మరింత బలోపేతంగా “ఈ-ఆఫీస్” వ్యవస్థ.



విజయవాడ (ప్రజా అమరావతి);



*మరింత బలోపేతంగా “ఈ-ఆఫీస్” వ్యవస్థ*

 

*ప్రభుత్వ ప్రక్రియలు, సేవా పంపిణీలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ-ఆఫీస్ అప్లికేషన్ అప్ గ్రెడేషన్*


*తాజా వెర్షన్ 7.x కి ఈ-ఆఫీస్ ను అప్ గ్రెడేషన్ చేస్తోన్న ఢిల్లీలోని ఎన్ఐసీ, భారత ప్రభుత్వం*


*అప్ గ్రెడేషన్ ప్రక్రియను ప్రత్యేకంగా చేస్తున్న ఢిల్లీ ఎన్ఐసీ బృందం.. ఈ నేపథ్యంలో  వివిధ రాష్ట్రాలకు అప్ గ్రెడేషన్ కు షెడ్యూల్ ప్రకటన* 


*రాష్ట్రంలో ఈ నెల 17 నుండి 25 వరకు అప్ గ్రెడేషన్ ప్రక్రియకు షెడ్యూల్ ఖరారు.. అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం..*


*ఇదే తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మరియు సీబీఎస్ఈ వంటి సంస్థల్లో అప్ గ్రెడేషన్ ప్రక్రియకు షెడ్యూల్ ఖరారు*


*పాతవెర్షన్ లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించడాన్ని ఎన్ఐసీ నిలిపివేసిన నేపథ్యంలో అన్ని కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల ఈ-ఆఫీస్‌ను తాజా వెర్షన్ 7.x కు అప్ గ్రేడ్ చేసుకోమని ఆదేశించిన భారత ప్రభుత్వం* 


*తాజా వెర్షన్ కి అప్ గ్రేడ్ చేసిన ఈ-ఆఫీస్ కొత్త ఫీచర్లను ఉపయోగించుకుంటున్న 14 రాష్ట్రాలు*


*ఈ ఆఫీస్ ఫైళ్లలో ట్యాంపరింగ్ జరుగుతుందన్న అపోహలు పూర్తిగా నిరాధారం..*

  

*ఈ-ఆఫీస్ ఫైల్‌లు అత్యంత భద్రతతో కూడిన ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో నిల్వ.. విపత్తుల సమయంలో రికవరీకి అవకాశం*


*ఒక్కసారి ఈ-ఫైల్ లోకి సమాచారం చేరితే సంబంధిత ఫైల్ ను తొలగించడం, మార్పులు చేర్పులు చేయడం అసాధ్యం*


: *రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ విభాగం సెక్రటరీ శ్రీ. కోన శశిధర్*



ప్రభుత్వ కార్యకలాపాలు, సేవా పంపిణీలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కీలకమైన ఈ-ఆఫీస్ ను భారత ప్రభుత్వం తాజా వెర్షన్ 7.x కి అప్ గ్రేడ్ చేస్తోందని, ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేస్తున్నామని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ విభాగం సెక్రటరీ కోన శశిధర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అప్ గ్రెడేషన్ ప్రక్రియను ఢిల్లీ ఎన్ఐసీ బృందం మాత్రమే ప్రత్యేకంగా చేస్తుండటంతో అప్ గ్రెడేషన్ కు వివిధ రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ -ఆఫీస్ ను 17 మే, 2024 నుండి 25మే 2024 వరకు అప్  గ్రేడ్ చేసేందుకు షెడ్యూల్ ను సూచించిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మరియు సీబీఎస్ఈ వంటి సంస్థల్లో ఇదే తేదీల్లో అప్‌గ్రేడ్ షెడ్యూల్ ఖరారు చేసిందన్నారు. ఈ-ఆఫీస్ 7.xకి అంగీకరించిన ఇతర రాష్ట్రాలు/కేంద్ర మంత్రిత్వ శాఖలు 7-10 రోజుల డౌన్‌ టైమ్‌ పడుతుందన్నారు. వెర్షన్ అప్ గ్రెడేషన్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదని, వెర్షన్ అప్ గ్రెడేషన్ బాధ్యతను భారత ప్రభుత్వం, ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు.


ఈ-ఆఫీస్ ఫైల్‌లు అత్యంత భద్రతతో కూడిన ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో నిల్వ ఉంటుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ విభాగం సెక్రటరీ కోన శశిధర్ తెలిపారు. ఏదైనా విపత్తులు సంభవించినా కూడా సంబంధిత ఫైల్ కు సంబంధించిన బ్యాక్ అప్ (రికవరీ) సదుపాయం ఉంటుందన్నారు. ఒక్కసారి ఈ-ఫైల్ లోకి సమాచారం చేరితే సంబంధిత ఫైల్ ను తొలగించడం, మార్పులు చేర్పులు చేయడం అసాధ్యం అని,  ఈ-ఆఫీస్ ఫైళ్లను నిర్వహిస్తున్న ఎన్ఐసీ డేటాబేస్ శాశ్వతంగా నిల్వ ఉంటుందని, ఎవరికీ వాటిని మార్చేందుకు వీలు కాదని స్పష్టం చేశారు. ఈ ఆఫీస్ ఫైళ్లలో ట్యాంపరింగ్ జరుగుతుందని జరుగుతున్న ప్రచారం, కలుగుతున్న భయాలు, అపోహలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవమని స్పష్టం చేశారు. 


వివరాల్లోకి వెళ్తే పాతవెర్షన్ లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించడాన్ని ఎన్ఐసీ నిలిపివేసిన నేపథ్యంలో అన్ని కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల ఈ-ఆఫీస్‌ను తాజా వెర్షన్ 7.x కు అప్ గ్రేడ్ చేసుకోమని  భారత ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ-ఆఫీస్ అప్లికేషన్ ను 7.xకి అప్ గ్రెడేషన్ చేసే ప్రక్రియను ఎన్ఐసీ ఢిల్లీ బృందం సమర్థవంతంగా నిర్వహిస్తోందని, ఇప్పటికే 14 రాష్ట్రాలు తాజా వెర్షన్ కి అప్ గ్రెడేషన్ చేసిన ఈ-ఆఫీస్ కొత్త ఫీచర్లను ఉపయోగించుకుంటున్నాయని వివరించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల తో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ-ఆఫీస్  ప్రాజెక్టును ప్రారంభించిన భారత ప్రభుత్వం పాత వెర్షన్ లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించి ప్రస్తుత కాలానికనుగుణంగా తాజాగా కొత్త వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చిందని, తద్వారా ఈ-ఆఫీస్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ విభాగం సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు. 



Comments