దుర్మార్గ పాలన పోవాలి...ఎన్డీయే పాలన రావాలి.



*దుర్మార్గ పాలన పోవాలి...ఎన్డీయే పాలన రావాలి


*


*కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఏన్డీయే ఆక్షీజన్ ఇచ్చి బతికిస్తుంది*


*సంక్షేమ కార్యక్రమాలు తొలగిస్తామని తప్పుడు ప్రచారం...రూ.10లు ఇచ్చి 100 దోచేది జగనే*


*కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం*


*జగన్ గొడ్డలి వేటుకు ప్రతి ఒక్కరూ బలయ్యారు*


*జగన్ సింగిల్ గా రావడం లేదు...శవాలతో వస్తున్నాడు*


*రాష్ట్రాన్ని పాలించేది విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి...బాగుపడిందీ ఈ నలుగురే*


*సైకిల్ కు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతుంది...పగలగొట్టాలని చూస్తే గ్లాస్ పదునెక్కుతుంది...బురద వేయాలని చూస్తే కమలం వికసిస్తుంది* 


*-నిడదవోలు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*


నిడదవోలు (ప్రజా అమరావతి):- ‘‘నిడదవోలు ప్రజల స్పందన చూస్తే..గెలుపు డిసైడ్ అయిపోయిందనిపిస్తోంది. ప్రజలను చైతన్యం చేయడానికి వారాహి బయలుదేరింది. మూడు పార్టీల తరపున సింహ గర్జన  మొదలైంది. ప్రజాగళం వినిపిస్తాం. నిడదవోలు జన వారాహిని చూస్తే జగన్ రెడ్డికి నిద్రపట్టక గుండె పగిలిపోవడం ఖాయం. జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి నిడదవోలు ప్రజలు సిద్దంగా ఉన్నారు. కూటమిని అడ్డుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే తొక్కుకుంటూ పోతాం. గ్లాసును పగలగొట్టాలని చూస్తూ గాజు గ్లాసు జగన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకుంటుంది. కమలానికి బురద అంటించాలని చూస్తే..ఆ బురద జగన్ రెడ్డికే అంటుకుంటుంది. మూడుపార్టీల కూటమీ రాష్ట్ర భవిష్యత్తు కోసమే. 2014 లో కలిసి పోరాడాం. ఏన్డీఏకు భేషరతుగా మద్దతు ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్.  కూటమి కాంబినేషన్ సూపర్ హిట్. మేం అధికారం కోసం కలవలేదు. పవన్ కళ్యాణ్ గారు వృత్తిపరంగా కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని మీ కోసం వచ్చారు. సినిమాల్లో హీరోలను చూశాను. కానీ, పవన్ కళ్యాణ్ నిజజీవితంలో హీరో. ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెట్టారు. కానీ ఏనాడు మడమ త్రిప్పలేదు. ఆటుపోటులకు అలవాటు లేకపోయినా ఎంతో శ్రమించి మీ కోసం నిలబడ్డాడు. 

*కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం ఆక్సిజన్‌ ఇచ్చి బతికిస్తుంది*

కూటమి అభ్యర్ధులుగా రాజమండ్రి పార్లమెంటుకు పురందేశ్వరీ, నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్ లు నిలబడ్డారు. వారిని ఆశ్వీర్వదించండి. నిడదవోలులో ఈ ఎలక్షన్ కు తెలుగుదేశం పార్టీ సింబల్ లేదు. అయినా మేం వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. 2014 కూటమిలో కంటే నేడు తక్కువ సీట్లతో బీజేపీ పోటీ చేస్తోంది. జెండాలు వేరైనా అజెండా ఒక్కటే. అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా. తెదేపా సింబల్ లేదని అధైర్యపడవద్దు. ఇతర నియోజకవర్గాలలో జనసేన, బీజేపీ సింబల్స్ లేవని అధైర్యపడొద్దు. అధైర్యం చెందితే మనకే నష్టం. జగన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ ఆక్సిజన్‌లా బ్రతికిస్తుంది. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. రాజధాని కట్టుకోవాలి. ఇండస్ట్రియల్ కారిడార్లు పూర్తిచేసుకోవాలి. ఇవన్నీ నెరవేరాలంటే నరేంద్రమోడీ సహకారం అవసరం. గాడితప్పిన పరిపాలనను దారిలో పెట్టే శక్తి, యుక్తి ఎన్డీఏ కూటమికి మెండుగా ఉంది. నరేండ్ర మోడి నాయకత్వాలో 2047 కి భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా నిలవబోతోంది. ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక వ్యవస్థల్లో దేశం ఒకటో, రెండో స్థానాల్లో ఉండబోతుంది. అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కూడా వెనకపబకూడదు. దేశంతో పాటు రాష్ట్రం కూడా సూపర్ పవర్ గా ఎదగాలి. అందుకు మీరందరి సహకారం కావాలి. 

