*మూల నక్షత్రం రోజున సరస్వతి మాతకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పణ*
*గౌరవ ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలోనూ మూడు క్యూ లైన్ల ద్వారా అనుమతుల మేరకు అమ్మవారి దర్శనానికి వెసులుబాటు*
*అందరికీ సర్వదర్శనమే*
*వీఐపి, వీవీఐపీ, అంతరా లయ దర్శనాల బంద్*
*సమయానుకూలంగా ట్రాఫిక్ నియంత్రణ*
*సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉండవు*
*దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి*
విజయవాడ (ప్రజా అమరావతి):- ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూలా నక్షత్రం తిధి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఇంద్రకీలాద్రి దిగువున ఉన్న మోడల్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దసరా ఉత్సవాల నిర్వహణ ప్రత్యేక అధికారి రామచంద్రమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావులతో కలిసి మంత్రి మాట్లాడారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో అత్యంత కీలకమైన అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు వారికి సులభతరమైన దర్శనం కల్పించేందుకు సేవలందిస్తున్న వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు భక్తులకు అందిస్తున్న త్రాగునీరు, పాలు, మజ్జిగ వంటి ద్రవపదార్ధాలను కూడా మొత్తం ఐదు క్యూలైన్లల్లో ఉన్న అవసరమైన ప్రతి భక్తుడికి అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలోనూ మూడు క్యూ లైన్ల ద్వారా అనుమతుల మేరకు అమ్మవారి దర్శనానికి వెసులుబాటు కల్పిస్తామన్నారు.*
*ఏ ఒక్క భక్తడు కూడా ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను అనుసరించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. లక్షల్లో తరలిరానున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా కొండపై సౌకర్యాలను పెంచామన్నారు. సాధారణ సందర్భాల్లో ఉండే దర్శనం టికెట్ల ధరలు బుధవారంనాడు ఉండబోవన్నారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడు వీఐపి దర్శనం మాదిరిగానే ఎటువంటి రుసుము చెల్లించకుండా సంతృప్తికర దర్శనం పొందేందుకు దేవదాయ శాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. మధ్యాహ్నం 2-3 గంటల మధ్య గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కార్యక్రమానికి రావాలని దేవాదాయ శాఖ తరపున ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రిని ఆహ్వానించామన్నారు. మూలా నక్షత్రం నేపథ్యంలో ఎవరికీ కూడా అంతరాలయ దర్శన ప్రవేశం ఉండదన్నారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగ కార్యాలయం సూచించిన కొద్దిమంది ప్రజా ప్రతినిధులకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు చంద్రబాబుకు తీర్థ, ప్రసాదాలు వేదాశీర్వచనం అందజేస్తారన్నారు. ఇటీవల నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రమాదం తాలుకూ ఫొటొ ఎగ్జిబిషన్ ప్రదర్శిస్తామని, సమయాభావాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటొ ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారని చెప్పారు.*
*నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రాక సందర్భంగా నగరంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. డైనమిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా సమయానుకూలంగా ఈ ఆంక్షలు ఉంటాయన్నారు. కనకదుర్గా ఫ్లైవోవర్‌పై ఎటువంటి ఆంక్షలు లేవని వివరించారు. కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఉన్న ఫ్లైవోవర్‌పై రాకపోకలు పూర్తిగా నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 4500 మంది పోలీసులు శరన్నవరాత్రి ఉత్సవాలలో విధులు నిర్వహిస్తుండగా మరొక 1100 మంది పోలీసులు 110 హోల్డింగ్ టీంలుగా విధులు నిర్వహిస్తారని తెలిపారు.
addComments
Post a Comment