చల్లని నీటి వెనుక వెచ్చటి కన్నీళ్లు...

 *చల్లని నీటి వెనుక వెచ్చటి కన్నీళ్లు...**కనుమరుగవుతున్న పేదవాడి ఫ్రిజ్ లు* 

  

వేసవి వచ్చిందంటే పేద, మధ్యతరగతి ప్రజలు దాహార్తిని తీర్చుకోవటానికి సరాసరి వెళ్ళేది చల్లటి నీటిని ఇచ్చే మట్టి కుండ వద్దకే... అందుకే మట్టి కుండను పేదవాడి ఫ్రిజ్ అన్నారు. అయితే నేటి కంప్యూటర్ యుగములో మట్టికుండకు గిరాకీ తగ్గి పోతుంది. దీంతో ఈ వృత్తిపై ఆధారపడిన శాలివాహనుల జీవితాలు అగమ్యాగోచరంగా  మారుతున్నాయి. 


రాష్ట్రంలో వేసవికాలంలో శాలివాహనుల మట్టి కుండలకు గిరాకీ ఉంటుంది. జనవరి నుంచి మే నెల వరకు శాలివాహన కుటుంబాలు కుండల తయారీలో నిమగ్నమవుతారు. మట్టి కుండలు, బిందెలు, పూల కుండీలు, చలివేంద్రం బానలు వంటి రకరకాల మట్టి వస్తువులు తయారు చేస్తుంటారు. అయితే మార్కెట్లోకి నేటి ఆధునిక యుగములో ప్లాస్టిక్, స్టీలు పాత్రలు విరివిగా రావడంతో మట్టి పాత్రల వాడకం తగ్గిపోయింది. ఏడాదిలో కనీసం వేసవికాలంలో మట్టి కుండలు, బిందెలు, కుజాలు, చలివేంద్రం బానలకు వరకు గిరాకీ ఉండేది. మార్కెట్లోకి ఫ్రిజ్ లు, చల్లటి నీటి వాటర్ క్యాన్లు రావడంతో వేసవికాలం నాలుగు నెలలు కూడా శాలివాహనులకు వృత్తి అంతంత మాత్రంగానే ఉంటుంది. గ్రామాలలో, పట్టణాలలో వందలాదిమందిగా ఈ వృత్తిపై ఆధారపడిన వృత్తిదారులు గణనీయంగా తగ్గి, ఇతర వృత్తులు, కూలి పనులకు వెళ్తున్నారు. దీంతో ఈ వృత్తిపై ఆధారపడి జీవించేవారి కుటుంబాలు వేళ్ళ మీద లెక్క వేసే స్థాయికి దిగజారిపోయింది. శాలివాహన వృత్తికి అంతంతమాత్రంగానే ఆదరణ ఉంటే, దీనికి తోడు గ్రామాలు, పట్టణాలలో వృత్తిదారులకు మట్టి దొరక్క అరకొరగా కుండల వృత్తిపై ఆధారపడిన శాలివాహనులు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కుండలు తయారీ చేసే శాలివాహన వృత్తిదారులకు చెరువులలో మట్టి తవ్వికెళ్లే హక్కులు ప్రభుత్వం కల్పించడం ద్వారా వృత్తిదారులకు కొంత మేలు జరుగుతుందని శాలివాహనులు అంటున్నారు. మట్టి కుండలు తయారీ శ్రమతో కూడిన పని కావడంతో 50 సంవత్సరాలు పైబడిన శాలివాహన వృత్తిదారులకు ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లి, అనారోగ్యాలకు గురవుతూ పనిచేయలేకపోతున్నారు. దీంతో ఈ వృత్తిపై ఆధారపడిన శాలివాహన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల మాదిరిగా 50 సంవత్సరాలు పైబడిన శాలివాహన వృత్తిదారులకు కూడా పింఛన్లు అందజేయాలని, కుండలు కాల్చే బట్టీలకు ప్రభుత్వం స్థలము కేటాయించి, కుండలు కాల్చే సమయంలో వర్షానికి కుండలు దెబ్బతినకుండా బట్టీలపై షెడ్లు నిర్మాణం జరపాలని శాలివాహన వృత్తిదారులు కోరుతున్నారు.


Comments