జిల్లాలో ఎన్నిక‌ల ఏర్పాట్లు భేష్‌.

 

ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 02, (ప్రజా అమరావతి);


*జిల్లాలో ఎన్నిక‌ల ఏర్పాట్లు భేష్‌


*

- ఎన్నిక‌ల రాష్ట్ర స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ రామ్ మోహ‌న్ మిశ్రా


సాధార‌ణ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్; పోలీస్ క‌మిష‌న‌ర్.. ఇత‌ర ఉన్న‌తాధికారుల సమ‌న్వ‌యంతో చేప‌ట్టిన ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయ‌ని.. ఇదే పంథాను చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించి విజ‌య‌వంతంగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తిచేసేందుకు కృషిచేయాల‌ని రాష్ట్ర ప్ర‌త్యేక సాధార‌ణ ప‌రిశీల‌కులు రామ్ మోహ‌న్ మిశ్రా అన్నారు.

సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈసీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్‌గా నియ‌మించిన రామ్ మోహ‌న్ మిశ్రా మంగ‌ళ‌వారం జిల్లా క‌లెక్ట‌రేట్‌లోని ఎన్నిక‌ల ఇంటెగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ రూంను, ఎంసీఎంసీ, సోష‌ల్ మీడియా విభాగాల‌ను నిశితంగా ప‌రిశీలించారు. కంట్రోల్ రూమ్‌లోని సీ-విజిల్‌, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి, ఐటీ, బ్యాంకింగ్‌, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్‌, ఎల‌క్ష‌న్ సీజ‌ర్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ (ఈఎస్ఎంఎస్‌), క‌స్ట‌మ్స్ త‌దిత‌ర విభాగాల కార్య‌కలాపాల‌ను ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటాలు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్‌కు వివ‌రించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఏప్రిల్ 2 నాటికి 16,86,952 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని.. ఈపీ రేషియో 694గా ఉంద‌ని వివ‌రించారు. 2014లో 77.28 శాతం, 2019లో 78.94 శాతం పోలింగ్ న‌మోదైంద‌ని.. ఈసారి ఎన్నిక‌ల్లో జిల్లాలో 85 శాతం ఓటింగ్ ల‌క్ష్యంగా విస్తృత ఓట‌రు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం జరుగుతోంద‌న్నారు. అదే విధంగా జిల్లాలోని పోలింగ్ స్టేష‌న్లు, సెక్టార్లు, రూట్లు, క్రిటిక‌ల్ పోలింగ్ స్టేష‌న్లు, ఈవీఎం, వీవీప్యాట్‌ల ల‌భ్య‌త త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. ఏప్రిల్ 13, 14 తేదీల్లో సెష‌న్ల వారీగా పీవో, ఏపీవోల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల ర్యాండ‌మైజేష‌న్‌; పోలింగ్ సిబ్బంది శిక్ష‌ణ‌, మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల‌కు శిక్ష‌ణ, ఈవీఎంల క‌మిష‌నింగ్‌, పోస్ట‌ల్ బ్యాలెట్‌, హోం ఓటింగ్ ప్ర‌క్రియ త‌దితర కార్య‌క‌లాపాల షెడ్యూల్‌ను కూడా వివ‌రించగా.. జిల్లా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌ణాళిక‌పై స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ సంతృప్తి వ్య‌క్తం చేశారు. అదే విధంగా పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటా.. జిల్లాలో ఎల‌క్ష‌న్ సీజ‌ర్ల‌ను, శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. రూ. 2.05 కోట్ల న‌గ‌దుతో పాటు 4,032 లీట‌ర్ల మ‌ద్యం, 14 వేల గ్రాముల మ‌త్తు ప‌దార్థాలు, 7,698 గ్రాముల బంగారం/వెండి త‌దిత‌రాల‌ను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. రాజ‌కీయ పార్టీల‌పై న‌మోదైన కేసులు, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామావ‌ళి అమ‌లు తీరు, ఉల్లంఘ‌న‌ల‌పై తీసుకుంటున్న చ‌ర్య‌లను, 11 ఇంటిగ్రేటెడ్ బోర్డ‌ర్ చెక్‌పోస్టుల‌తో పాటు జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వ‌ద్ద నిఘా కార్య‌క‌లాపాల‌ను వివ‌రించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌ను కూడా సంద‌ర్శించిన రాష్ట్ర స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ రామ్ మోహ‌న్ మిశ్రా సీసీ కెమెరాలతో అనుసంధానం చేసి నిరంత‌ర అప్ర‌మ‌త్త‌త‌తో ప‌నిచేస్తున్న కంట్రోల్ రూమ్ ప‌నితీరును అభినందించారు.


*అధికారుల స‌మ‌న్వ‌యం అభినంద‌నీయం:*

జిల్లా క‌లెక్ట‌ర్, పోలీస్ క‌మిష‌న‌ర్ నేతృత్వంలోని ఎన్నిక‌ల అధికార బృందాల ప‌నితీరును ప్ర‌శంసించిన స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్‌.. కీప్ ఇట్ అప్ అంటూ ప్రోత్స‌హించి అభినందించారు. జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో, నిష్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం అనుస‌రిస్తున్న మార్గాలు బాగున్నాయ‌ని.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగించి ఎన్నిక‌ల కోడ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేసి ఎన్నిక‌లను విజ‌య‌వంతంగా నిర్వ‌హించడంలో భాగ‌స్వాములు కావాల‌ని సూచించారు. క్షేత్ర‌స్థాయి నుంచి వ‌చ్చే డేటాను స‌రైన విధంగా విశ్లేషించి స‌రైన కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులేయాల‌న్నారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ రామ్ మోహ‌న్ మిశ్రా గారు చేసిన సూచ‌న‌ల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించి జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేస్తామ‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ రామ్ మోహ‌న్ మిశ్రా.. గూడ‌వ‌ల్లి ఇంట‌ర్ డిస్ట్రిక్ట్ బోర్డ‌ర్ చెక్‌పోస్టును కూడా సంద‌ర్శించారు. న‌గ‌దు, మ‌ద్యం, విలువైన వ‌స్తువులు త‌దిత‌రాల అక్ర‌మ రవాణాకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించి.. సిబ్బందితో మాట్లాడారు. గూడ‌వ‌ల్లి చెక్‌పోస్టు వ‌ద్ద సిబ్బందికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు ఉన్నాయ‌ని.. లేనిచోట్ల విధులు నిర్వ‌ర్తించే అధికారులు, సిబ్బందికి తాగునీరు, మ‌రుగుదొడ్లు వంటి సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments