పెన్షన్ కోసం సచివాలయానికి రానవసరం లేదు...

 *పెన్షన్ కోసం సచివాలయానికి రానవసరం లేదు...*  *పింఛనదారుని ఆధార్ కార్డుకి అనుసంధానమైన బ్యాంకు ఖాతాకు నేరుగా డిబిటి ద్వారా పింఛన్ చెల్లింపు...* 


 *దివ్యాంగులు, తీవ్రమైన వ్యాధులుకేటగిరి కింద వారి ఇంటికి వెళ్లి ఫింఛన్ల పంపిణీ...* 


 *జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్..* 


ఏలూరు, ఏప్రిల్,  (ప్రజా అమరావతి):మే నెల సామాజిక పెన్షన్ల కోసం ఏ ఒక్క పెన్షర్ కూడా సచివాలయానికి రానవసరం లేదని, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. 


మే నెల సామాజిక పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను సోమవారం ఆయన విడుదల చేశారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో 2,69,886 మంది పెన్షన్ దారులకు రూ. 80.63 కోట్లు రెండు విధానాల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.  అందులో ఒకటి పింఛన్ దారుని ఆధార్ కార్డుకు అనుసంధానమైన బ్యాంకు ఖాతాకు నేరుగా డిబిటి ద్వారా జమచేయబడుతుందన్నారు. ఈ విధంగా 2,05,548 మందికి రూ. 61.67కోట్లు నగదు జమచేయబడుతుందన్నారు.  ఇది ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసిన అందరు పింఛన్ దారులకు వర్తింస్తుందన్నారు.  అదే విధంగా డిబిటి ద్వారా కవర్ చేయబడని మిగిలిన లబ్దిదారులు 64,338 మందికి రూ. 18.96 లక్షలు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పంపిణీ చేయబడుతుందన్నారు.  దివ్యాంగులు, తీవ్రమైన వ్యాధులు కేటగిరి కింద పింఛన్లు వారికి ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.   మంచంపట్టి వీల్ చైర్ కి పరిమితమైన వారు మరియు సైనిక సంక్షేమ పెన్షన్లు పొందుతున్న యుద్ధ అనుభవజ్ఞుల వృద్ధ వితంతువులకు మానవతా ధృక్పధంతోతప్పనిసరిగా వారి ఇంటివద్దకే అందజేయబడతాయని స్పష్టం చేశారు.  ఈదృష్ట్యా ఏఒక్క పెన్షనర్ కూడా సచివాలయానికి రానవసరం లేదన్నారు.  ఎవరికి బ్యాంకు అక్కౌంటికి జమచేయబడుతుంది మరియు ఎవరికి డోర్ టు డోర్ చేయబడుతుందనే వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు.  అదే విధంగా హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.  మే మొదటి తేదీనే సుమారు 77.5శాతం మందికి డిబిటి ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  మిగిలిన 22.5 శాతం మందికి నేరుగా వారి ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు.  బ్యాంకు ఖాతాలకు జమచేయబడిన మొత్తాల్లో రిజక్ట్ అయిన వాటికి మళ్లీ డోర్ టు డోర్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా పెన్షన్ కోసం బ్యాంకుల వద్ద వేచినుండనవసరం లేదని ఆయన సూచిస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడు బ్యాంకు నుండి సదరు సొమ్ము తీసుకోవచ్చన్నారు.  పెన్షన్లు పంపిణీచేసేటప్పుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడివుండాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు.

Comments