ఉన్నతి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి - ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్.

 ఉన్నతి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి -

                     ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్



 

అమరావతి (ప్రజా అమరావతి);

       మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి  హామీ పథకంలో పనిచేస్తున్న కూలీ కుటుంబాల్లో అర్హత కలిగిన యువతి, యువకులు నైపుణ్యాలు  పొంది, జీవనోపాధిని మెరుగుపర్చుకుని తద్వారా జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి “ఉన్నతి” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉన్నతి కార్యక్రమం కింద ఉచితంగా  ఇచ్చే శిక్షణలకు సంబంధించి ఉపాధి హామీ కూలీ కుటుంబాలకు అవగాహన కల్పించి వారిని నైపుణ్యవంతులుగా చేసే బాధ్యత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది తీసుకోవాలని, శిక్షణా కాలంలో వయోజనులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్దేశించిన రోజు కూలీ రూ.300/- చొప్పున 90 రోజులకు గానూ రూ.27,000/- లభిస్తుందని ఈ అవకాశాన్ని వయోజనులందరూ వినియోగించుకోవాలని  ఆయన సూచించారు. 

గడిచిన ఆర్ధిక సంవత్సరాల్లో 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలకు చెందిన వయోజనులు శిక్షణకు అర్హులు. ఉన్నతి సర్వే మొబైల్ యాప్ లో పొందుపరచిన 100 రోజులు పూర్తిచేసిన కుటుంబాలకు చెందిన వయోజనులు ఆశక్తి కనపర్చిన శిక్షణ వివరాలను ఎఫ్.ఎ, టిఎలు సేకరిస్తారు. అనంతరం వారు ఎంచుకున్న వివిధ కోర్సుల్లో సీడాప్- దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. సంబంధిత జిల్లాకు చెందిన, ఉపాధి హామీ పథకంలో 2019-20 నుంచి ఇప్పటివరకు ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాల వయోజనులు, 18-45 సంవత్సరాల మధ్య వయస్కులై పదో  తరగతి పాస్ లేదా డిగ్రీ ఫెయిల్ అయిన వారు ఈ శిక్షణకు  అర్హులు.  ఈ శిక్షణ కాల పరిమితి 90 – 120 రోజులు ఉంటుంది. కోర్సుకి అవసరమైన లెర్నింగ్ మెటీరియల్, రెండు జతల యూనిఫారం, స్త్రీ పురుషులకు వేర్వేరుగా ఉచిత హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు. శిక్షణ సమయంలో వ్యక్తిగత ట్యాబ్ ఉపయోగించుకునే సౌకర్యం, హైస్పీడ్ ఇంటర్నెట్ ఐటి ల్యాబ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. శిక్షణ అనంతరం ఉత్తిర్ణులైన అభ్యర్ధులకు సర్టిఫికేట్,ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తారు. 

శిక్షణలో భాగంగా మార్కెటింగ్, ఎలక్ట్రికల్ అసెంబ్లింగ్, పిసిబి ఆపరేటర్, ఏరోస్పేస్ & ఏవియేషన్,  వ్యవసాయం, దుస్తుల తయారీ,  హోమ్ ఫర్నిషింగ్, ఆటోమోటివ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సేవలు,  బ్యూటీషియన్ కోర్సులు వంటి  31 రంగాల్లో  215 కోర్సుల్లో  ఉచితంగా శిక్షణ ఇస్తారు. 

కూలీ కుటుంబాలు దీర్ఘకాలం ఉపాధి హామీ పథకంపైనే ఆధార పడకుండా నైపుణ్యం కల్గిన వృత్తుల్లోకి ప్రవేశించి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అందుకు ఉన్నతి శిక్షణా కార్యక్రమాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని ఇటు కూలీ కుటుంబాలు అటు ఉపాధి హామీ సిబ్బందిని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి  శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కోరారు.

Comments