ఈనెల 22,23 తేదీల్లో విశాఖలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ వేడుకలు .

 ఈనెల 22,23 తేదీల్లో విశాఖలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ వేడుకలు 

అమరావతి,15 మే (ప్రజా అమరావతి);:ఈనెల 22,23 తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిద్య మండలి(AP State Bio-diversity Board) సభ్య కార్యదర్శి బివిఏ కృష్ణ మూర్తి తెలియజేశారు.విశాఖపట్నం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ జూబ్లి ఆడిటోరియంలో ఈఅంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ జాతీయ స్థాయి వేడుకలను “ప్రణాళికలో భాగం అవ్వండి”(Be part of the plan)అనే నినాదంతో నిర్వహించ నున్నట్టు ఆయన తెలిపారు.ఈ వేడుకల్లో జీవ వైవిద్యానికి సంబంధించి ప్రముఖ వ్యక్తలు పాల్గొని జీవ వైవిద్యం ఆవశ్యకత దాని పరిరక్షణకు మానవాళి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు వంటి అంశాలపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

అంతేగాక అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవాన్నిపురస్కరించుకుని రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో జీవ వైవిద్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో ముఖ్యంగా యువత,విద్యార్దుల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు, బయో డైవర్సిటీ కన్సర్వేషన్ అవార్డులను అందించడం జరుగుతుందని ఎపి బయోడైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శి కృష్ణ మూర్తి తెలియజేశారు.ఇందుకు సంబంధించి ఈనెల 21వ తేదీన ఉదయం 9గం.ల నుండి విశాఖపట్నం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల పారులో 9-10 తరగతుల విద్యార్ధిణీ విద్యార్ధులకు వ్యాసరచన,చిత్రలేఖనం,వకృత్వ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

జీవ వైవిద్యానికి సంబంధించి కొంత సంక్షిప్త సమాచారం.

భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం.నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం.మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది.ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి.ఇది వరకు ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి.రాను రాను అవి కనుమరుగైపోతున్నాయి.ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి.సుమారు 45 వేల వృక్ష జాతులు,దాదాపు 77 వేల జంతు జాతులు మన దేశంలో ఉన్నాయి.కానీ ఇదంతా గతం.నేడు విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికి పైగా ప్రమాదంలో ఉంది.వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి.గత కొన్ని దశాబ్దాల్లో 50 శాతానికి పైగా అరణ్యాలు,70 శాతానికి పైగా నీటి వనరులు కనుమరుగై పోయాయి.విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవన శైలితో రూపుమాపేశాము.సముద్రతీరాలను అతలా కుతలం చేసేశాము.ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాల్లోని వన్యప్రాణుల్నివేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు,కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా,విచక్షణా రహితంగా వాడేలా చేసింది.దీంతో మన నేలను,దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవాల్సి వచ్చింది.

మన దేశంలో ఆదివాసులు (గిరిజనులు,కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను,పదిలంగానూ అక్కడే జీవ వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది.ఎన్నో పంటలలో వైవిధ్యాలు,రకాలు,ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాల్లోనే అధికం.ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్నిదెబ్బతీస్తోంది.వీటిని రూపొందించే,ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి.జన్యుమార్పిడి వల్ల వచ్చే ప్రభావాలు స్వల్ప కాలంలో,దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్యయనం చేయకుండా వీటిని ఏజీవ జాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు.తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

మనం జీవ వైవిద్యాన్ని కాపాడు కోవాలంటే మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్నితగ్గించాలి.జంతువుల్ని,మొక్కల్ని పరిరక్షించు కోవాలి.చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్నివాడుతుంటారు.దీన్ని మానుకోవాలి.మొక్కలు నాటి పర్యావరణాన్నిపరిరక్షించుకుందాం.


Comments