*జగన్ రెడ్డి గొడ్డలి వేటుకు ప్రతీ ఒక్కరూ బలయ్యారు*

జగన్ రెడ్డి గొడ్డలి వేటుకు రాష్ట్రంలో బలవ్వన్ని వర్గం లేదు. రైతులు ఎంతో ఆవేదనలో ఉన్నారు. కాలువల్లో పూడికలు తీయలేదు. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వచ్చిన వరదల్లో రైతులు పంటలు కోల్పోయారు. దేశంలోనే ఎక్కువ రైతాంగ అప్పులు ఉన్న రాష్ట్రంగా ఏపీని దిగజార్చారు. కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉండటం బాధాకరం. యువతకు ఉద్యోగాలు లేవు. డీఎస్సీ ఇవ్వలేదు. జాబ్ కేలండర్ ఇవ్వలేదు. యువతకు జాబ్ రావాలంటే కూటమి గెలవాలి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తాం. ఆడబిడ్డలు కుటుంబాలను నడిపించుకోవాడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజీల్ ధరలు, కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచలేదు. కానీ నేడు బాదుడే బాదుడు. 

*బాంబులకే బయపడలేదు..అక్రమ కేసులకు బయపడతానా?*

జగన్ రెడ్డి అహంకారి. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే ఆయనను సమర్ధించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. నేను అనుకుని ఉంటే 2019 కి ముందు జగన్ రెడ్డి పాదయాత్రలో ఒక్క అడుగు వేసేవాడే కాదు. కానీ, నేడు జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విశాఖకు రానివ్వలేదు. మా జీవితంలో చూడనన్ని కేసులు పెట్టారు. నా జీవితంలో బాంబులకే బయపడలేదు. అలాంటిది కేసులకు బయపడతానా? జగన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నాని చెబుతున్నాడు. సింగిల్ గా కాదు.. జగన్ రెడ్డి శవాలతో వస్తున్నాడు. 2014 లో తండ్రిలేని బిడ్డనంటూ వచ్చాడు. 2019లో బాబాయి లేని బిడ్డనంటూ వచ్చాడు. నేడు వృద్దులకు పెన్షన్లు ఇవ్వకుండా వారు చనిపోతే వారిని అడ్డంపెట్టుని వస్తున్నాడు. శవరాజకీయాలు చేసి లబ్దిపొందాలనుకుంటున్నాడు.

*జగన్ రెడ్డిని చూసి సొంత పార్టీ ఎమ్మెల్సీలే పారిపోతున్నారు*

జగన్ రెడ్డిని చూసి అందరూ పారిపోతున్నారు. ఆయన పార్టీ శాసనమండలి సభ్యులు నాలుగేళ్లు పదవీకాలం ఉన్నా బయటకు వస్తున్నారు. మాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంటూ మనతో కలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఇక్ బాల్, రామచంద్రయ్య, వంశీ లాంటి వారు బయటకు వచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రలను సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి కేవలం జగన్ రెడ్డే. రాష్ట్రాన్ని సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెదిరెడ్డి లాంటి నలుగురు రెడ్లకు అప్పగించాడు. కూటమి అన్యోన్యంగా ముందుకు వెళుతుంటే జగన్ రెడ్డి కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడు. ఆ చిచ్చులో జగన్ రెడ్డే దగ్ధం అవుతాడు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని మత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాడు. జగన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. మత విధ్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని మీ ఓటుతో త్రిప్పి కొట్టాలని కోరుతున్నా.

*వైసీపీ చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు*

ఎన్డీఏ ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్. 1983లోనే పేదలకు రూ.2 లకే కిలో బియ్యం, సగం ధరకే దుస్తులు, పక్కా ఇళ్లు, రైతులకు రూ.50 కే హెచ్.పీ పవర్ కరెంటు ఇచ్చారు. దేశంలోనే పేదలకు ఫింఛన్లు ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి తరపున హామీ ఇస్తున్నా.

