*మంగళగిరి మనసు గెలిచా...ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తా!*
*ప్రజలచుట్టూ తిరిగి సేవలందిస్తా... శభాష్ లోకేష్ అన్పించుకుంటా*
*ఇచ్చిన ప్రతిహామీ నిలబెట్టుకుంటా...మీ బిడ్డలా ఆశీర్వదించండి
*
*మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్*
మంగళగిరి (ప్రజా అమరావతి): ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అయిదేళ్లుగా మంగళగిరి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వెన్నంటిఉన్నా, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నిరంతరం జనంలో ఉంటూ సేవలందించి వారు మనసులు గెలిచా...ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు, ఇప్పటం, వడ్డేశ్వరం గ్రామాల్లో జరిగిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిచాక ప్రజలు పనుల కోసం నా చుట్టూ తిరగాల్సిన పనిలేదు, నేనే ప్రజల చుట్టూ తిరిగి సేవలందించి అయిదేళ్ల తర్వాత శభాష్ లోకేష్ అన్పించుకుంటా. గత ఎన్నికల్లో ఓడిపోయాక టిడిపికి కంచుకోటలాంటి సీటు ఎంచుకోవాలని సన్నిహితులు సలహా ఇచ్చారు, కానీ ఓడిన చోట గెలవాలన్న పట్టుదలతో మంగళగిరినే ఎంచుకున్నా. ప్రజల మనసు గెలవాలని నిర్ణయించుకున్నా. సొంత డబ్బుతో మంగళగిరిలో 29 సంక్షేమ పథకాలు అమలుచేశా. గుళ్లు, చర్చిల మరమ్మతులకు నిధులిచ్చా. పాడైన రోడ్లు వేయించాను. 25ఏళ్లుగా రెండు కుటుంబాలకు మీరు అవకాశమిచ్చారు, వారు ఏనాడైనా కనీసం వాటర్ ట్యాంకర్ పంపించారా? నా తల్లిదండ్రులు నాకు ప్రజలకు సేవచేయడమే నేర్పించారు, కరకట్ట కమలాసన్ లా యాక్షన్ చేయడం రాదు. పేదరికం లేని మంగళగిరిగా మార్చడం, దేశం మొత్తమ్మీద మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మార్చడం నా లక్ష్యాలు, అహర్నిశలు శ్రమించి ఆ లక్ష్యాలను సాధిస్తా.
*షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తాం*
జగన్ అధికారంలోకి వచ్చాక కుంటిసాకులతో పేదలకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారు, ప్రజాప్రభుత్వం వచ్చాక షరతులు లేకుండా గతంలో మాదిరి సంక్షేమ పథకాలు అందజేస్తామని యువనేత లోకేష్ చెప్పారు. జగన్ ఈరోజు మంగళగిరి వచ్చి పదేపదే బటన్ నొక్కానని అంటున్నాడు. సంక్షేమం పేరుతో 10 ఇచ్చి వంద కొట్టేయడం జగన్ కు వెన్నతోపెట్టిన విద్య. గతంలో వందల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు వేలల్లో వస్తోంది. ఆర్టీసి ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, క్వార్టర్ ధరలన్నీ పెంచేశారు. 3132 కి.మీ.ల యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశా. అవి విన్నాక చంద్రబాబు, పవనన్న బాబు సూపర్ -6 హామీలను ప్రకటించారు. అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలిస్తాం, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు 3వేల చొప్పున భృతి అందిస్తాం. జగన్ శవరాజకీయం కోసం 32మంది వృద్ధులను నిర్ధాక్షిణ్యంగా చంపేశారు. మేం అధికారంలోకి వచ్చాక 3వేల పెన్షన్ 4వేలు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇళ్లవద్దకే అందిస్తాం. పనిచేయడానికే వచ్చా...ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా, మీ ఇంటిబిడ్డలా సేవలందిస్తా, ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని లోకేష్ విజ్ఞప్తిచేశారు.
