ప్రభుత్వాలు మారినపుడల్లా పాలసీలు మారకుండా చట్టం తెస్తాం!.

 


*దేశంలో ఎవరికీ లేని చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఎపికి మాత్రమే సొంతం!*


*పెట్టుబడుల రాబడిపై ఇప్పటికే సిఐఐ ప్రతినిధులతో చర్చిస్తున్నాం*


*ప్రభుత్వాలు మారినపుడల్లా పాలసీలు మారకుండా చట్టం తెస్తాం!**మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్*


మంగళగిరి (ప్రజా అమరావతి): దేశంలో మరెవరికీ లేని చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఎపికి మాత్రమే సొంతం, రాబోయే ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించాక బాబు ఇమేజ్ తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా

తరలివస్తాయని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కాజ గ్రామంలో ఎఆర్ హోమ్స్ అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రదీప్ అనే ఒక యువకుడు మాట్లాడుతూ గత అయిదేళ్లుగా  రాష్ట్రానికి చెందిన కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి, అలా వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి రప్పించడానికి మీ వద్ద ఉన్న వ్యూహం ఏమిటి అని ప్రశ్నించారు. దీనికి నారా లోకేష్ సమాధానమిస్తూ... గత ప్రభుత్వ హయాంలో తాము పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లినపుడు ఇతర దేశాల ప్రధానులు సైతం చంద్రబాబును గుర్తించి ఆయనతోపాటు మమ్మల్ని కూడా ఎంతో గౌరవించారు. సింగపూర్ లో చంద్రబాబు పెట్టుబడుల కోసం వెళితే అక్కడి ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక సెషన్ ఏర్పాటుచేసింది. అది చంద్రబాబుకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం.  చంద్రబాబు సిఎం అవుతారన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రానికి రావడానికి ఆసక్తి కనబరుస్తున్న పరిశ్రమల లిస్టు సిద్ధం చేయాల్సిందిగా సిఐఐ ప్రతినిధులకు చెప్పాం. ఇప్పటికే వారు ఆ పనిలో ఉన్నారు. అయితే ప్రభుత్వాలు మారినపుడల్లా పాలసీలు మారడం వల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో చౌకగా నిరంతర విద్యుత్ అందించాలన్న ఉద్దేశంతో యూనిట్ 2.45 కు సౌరవిద్యుత్ సంస్థలతో గత ప్రభుత్వం పిపిఎలు కుదుర్చుకున్నాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక తెలివితక్కువ ముఖ్యమంత్రి జగన్ ఆ ఒప్పందాలను రద్దుచేసి ఓపెన్ మార్కెట్ లో యూనిట్ రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. ఆ భారమంతా ప్రజలపై నెట్టడంతో గతంలో వందల్లో వచ్చే కరెంటుబిల్లు ఇప్పుడు వేలల్లో వస్తోంది. పరిశ్రమల ప్రోత్సాహనికి ఒకసారి తెచ్చిన ఇన్సెంటివ్ పాలసీని తర్వాత ప్రభుత్వాలు మార్చకుండా చట్టం తేవాల్సి ఉంది. రాష్ట్ర ఖజనాకు ట్యాక్సుల రూపంలో అత్యధిక ఆదాయాన్నిచ్చే అమర్ రాజా బ్యాటరీస్ పై కక్షగట్టి వివిధ ప్రభుత్వసంస్థలతో దాడులు చేయించారు. దీంతో 20వేల ఉద్యోగాలు కల్పించే లిథియం బ్యాటరీ యూనిట్ ను ఆ సంస్థ తెలంగాణాలో ఏర్పాటుచేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, మైన్ల యజమానులు, ఉద్యోగులను సైతం వేధించారు. దీంతో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఐటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బిగ్ డేటాను 2016లోనే గుర్తించి అదానీ డాటా సెంటర్ కు విశాఖలో భూములు కేటాయించాం. తర్వాత ఆ సెంటర్ పొరుగు రాష్ట్రానికి తరలిపోయింది. చంద్రబాబునాయుడు సంపద సృష్టికర్త. హైదరాబాద్ ను ఏవిధంగా అభివృద్ధి చేశారో అందరం కళ్లారా చూశాం. ఈసారి రాష్ట్రంలో పెట్టుబడుల రాబడికి పకడ్బందీ విధానాలతో  సమగ్ర పాలసీ తెస్తామని లోకేష్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని కోట్లాది యువత భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి, ప్రజలంతా ఆలోచించి ఓటువేయాల్సి ఉందని అన్నారు. 


Comments