*సూపర్-6 ను...సూపర్ – 10 గా మార్చబోతున్నాం*

పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు సూపర్ 6 కి బదులు సూపర్ 10 పాయింట్లతో మార్పు చేయాలని చూస్తున్నాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతీ ఒక్కరికీ నెలకు రూ.1500 ఇస్తాం. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు ఇస్తాం. జగన్ రెడ్డి పది ఇచ్చి వంద దోచాడు. మేం ఆదాయం పెంచి సంక్షేమం ఇస్తాం. తల్లికి వందనంలో బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. కానీ, ఆదాయం పెరగలేదు. అందుకే ఏడాదికి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతామని ఆటో డ్రైవర్లను భావించాల్సిన అవసరం లేదు. వారికి ప్రత్యేక ప్యాకేజీ వారిని ఆదుకుంటాం. అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. రైతును రాజు చేస్తాం. ఆక్వాను అభివృద్ది చేస్తాం. ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంటు ఇస్తాం. కాలువల్లో పూడికలు తీస్తాం. నిడదవోలు సమస్యలన్నీ పరిష్కరిస్తాం.  మెగా డీఎస్పీ ఇస్తాం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.  జాబ్ క్యాలెండర్, పరిశ్రమలు తీసుకొస్తాం. నిడదవోలును అభివృద్ధి చేస్తాం. యువకులకు వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తాం. వారు ఇంటి దగ్గర కూర్చుని ప్రపంచ కంపెనీలలో పనిచేసే విధంగా చేస్తాం. మండల హెడ్ క్వార్టర్‌లలో వర్క్ స్టేషన్లు పెడుతాం. ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వర్చువల్ విధానం తీసుకొస్తాం.

*వికలాంగులకు రూ.6 వేలు ఫించన్ ఇస్తాం*

వికలాంగులకు రూ.6 వేలు ఫించన్ ఇస్తాం. జగన్ రెడ్డి వాలంటీర్లతో రాజకీయాలు చేయాలని చూశాడు. వాలంటీర్లను ఆదుకుంటాం. వారి జీతాన్ని రూ.10 వేలుకు పెంచుతాం. వాలంటీర్లలో అనేక మంది ఉన్నత చదువులు చదినవారు ఉన్నారు. వారి ఆదాయాన్ని పెంచి లక్షలు సంపాదించే మార్గం చూపుతాం. వాలంటీర్లు ఎన్టీఏకు మద్దతు తెలిపే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం కోసం పనిచేసే వాలంటీర్లకు అండగా ఉంటాం. వాలంటీర్లను మేం ఎప్పుడు వ్యతిరేకించలేదు. వారు వైసీపీకి సేవ చేస్తే ఊరుకోం అని మాత్రమే చెప్పాం. ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలన ప్రారంభించిన వ్యక్తి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమే. రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతీ వాలంటీర్ ఆలోచించి పనిచేయాలని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో మూడు పార్టీలు కలిసి సమావేశాలు పెడితే ఆ జోరులో వైసీపీ కొట్టుకుని పోవడం ఖాయం. బూరుగపల్లి శేషారావు పార్టీకి చాలా బాగా పనిచేసిన నాయకులు. కూటమి పొత్తులో బాగంగా వారికి సీటు ఇవ్వలేని పరిస్థితి. అయినా శేషారావు గారు ముందుకొచ్చి కందుల దుర్గేష్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఇలాంటి సంకల్పం ప్రతీ నియోజకవర్గం నాయకుల్లో రావాలి. పురందేశ్వరీని, కందుల దుర్గేష్ ను భారీ మెజారిటీ గెలిపించాలి. మీ సంపూర్ణ మద్దతు కావాలి. రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. అనుమానం లేదు. ఆలోచించి ఓటేసి ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించండి. మీ రుణం నేను తీర్చుకుంటా.

*భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం*

భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ నాయకులు ఇసుకను దోచుకున్నారు. భారతి సిమెంటు ధరలు పెంచడం కోసం భవన నిర్మాణ కార్మికులను బలి చేశాడు జగన్ రెడ్డి. ఎన్.ఏ.సీ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు నిధి ఏర్పాటు చేస్తే.. ఆ నిధులు కూడా జగన్ రెడ్డి దోచుకున్నాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. ఉదయం లేవగానే ‘హలో ఏపీ’ తో ప్రతీ ఒక్కరూ సంభోదించుకోవాలి రాష్ట్రం కోసం ‘హలో ఏపీ’ నినాదాన్ని ప్రతీ ఒక్కరు నినదించాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకరినొకరు హలో ఏపీ అంటూ అభివాదించుకోవాలి. హలో ఏపీని ప్రతీ ఒక్కరికీ తీసుకెళ్లాలి. హలో ఏపీ అని గట్టిగా చెప్పాలి.’’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 


Comments