*ఇప్పటం ప్రజల పోరాటం చరిత్రలో నిలుస్తుంది*
అరాచకపాలనపై ఇప్పటం ప్రజలు చేసిన పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలచిపోతుందని యువనేత లోకేష్ అన్నారు. ఇప్పటం గ్రామ రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ... ఇప్పటంలో జెసిబిలు తెచ్చి ఇళ్లు కూలగొట్టారు, న్యాయం కోసం మేమంతా పోరాటం చేశాం, సైకోపోవాలి, సైకిల్ రావాలనే నినాదం ఇప్పటం నుంచే వచ్చింది. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కారణంగా నష్టపోయిన బాధితులకు అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో పరిహారం అందిస్తాం. ఇళ్లు నిర్మించి తాళాలు అందజేస్తాం. ఎన్నికల ప్రచారంలో ఇప్పటం గ్రామానికి వెళ్లాలని పవనన్న నన్ను కోరారు. యువత భవిష్యత్తు కోసం మేం పొత్తుపెట్టుకున్నాం. మనమధ్య చిచ్చుపెట్టేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తోంది. అప్రమత్తంగా వారి కుటిల యత్నాలను అడ్డుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామస్తులు పలు సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు. ఇప్పటం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి. కెఎల్ వర్సిటీ అనుసంధానంగా బ్రిడ్జి నిర్మించాలి. ఇళ్లులేని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బుడగజంగాలకు ఇళ్లు, కులధృవీకరణ పత్రాలు అందించాలి. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ ఇప్పటం గ్రామానికి రోడ్డువేసి బస్ సౌకర్యం కల్పిస్తాం, కెఎల్ యుకి వెళ్లే బ్రిడ్జి నిర్మిస్తాం. ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. బుడగ జంగాలకు కులధృవీకరణ పత్రాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
*యువనేత దృష్టికి ఆత్మకూరు సమస్యలు*
రచ్చబండ సందర్భంగా ఆత్మకూరు ప్రజలు పలు సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామంలోని వడ్డెరపాలెం రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గ్రామశివార్లలో వంతెన శిథిలావస్థకు చేరుకుంది. కోవిద్ సమయంలో సేవలందించిన పారామెడికల్ సిబ్బందికి ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. జీతాల కోసం ధర్నాచేస్తే మాపై కేసులు పెట్టారు. ఆత్మకూరులో రోడ్డు విస్తరణ సందర్భంగా 100 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. పానకాలస్వామి గుడిపైకి మెట్లమార్గంలో వృద్ధులు వెళ్లలేకపోతున్నారు. ఉచిత బస్సు ఏర్పాటుచేయాలి. సగంలో ఆగిపోయిన మంగళగిరి ఐటి పార్కు పనులను పునఃప్రారంభించండి. కౌలురైతులకు సాయం అందించేలా చర్యలు తీసుకోండి. ఇళ్లకు మంచినీటి కుళాయిలు, సైడ్ కాల్వలు నిర్మించండి. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ... అధికారంలోకి వచ్చాక గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పైప్ లైన్ వేశాక సిమెంటు రోడ్లను నిర్మిస్తాం. శిథిలావస్థకు చేరిన వంతెన పునర్నిర్మిస్తాం. కోవిద్ సమయంలో సేవలందించిన పారామెడికల్ సిబ్బందికి బకాయిలు చెల్లిస్తాం. రోడ్డు విస్తరణలో నిరాశ్రయులైన వారికి స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇస్తాం. పానకాలస్వామి గుడివద్దకు ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ఏర్పాటు చేస్తాం. మంగళగిరి ఐటి పార్కుకు కంపెనీలు తెస్తాం. కౌలురైతుచట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి సాయం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెచ్చి మంగళగిరిని అభివృద్ధి చేయాలంటే రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరారు.
addComments
Post a Comment