పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాల్సిందే .

 


పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాల్సిందే 


ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలి 

కృష్ణా, గోదావరి నది జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తాము 

మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయి నేపాల్ దేశంలో పట్టుబడ్డ ఎర్ర చందనాన్ని వెనక్కి తీసుకురావాలి 

కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖల ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం 

అమరావతి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేయాలని... అందులో భాగంగా పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. వరుసగా సమీక్షలు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శాఖాపరమైన అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రిగారి నివాసంలో అటవీ శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎర్ర చందనం అక్రమ రవాణా అంశంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలు చర్చకు వచ్చాయి. 

రాష్ట్రంలో పొల్యూషన్ ఆడిట్ విధానంపై చర్చించారు. ప్రతి జిల్లాలోని కాలుష్యం లెక్కలు తీయాలని, జల, వాయు కాలుష్యాల వివరాలు అందించాలని ఆదేశించారు. పరిశ్రమల వారీగా కాలుష్యం వివరాలు అందించి కాలుష్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తెలపాలన్నారు. కృష్ణా, గోదావరి తీరాల్లో కాలుష్యం, కాగితపు పరిశ్రమల నుంచి వస్తున్న జల కాలుష్యంపైనా చర్చించారు. ఈ రెండు జీవ నదుల శుద్ధీకరణపైనా దృష్టి పెట్టాలని, ఈ అంశంపై కూలంకషంగా సమీక్షించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం 

ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామని తెలిపారు. ఇక్కడి నుంచి స్మగ్లర్లు తరలించిన ఎర్ర చందనం నేపాల్ దేశంలోని భద్రత సిబ్బందికి పట్టుబడిందనీ... ఆ ఎర్ర చందనం పరిమాణం 172 మెట్రిక్ టన్నులు అని అధికారులు వివరించారు. అక్కడ ఉన్న మన ఎర్ర చందనాన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని, దేశంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎర్ర చందనం పట్టుబడి ఉందో కూడా తెలియచేయాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.

Comments