వరద నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలి.. కమిషనర్‌ ఆమ్రపాలి.

 వరద నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలి.. 

కమిషనర్‌ ఆమ్రపాలి.



హైదరాబాద్‌ సిటీ (ప్రజా అమరావతి): వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. అడిషనల్‌, జోనల్‌ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వర్షాల సమయంలో నీరు నిలిచే చోట శాశ్వత పరిష్కారం చూపాలని, ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక అందజేయాలని సూచించారు. విద్యుత్‌ కనెక్షన్‌ కమర్షియల్‌గా ఉండి, రెసిడెన్షియల్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్న యజమానులకు నోటీసులు జారీచేసి ట్యాక్స్‌ రివిజన్‌ చేపట్టాలన్నారు.


నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ఆదేశించారు. మరో సమీక్షలో నగరంలో కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ సూచించారు. వైద్యారోగ్యశాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని..యాంటీ లార్వల్‌, ఫాగింగ్‌ విస్తృతం చేయాలని పేర్కొన్నారు.


ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన


వర్షాల నేపథ్యంలో కమిషనర్‌ ఆమ్రపాలి ఎల్బీనగర్‌ జోన్‌లోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. శానిటేషన్‌ నిర్వహణ, రోడ్లపై పాట్‌హోల్స్‌ తదితర వాటిని పరిశీలించారు. సరూర్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌, నాగోల్‌ రోడ్‌ మీదుగా ఉప్పల్‌ భగాయత్‌, ఉప్పల్‌ స్టేడియం రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్డు మరమ్మతులు, శానిటేషన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.. 

Comments