తెనాలి విజయవాడ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల సొగసు చూడతరమా .

 తెనాలి విజయవాడ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల సొగసు చూడతరమా 




తెనాలి జూన్ 15 (ప్రజా అమరావతి): పేరుకి ఆంధ్ర ప్యారిస్, కానీ తెనాలి ఆర్టిసి అధికారులు తెనాలి ప్రయాణికులను ఇక్కట్లకు గురి చేయడంలో సిద్ధహస్తులుగా ఉన్నారు. సుమారు మూడు లక్షల వరకు జనాభా కలిగిన తెనాలి తో పాటు, తెనాలి డివిజన్లోని సుదీర్ఘ ప్రాంతాల నుండి తెనాలి వచ్చి విజయవాడ వెళ్లేందుకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులను ఆశ్రయిస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ప్రారంభమవుతుంది. బస్సులలో సౌకర్యాల కొరత అటుంచి, ప్రయాణికులు కూర్చునే సీట్లను చూస్తే, ఆహా ...ఈ ఆర్టీసీ బస్సుల సొగసు చూడతరమా  అనిపిస్తుంది. 70 రూపాయల ఛార్జీలు వసూలు చేస్తూ, సీట్లకు పట్టిన గతిని పట్టించుకోని, అధికారుల తీరును ప్రయాణికులు అసహనంతో దుయ్యబడుతున్నారు. కిటికీల అద్దాలు, మూసి వేస్తే తెరుచుకోవు ,తెరిస్తే మూసుకోవు, ఫలితంగా వర్షం వచ్చినప్పుడు, కిటికీలోంచి వర్షం బస్సులోనికి ప్రవేశించి, సీట్లన్నీ తడిసిపోయి,లేచి నించుని ప్రయాణించే దౌర్భాగ్యం,తెనాలి ప్రయాణికులకే సొంతం అయ్యింది. ఇలా ప్రయాణించే బదులు, సీట్లన్నీ తొలగించి, బెంచీలు వేస్తే, ఏదైనా గుడ్డతో తుడుచుకుని, కూర్చుని ప్రయాణించవచ్చని, ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. వీటి పరిస్థితే ఇలా ఉంటే ,తెనాలి డివిజన్లో తిరిగే కొన్ని ఆర్టీసీ బస్సులు,కాలం చెల్లిపోయి, ప్రయాణంలో ఎక్కడికక్కడికి చెడిపోయి ఆగిపోతున్నాయి. సామర్ధ్య కోల్పోయిన ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే, ఆషామాషీ వ్యవహారంగా లేదు. ఇది పూర్తిగా ఆర్టిసి అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా ఉందని, తక్షణం పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments