నిర్మాణదారుల సమస్యలను పరిష్కరిస్తా సుజనా చౌదరి

 పశ్చిమను బిల్డప్ చేస్తా 

నిర్మాణదారుల సమస్యలను పరిష్కరిస్తా 

సుజనా చౌదరి 


విజయవాడ (ప్రజా అమరావతి);

నిర్మాణ రంగాన్ని  ప్రోత్సహించి  భవన నిర్మాణ కార్మికులకు బిల్డర్లకు అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ చైర్మన్ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం భవానీపురం  ఎస్ కన్వెన్షన్ సెంటర్లో విజయవాడ బిల్డర్స్ కాంట్రాక్టర్స్ - బిల్డింగ్ వర్కర్స్ ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భవన నిర్మాణదారుల సమస్యలను పరిష్కరించి అసంఘటితరంగ కార్మికులకు అండగా నిలబడతానన్నారు.  జగన్   అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణరంగం కుదేలైందని మూడు ముక్కలాటతో అమరావతి పనులు నిలిపివేయడంతో  కార్మికులు పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకి వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.ఐదేళ్ల పాలనలో  నిర్మాణ రంగాన్ని నిర్విర్యం చేసి పైశాచిక ఆనందం పొందాడన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కొనసాగించి ఉంటే  లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. నిర్మాణరంగం కుదేలవడం వలన బిల్డర్లు డీలాపడిపోయారని కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. టీడీపీ హయాంలో కళకళలాడిన నిర్మాణరంగం ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్  ఇసుక స్టీల్ ధరల పెంపు కూడా నిర్మాణాలపై ప్రభావం చూపిందని ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అమరావతిని అభివృద్ధి చేసి నిర్మాణదారులను కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.   ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాద్ క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వైవి రమణారావు క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రెటరీ రమేష్ అంకినీడు పరుచూరి కిరణ్  బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ ప్రెసిడెంట్ మండవ వసంత్ ప్రతినిధులు రామకోటయ్య పెనుగొండ సుబ్బారాయుడు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

Comments