ఎన్నికల నేపద్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా...



 *ఎన్నికల నేపద్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా...* 



 *ఎపి, తెలంగాణ సరిహద్దుల జిల్లాల సమీక్షలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి. మేరీప్రశాంతి...* 


 *మంచి సమన్వయం, సమాచార మార్పిడితో మంచి ఫలితాలు సాధించవచ్చు...* 


 *ఏలూరు,ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల అధికారుల మధ్య మరింత సమన్వయానికి చర్యలు...* 


ఏలూరు, ఏప్రిల్, 23 (ప్రజా అమరావతి): ఎటువంటి ప్రలోభాలకు తావులేని స్వేచ్ఛాయుత వాతావరణంలోఎన్నికలను ప్రజాస్వామ్య స్పూర్తితో నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎపి, తెలంగాణ సరిహద్దుల జిల్లాల అధికారులసమన్వయం ఎంతో అవసరమని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. 


మంగళవారం స్ధానిక కలెక్టరేట్ వి.సి. హాలు నుంచి ఖమ్మం, భధ్రాధ్రి కొత్తగూడెం, ఏలూరు జిల్లాల అధికారులతో అంతరాష్ట్ర సరిహద్దుల్లో అనుసరించవలసిన నిఘా తదితర అంశాలపై జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 సమావేశంలో ఖమ్మం, భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు గౌతమ్, ప్రియాంక, ఎస్పీలతో పాటు రెవిన్యూ, పోలీస్, ఎక్సైజ్, ఎస్ఇబి , కమర్షియల్ టాక్స్ తదితర శాఖల అధికారులు పాల్గోన్నారు.  


ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గత గోదావరి వరదల సమయంలో ఏమేరకు సమన్వయంతో పనిచేశామో అదే స్పూర్తితో ఎన్నికల నిర్వహణకు సమబంధించి పరస్పర సమాచార మార్పిడితో ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దామన్నారు. తద్వారా మరింత మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.  అంతరాష్ట్ర సరిహద్దుల వెంబడి నగదు, మద్యంతో పాటు ఓటర్ల తరలింపుకు అడ్డుకట్టవేసే విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ విషయంలో మరింత పటిష్టమైన నిఘా పెంచాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి మండలాలకు చెందిన ప్రజలకు సంబంధించి భధ్రాధ్రి కొత్తగూడెం జిల్లాలకు చుట్టరికాలు ఎక్కువగా ఉంటాయని ఈ దృష్ట్యా పోలింగ్ కు 48 గంటల ముందుగా ప్రజల కదలికలను నియంత్రించవలసిన అవసరం ఉందన్నారు.  తనిఖీల్లో ఏ విధమైన సీజ్ జరిగిన అది రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల మద్య సమాచారం ఉండాలన్నారు. ఏ చెక్ పోస్టుద్వారా తరలింపు జరిగిందో అటువంటి అంశాలపై కూడా దృష్టిసారించాలన్నారు.అటవీప్రాంతంలో అసాంఘిక వ్యక్తుల నక్సల్స్ కదలికలను నియంత్రించే భాగంలో అక్కడి కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమేరాలను అమర్చేందుకు అటవీశాఖ అధికారును ఆదేశించడం జరిగిందన్నారు.  ఎక్కడైనా భారీసంఘటనలు జరిగిన సమయంలో తక్షణమే స్పందించే నెట్ వర్కింగ్ అభివృద్ధి చేసుకోవాలన్నారు. ముఖ్యంగా సెబ్ వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పోలీస్, రిటర్నింగ్ అధికారుల మద్య సమన్వయం ఎంతో అవసరమన్నారు.  



జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్న దృష్ట్యా వివిధ మార్గాల్లో నగదు, మద్యం, రవాణాకు వివిధ రూపాలను ఎంచుకునే అవకాశం వుంటుందని అటువంటి చర్యలను ఉక్కుపాధంలో నియంత్రించేందుకు పటిష్టమైన నిఘా వుంచాలన్నారు. అదే విధంగా ఇప్పటికే అంతరాష్ట్ర సరిహద్దుల్లో 8 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని అందులో తాటియాకులగూడెం వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును కూడా నియమిస్తున్నామన్నారు.  అయితే భధ్రాధ్రి కొత్తగూడెం జిల్లాలో పాపిడిగూడెం,యాగర్తిగూడెం-రామన్నగూడెంలలో మరో రెండు సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని భధ్రాధ్రి కొత్తగూడెం ఎస్పీని కోరారు. ఇటీవల భారీ ఎన్ కౌంటర్ జరిగిన దృష్ట్యా మావోఇస్టుల కదలికలపై మరింత నిఘా ఉంచాలన్నారు. కచ్చారోడ్లు ద్వారా నగదు, మద్యం వంటివి తరలింపు జరుగకుండా మొబైల్ చెక్ పోస్టు నిర్వహించబడుతుందన్నారు. మోటారు సైకిళ్ల కదలికలపై కూడా నిఘా ఉంచాలన్నారు.  మరి ముఖ్యంగా పోలింగ్ రోజున రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల్లో ఓటర్లను తరలించే అవకాశాలు ఉన్నందున వాటిపై దృష్టి పెట్టాలన్నారు. 


సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, సెబ్ జాయింట్ డైరెక్టర్ ఎన్. సూర్యచంద్రరావు, వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమీషనరు డి. శ్రీలక్ష్మి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరమేశ్వరన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Comments