ఆసక్తి చూపడం లేదని యీ వర్గాల వారు వచ్చే సాధారణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ విజ్ఞప్తి చేశారు. నగరంలోని యువ ఓటర్లు, పట్టణ ప్రజలకు ఓటుహక్కు వినియోగించుకోవలసిన ఆవశ్యకతపై అవగాహన కల్పించే నిమిత్తం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన రెండు కిలోమీటర్ల పరుగులో జె.సి. పాల్గొన్నారు. స్థానిక కోట జంక్షన్‌ నుంచి ప్రారంభమై రాజీవ్‌ స్టేడియం వరకు జరిగిన పరుగులో ట్రైనీ సహాయ కలెక్టర్‌ బి.సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.ఎం.నాయుడు, హౌసింగ్‌ పి.డి. శ్రీనివాస్‌, డి.ఎస్‌.డి.ఓ. వెంకటేశ్వరరావు, నెహ్రూయువ కేంద్రం అధికారి ఉజ్వల్‌, నగర యువత, ఎన్‌.సి.సి. క్యాడెట్లు క్రీడాకారులు ఈ పరుగులో పాల్గొన్నారు.

యీ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ మనదేశంలో యువత అధికంగా వున్నారని,  ముఖ్యంగా కొత్తగా ఓటరుగా నమోదైన యువత ఓటు విలువ తెలుసుకొని దానిని వినియోగించుకోవడం ద్వారా దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ఒక పెద్ద పండుగ వంటివని, ఇందులో ప్రతిఒక్కరూ పాల్గొనాల్సి వుందన్నారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందన్నారు.



Comments