సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ప్రజల వద్ద కు చేరవేయడంలో మీడియా సంధానకర్త గా ప్రధాన భూమిక పోషిస్తోంది
– తద్వారా ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారధిగా మీడియా వ్యవహరిస్తోంది:
శ్రీ మహమ్మద్ నజీర్ అహ్మద్, గుంటూరు తూర్పు శాసన సభ్యులు.
సమతుల్యత కలిగిన వాస్తవ వార్తలకు జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాలి: పత్రికా సమాచార కార్యలయం (ఆంధ్రప్రదేశ్) అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజేందర్ చౌదరి.
పిఐబి ఆధ్వర్యంలో గుంటూరు లో వార్తాలాప్ నిర్వహణ
గుంటూరు, అక్టోబర్ 24 (ప్రజా అమరావతి);
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారధిగా మీడియా వ్యవహరిస్తోందని గుంటూరు తూర్పు శాసన సభ్యులు శ్రీ మహమ్మద్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సామాన్యుడి కోసం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.
గుంటూరు లో ఈరోజు(24.10.2024) కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి), విజయవాడ ఆధ్వర్యంలో గ్రామీణ, జిల్లా పాత్రికేయులకు నిర్వహించిన వార్తాలాప్ మీడియా వర్క్ షాప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు. జిల్లా, గ్రామీణ స్థాయిల్లో పనిచేస్తున్న పాత్రికేయులు ప్రజల్లో సానుకూల దృక్పథం కల్గించే వార్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో లోటుపాట్లు ఏమైనా వుంటే సద్విమర్శలు చేయవచ్చని అన్నారు.
ప్రత్యేక అతిధిగా పాల్గొన్న శ్రీమతి వెలగపూడి దుర్గాంబ సిద్దార్థ న్యాయ కళాశాల, విజయవాడ, ప్రిన్సిపల్ డాక్టర్ Ch. దివాకర్ బాబు మాట్లాడుతూ ఇటీవల సవరించిన క్రిమినల్ చట్టాలు కాలానుగుణంగా మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని సవరించబడ్డాయని అన్నారు. క్రిమినల్ చట్టాలు సూక్ష్మ నైపుణ్యాలు మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రస్తుత సమాజానికి ఆచరణాత్మక ఉపయోగం కలిగి మన చుట్టూ జరుగుతున్న నేరాలను అరికట్టడంలో దోహదం చేస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా మరియు సవరించిన చట్టాలను తీసుకురావడం ఒక మంచి పరిణామమని పేర్కొన్నారు. మూడు క్రిమినల్ చట్టాలు... శిక్ష కంటే న్యాయంపై దృష్టి సారిస్తాయని, అన్ని విధాలా సత్వర న్యాయం అందించడం, న్యాయవ్యవస్థ మరియు కోర్టు నిర్వహణ వ్యవస్థను పటిష్ట పరచడం, 'అందరికీ న్యాయం' వీటి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
‘హిందూ’ ఆంగ్ల దినపత్రిక సీనియర్ కరెస్పాండెంట్ ఎం. సాంబశివరావు మాట్లాడుతూ మీడియాలో సమతుల్యత కలిగిన వాస్తవ వార్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పరిశోధనాత్మక వార్తలు దాదాపుగా కనుమరుగయ్యాయని.. సంచలనాత్మక వార్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం శోచనీయమని అభిప్రాయపడ్డారు. సంచలనాలకు ఒక వేధికగా సోషల్ మీడియా మారుతున్న ప్రస్తుత తరుణంలో పాత్రికేయులు మరింత అప్రమత్తత కలిగి తమ బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. డెవలప్మెంట్ రిపోర్టింగ్ సంబంధిత వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని తద్వారా ప్రజలకు ప్రభుత్వ పధకాలపై అవగాహన కలిగించినట్లవుతుందని తెలిపారు. ప్రభుత్వ పధకాలను ప్రజలు సమగ్రంగా వినియోగించుకునే విధంగా, పత్రికలు తమ కధనాలు ద్వారా తెలియపరుస్తాయని అన్నారు.
ప్రజలకు ఎంతో అవసరమైన సమాచార హక్కు చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం పై ‘జనం’ సహాయ సంపాదకులు, శ్రీ కె. వెంకట రమణ వివరణాత్మక విశ్లేషణతో ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు.
అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్, గుంటూరు, శ్రీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రజా సంక్షేమ పథకాల అమలులో బ్యాంక్ లు గణనీయ పాత్రను పోషిస్తున్నాయని అన్నారు.
అంతకుమందు.. వార్తలప్-మీడియా వర్క్‌షాప్ సందర్భంగా తన పరిచయ సందేశంలో, పత్రికా సమాచార కార్యలయం (ఆంధ్రప్రదేశ్ రీజియన్) అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజేందర్ చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మీడియా ద్వారా పంపిణీ చేయడంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పాత్ర గురించి వివరించారు. బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు మరియు నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా అవసరమైన మెరుగులు దిద్దారని చెప్పారు. ప్రజల కోసం ప్రభుత్వం చేసే ప్ర్రతి పనికి సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు, పత్రికలకు చేరవేసే సమాచార మాధ్యమంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన విధులు నిర్వహిస్తోందన్నారు. సంచలనాలకు తావులేకుండా సమాచారాన్ని సూటిగా తెలియజేయడమే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బాధ్యతగా స్వీకరించిందని, సమాచారం అందించే సమయంలో సొంత అభిప్రాయాలను జోడించడం, మార్పులు చేర్పులు చేయడం తగదని ఆయన జర్నలిస్టులను కోరారు. పాత్రికేయుల వృత్తి నైపుణ్యం పెంపొందించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి శిక్షణా తరగతులను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవాడ కార్యాలయం చేపడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పధకాల గురించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. పత్రికా సమాచార కార్యలయం (పి. ఐ. బి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సి. బి. సి.), ఆకాశవాణి, దూరదర్శన్ అధికారులు, సిబ్బంది, పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment