ఈనెల 16 నుండి 12 జిల్లాలలో వయోజనులకు బిసిజి టీకా.


*ఈనెల 16 నుండి 12 జిల్లాలలో వయోజనులకు బిసిజి టీకా*

అమరావతి (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 నాటికి టిబి కేసులను పూర్తిగా నిర్మూలించటంతో పాటు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో 18 ఏళ్ళు పైబడిన వయోజనులలో ప్రత్యేకించి ఆరు కేటగిరీల వారికి బిసిజి టీకా అందించే కార్యక్రమాన్ని ఈనెల 16వ తేదీ నుండి రాష్ట్రంలోని 12 జిల్లాలలో మొదటి విడత లో ప్రారంభించనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.  

ఐదేళ్ల క్రితం టిబి మందులు వాడి వ్యాధి తగ్గించుకున్న వారు, 2021 సంవత్సరంలో టిబి మందులు వాడిన టిబి పేషెంట్స్ యొక్క కాంటాక్ట్స్, మధుమేహ వ్యాధిగ్రస్తులు, ధూమపానం అలవాటు వున్న వారు, 60 ఏళ్ళు పైబడిన వారు, BMI <18KGS/m2 వున్న కేటగిరిలలోని వ్యక్తులకు బిసిజి టీకాను వేస్తారన్నారు. 

అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, క్రిష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలలో ఆరు కేటగిరీలకు చెందిన అర్హులైన వ్యక్తులకు మూడు నెలల వ్యవధిలో ఈ బిసిజి టీకా అందించనున్నట్లు అధికారులు  వివరించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా క్షయ నివారణ , జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులు సంయుక్తంగా అమలు చేస్తారన్నారు. క్షేత్ర స్థాయిలో ఎఎన్ఎం, ఆశా, సిహెచ్ఓ, మరియు టిబి ఛాంపియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ ఆదేశాల మేరకు 12 జిల్లాలకు ఇప్పటికే నోడల్   అధికారులను నియమించినట్లు  ప్రకటనలో పేర్కొన్నారు.   బిసిజి టీకా వయోజనులకు సురక్షితమైనదనీ , టీబి వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకా వేసుకోవాలని అధికారులు  కోరారు. బిసిజి టీకాలు వేసే ప్రక్రియను 12 జిల్లాలకు నియమించిన నోడలాఫీసర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.Comments