కాలువల ద్వారా నీటి సరఫరాను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించండి.

 కాలువల ద్వారా నీటి సరఫరాను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించండి


కాలువ శివారు ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరేలా పర్యవేక్షించండి

అక్రమంగా నీటిని తరలించకుండా కాలువల వెంబడి సిబ్బందితో నిఘా పెట్టండి

తాగునీటి సమస్యలపై జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ల ద్వారా మానిటర్ చేయాలి

అన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపండి

నీటి సరఫరా పర్యవేక్షణకు నియమించిన సిబ్బందికి 10 రోజుల వరకూ సెలవులివద్దు

అన్ని ఆవాసాల్లోను ఉపాధి హామీ పనులు చేపట్టండి

            ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,8 ఏప్రిల్ (ప్రజా అమరావతి):రాష్ట్రంలో తాగునీటి అవసరాలకై ప్రకాశం బ్యారేజి మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువల ద్వారా విడుదల చేసిన నీరు సమక్రమంగా శివారు ప్రాంతాల వరకూ చేరే విధంగా ఆయా కాలువల వెంబడి గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలక్టర్లను ఆదేశించారు.తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం పనులు,విద్యుత్ సరఫరా పరిస్థితులపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ తాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజి నుండి రైవస్,బందరు,ఏలూరు కాలువ,కృష్ణా పశ్చిమ కాలువల ద్వారా ఎన్టిఆర్,కృష్ణా,ఏలూరు, గుంటురూ,బాపట్ల జిల్లాలకు,నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ నుండి పల్నాడు,ప్రకాశం, గుంటూరు,బాపట్ల జిల్లాల్లోని వివిధ సమ్మర్ స్టోరేజి ట్యాంకులను నీటితో నింపేందుకు నీటిని విడుదల చేయడం జరిగిందని చెప్పారు.కాలువల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరిగేలా మూడు నాలుగు రోజులు పాటు డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు.

అంతేగాక కాలువల వెంబడి నీటిపారుదల,రెవెన్యూ తదితర శాఖల సిబ్బందితో టీంలను ఏర్పాటు చేసి నీటిని చేపలు,రొయ్యల చెరువులకు అక్రమంగా మళ్ళించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలక్టర్లను ఆదేశించారు.తాగునీటిని  పొదుపుగా వినియోగించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పారు.కాలువ శివారు ప్రాంతాలకు సక్రమంగా నీరు చేరేలా చూడాలని అన్నారు.అదే విధంగా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని సిఎస్ ఆదేశించారు.

కాలువల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించేందుకు నియమించబడిన  అధికారులు సిబ్బందికి నీటి సరఫరా నిలిపి వేసే వరకూ అనగా 10 రోజుల పాటు ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్లు,జల వనరుల శాఖ అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.కాలువల వారీ ప్రత్యేక డయాగ్రామ్ ను సిద్ధం చేసి ఎంత మేరకు నీరు చేరింది ప్రతి రోజు మానిటర్ చేయాలని,సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఎన్ని నీటితో నింపింది వంటి అంశాలపై వారం రోజుల పాటు డైలీ నివేదికను పంపాలని జిల్లా కలెక్టర్లును సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.అలాగే తాగునీటికి సంబంధించి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతరం పర్య వేక్షించాలని సిఎస్ ఆదేశించారు.

అనంతరం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం కింద కూలీలకు కల్పిస్తున్న ఉపాధి పనులపై సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలక్టర్లతో సమీక్షిస్తూ ఉపాధి పనులకు ప్రస్తుతం అనుకూల సీజన్ కావున ప్రతి ఆవాస ప్రాంతంలోను ఉపాధి పనులు నిర్వహించాలని చెప్పారు.సరిపడిన పనులను షెల్ప్ లో ఉంచుకోవడం తోపాటు నూతన పనులు చేపట్టేందకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపితే రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించి ఆమోదం ఇవ్వడం జరుగుతుందని సిఎస్ కలక్టర్లకు స్పష్టం చేశారు.అనంతరం జిల్లాల వారీగా తాగునీరు,ఉపాధి పనులు,విద్యుత్ సరఫరా పరిస్థితులపై తీసుకుంటున్నచర్యలను కలక్టర్ల వారీగా సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. 

ఈసమావేశంలో రాష్ట్ర జల వనరులు,పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ తాగునీటి అవసరాలకు ఈనెల 6వ తేదీన ప్రకాశం బ్యారేజి రోజుకు 2 వేల 500 క్యూసెక్కులు,8వతేదీ సోమవారం ఉదయం 10.గం.ల నుండి నాగార్జున సాగార్ కుడి ప్రధాన కాలువ నుండి 5వేల 500 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా విడుదల చేయడం జరుగుతోందని తెలిపారు.ఇందుకు సంబంధించి ప్రత్యేక ఎస్ఓపిని రూపొందించామని దానిని కలక్టర్లు పాటించి సకాలంలో అన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను నీటితో నింపాలని చెప్పారు.తదుపరి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మంచినీటి ఎద్దడి గల ప్రాంతాలకు ట్యాంకులు ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలక్టర్లు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఉపాధిహామీ పధకం పనులపై పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాల వారీగా జరుగుతున్న ఉపాధి హామీ పనుల ప్రగతిని వివరించారు.ప్రతి ఆవాస ప్రాంతంలోను పనులు మొదలు పెట్టాలని కలక్టర్లకు సూచించారు. ముఖ్యంగా వాటర్ కన్జర్వేషన్ పనులు,ఫామ్ పాండ్లు నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత నివ్వాలని చెప్పారు.వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 11గం.ల లోపు పనులు పూర్తి చేసేలా చూడాలని అన్నారు.కూలీలకు పని ప్రదేశాల్లో ప్రతి గంటకు మంచినీరు తాగే విధంగా వాటర్ బెల్టు విధానాన్ని పాటించాలని చెప్పారు.

అనంతరం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వర్చువల్ గా పాల్గొని వివరిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవని డిమాండుకు తగిన విధంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే పరిస్థితులు వస్తే ప్రజలకు ముందుగానే తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.రానున్న రోజుల్లో డిమాండుకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

ఈ వీడియో సమావేశంలో జలవనరులు,ఆర్డబ్యుఎస్ ఇఎన్సిలు నారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,సిడిఎంఏ శ్రీకేష్ బాలాజీ రావు,వివిధ జిల్లాల కలక్టర్లు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజలకు శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు:సిఎస్.జవహర్ రెడ్డి.

ఈనెల 9వ తేదీ మంగళవారం శ్రీ క్రోధినామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరికీ మరింత శుభం కలగాలని ఆయన ఆకాంక్షించారు.

Comments