యావత్ దేశం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తా!

 *యావత్ దేశం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తా!


*


*అధికారంలోకి వచ్చాక టిడ్కో కాలనీల్లో పూర్తి మౌలిక సదుపాయాలు*


*100రోజుల్లో గంజాయికి చెక్ పెడతాం*


*మంగళగిరి, తాడేపల్లి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్*


మంగళగిరి (ప్రజా అమరావతి): దేశం మొత్తమ్మీద 4వేల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే యావత్ దేశం మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి టిడ్కో కాలనీ, తాడేపల్లి మహనాడు కాలనీ రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారొచ్చు కానీ ఇచ్చిన మాట శాశ్వతం, గత ఎన్నికల సమయంలో టిడ్కో లబ్ధిదారులకు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది, రెండునెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వం పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. పేదలు కూడా సౌకర్యవంతమైన జీవనం సాగించాలన్న ఉద్దేశంతో అత్యాధునిక టెక్నాలజీతో టిడ్కో ఇళ్లు నిర్మించాం. హైదరాబాద్ లో విలాసవంతమైన టౌన్ షిప్ ల మాదిరిగా టిడ్కో గృహ సముదాయాలను ఏర్పాటుచేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులను అక్కడే నిలిపివేసింది. 2019లో ఓడిపోయాక నాలో కసి, పట్టుదల పెరిగాయి. ప్రభుత్వానికి సమాంతరంగా సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేశాను. తోపుడుబళ్లు, వాటర్ ట్యాంకులు, సిమెంటు బల్లలు, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణతోపాటు కుట్టుమిషన్లు, పెళ్లికానుకలు వంటివి ఇచ్చాను. 4.11 సంవత్సరాలు ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించా. గత 25సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలో ఉన్న మురుగుడు హనుమంతరావు కుటుంబం, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు నేను చేసిన సంక్షేమంలో పదోవంతు కూడా చేయలేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి మా నినాదం. రాబోయే 5ఏళ్లలో పేదరికం లేని మంగళగిరి కోసం అహర్నిశలు కృషిచేస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీరు, రోడ్లు వంటి మౌలికసదుపాయాలు కల్పిస్తా,  టిడ్కో రుణాల మాఫీపై చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మహమ్మారిలా మారి యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయికి అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో చెక్ పెడతామని యువనేత లోకేష్ చెప్పారు.


*లోకేష్ ఎదుట టిడ్కో కాలనీ ప్రజల సమస్యల వెల్లువ*


మంగళగిరి టిడ్కో కాలనీ నివాసితులు యువనేత లోకేష్ కు సమస్యలను చెబుతూ... మా కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది, నీటికోసం పక్కన ఉన్న రాజీవ్ గృహకల్ప కాలనీకి వెళితే వారు నీరు పట్టుకోనీయడం లేదు. మా కాలనీలో తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేయాలి. కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాలి. అంగన్ వాడీ సెంటర్ ఏర్పాటుచేయాలి. సెప్టిక్ ట్యాంక్ లీకేజి వల్ల దుర్గంధం వెదజల్లుతోంది, నేరుగా కాల్వలోకి వదలడం వల్ల ఇళ్లలో ఉండలేకపోతున్నాం. దోమలబెడద ఎక్కువగా ఉంది. సైడుకాల్వలు సరిగా లేకపోవడంతో వర్షంవస్తే నీరు రోడ్లపైకి వస్తోంది. బాత్రూమ్ లలో నీటి పైపుల లీకేజి కారణంగా ఇబ్బంది పడుతున్నాం. కాలనీ పక్కనే ఉన్న చెరువు ప్రమాదకరంగా మారింది.  మున్సిపాలిటీవారు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లో చాలా మందికి ఇళ్లులేవు. తాగునీటిలో పురుగులు వస్తున్నాయి, కలుషిత నీటివల్ల దురదలతో ఇబ్బంది పడుతున్నాం. ఇసుకలారీ 40వేలు పెట్టి కొనాల్సి వస్తోంది. ఇసుక అందుబాటులో లేకపోవడంతో పనుల్లేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. యువనేత లోకేష్ స్పందిస్తూ... రెండునెలల్లో ప్రజాప్రభుత్వం వస్తుంది, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. పూర్తిస్థాయి డిఎస్సీ నోటిఫికేషన్ తోపాటు ప్రతిఏటా జాబ్ క్యాలండర్ ఇస్తాం. మెరుగైన ఇసుక పాలసీతో ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిర్మాణరంగానికి గత వైభవం కల్పిస్తాం. ఆర్థికంగా వెనుకబడినవారికి ఈబిసి రిజర్వేషన్లు అమలుచేస్తాం. ఇళ్లులేని  వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. మీ బిడ్డలా దీవించి 53,500 మెజారిటీతో నన్ను గెలిపించండి, సమస్యలన్నీ పరిష్కరించి మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని లోకేష్ చెప్పారు.


*యువనేతకు మహానాడు కాలనీవాసుల విన్నపాలు*


తాడేపల్లి మహానాడు ప్రాంత వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. గంజాయి కారణంగా తమ బిడ్డల భవిష్యత్ నాశనమవుతోందని ఆవేదన చెందారు. పెన్షన్, రేషన్, అమ్మఒడి పథకాల్లో కోతలు విధిస్తున్నారని.. పథకాలు తమకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో పాఠశాల, కాలేజీ, ఆసుపత్రి నిర్మించాలని కోరారు.


యువనేత లోకేష్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ ఇంటిపక్కనే గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, ప్రజాప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. ఇటీవల తాడేపల్లిలోని డోలాస్ నగర్ లో కూడా ఓ మహిళ తన ఇంట్లో మగవాళ్లందరూ గంజాయికి బానిసగా మారారని వాపోయింది. తాడేపల్లి కరకట్టపై రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు భూగర్భ డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఎప్పటి నుండో ఇక్కడే నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు అందిస్తాం. సంక్షేమంలో కోతలు లేకుండా అర్హులందరికీ అందజేస్తాం. మంగళగిరిలో నేను చేసిన మంచి పనులు చూసి ఓటేయాలని లోకేష్ విజ్ఞప్తిచేశారు.


Comments