*గత పాలకుల్లో కొందరికి ఉన్న స్కిల్స్ అలాంటివి మరి..*
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ప్రజా అమరావతి): ఉపాధి లేక యువత వ్యసనాలకు అలవాటు పడుతున్నారనే విషయాన్ని గుర్తించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జేఎన్‌ఎఫ్‌ఏయూలో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్నారు. గంజాయి సేవించే వారే కాదు అమ్మేవాళ్ళు కూడా ఇంజినీరింగ్ చదివిన వారు ఉన్నారన్నారు.
పంజాబ్ నిర్లక్యం వల్ల ఇప్పుడు అక్కడ యువత వ్యసనాలకు బానిస అయ్యి దారుణ పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. సమాజం అప్రమత్తం కావాలని, ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, అమ్ముతున్నా సమాచారం అందించాలని తెలిపారు. కొందరు ప్రజా జీవితంలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గత పాలకుల్లో కొందరు గొలుసు దొంగతనాలు, డ్రగ్స్ అమ్మడం కూడా స్కిల్స్ అనుకున్నారని.. గత పాలకుల్లో కొందరికి ఉన్న స్కిల్స్ అలాంటివి మరి అంటూ సెటైర్ విసిరారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో కొందరికి కనీసం స్కిల్స్ ఉండటం లేదన్నారు. కొన్ని కళాశాలలో అధ్యాపకులు, సరైన వసతులు ఉండటం లేదన్నారు.
కళాశాలలు ఇలాగే కొనసాగితే వారి గుర్తింపు రద్దు చేయడానికి వెనకాడమని స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమిని ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘వృధాప్య పెన్షన్, షాది ముబారక్‌లు కాదు గొప్ప... గత ప్రభుత్వం 1000 ఇస్తే మేము 2000 ఇచ్చాం వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వొచ్చు. ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సింది స్కిల్ డెవలప్‌మెంట్, యువతకు ఉద్యోగ కల్పనపై... ఆ బాధ్యత మేము తీసుకుంటాం’’ అని వెల్లడించారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఉన్న అజయ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారన్నారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో పర్యటించి... నగరానికి అవసరమైన సహాయం చేయాలని ఆయనను కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం , కమిషనర్ దేవసేన పాల్గొన్నారు..
addComments
Post a Comment