మంగళగిరి (ప్రజా అమరావతి);
పీతల సుజాత, మాజీమంత్రివర్యులు
పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం
పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీమంత్రివర్యులు పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘‘ నేటి నుంచి వారం రోజులపాటు ఆంధ్రరాష్ట్రంలో పల్లె పండుగ వారోత్సవాలు జరుగుతాయి. 4500 కోట్ల రూపాయలతో 30 వేల అభివృద్ధి పనులను జనవరి నెలాఖరులోగా పూర్తి చేస్తాం. గత వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దాదాపు 13000 కోట్ల రూపాయల పంచాయతీల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. ప్రజలచేత ఎన్నుకున్న సర్పంచ్ లను, వార్డు మెంబర్ లను అవమానించి గ్రామాల్లో అభివృద్ధి చేయనివ్వలేదు. ఉపాధి హామీ పథకం ద్వారా 45180 జాబ్ కార్డ్స్ ను వైసీపీ ప్రభుత్వం తొలగించింది. 2 లక్షల మంది పేదలకు ఉపాధి హామీ పనులు లేకుండా చేశారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి 2 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ బకాయిలను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్ లకు, వార్డు మెంబర్ లకు పని లేకుండా చేశారు. 2014 – 19వ సంవత్సరంలో దళిత వాడల్లో 27000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఘనత నారా లోకేష్ గారిది. అంతేకాకుండా 22 వేల కిలోమీటర్లు బీటీ రోడ్లు నిర్మించారు. 27 లక్ష్లల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. దాదాపు 6000 వరకు అంగన్వాడీ భవనాలు నిర్మించారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో టీడీపీ చేపట్టింది. కూటమి ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు నిర్మించాలని నిర్ణయించాము. 25000 గోకులాలు నిర్మిస్తాం. 10 వేల కాంటూర్స్ ఏర్పాటు చేస్తాం. పండుగలకు వేదికగా గ్రామాలు ఉండేవి. కాని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సంస్కృతి సంప్రదాయాలను పక్కన పెట్టి గ్రామాలను నాశనం చేసింది. కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది. గత టీడీపీ ప్రభుత్వంలో నరేగ నిధులను ఉపయోగించి గ్రామాలను అభివృద్ధి చేశాము. కానీ వైసీపీ ప్రభుత్వం నరేగ నిధులను పక్కదారి పట్టించి జేబులు నింపుకుంది. చంద్రబాబు నాయుడు పాలనలో మాత్రమే గ్రామాల అభివృద్ధి జరిగింది. జగన్ పాలనలో జలజీవన్ మిషన్ ను నిర్వీర్యం చేశారు. ఆ జలజీవన్ మిషన్ లో కూడా 100 కోట్ల స్క్యామ్ చేశారు. పేదలకు మంచినీరు ఇచ్చే విషయంలో కూడా నిధులను దోచుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా చేసిన ఘనత వైసీపీదే. కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెట్టి గ్రామాలకు పూర్వ వైభవం తీసుకొస్తాము. పల్లె పండుగ వారోత్సవాలను విజయవంతం చేయాలి.’’ అని మాజీమంత్రివర్యులు పీతల సుజాత అన్నారు.
addComments
Post a Comment