పిఠాపురం (ప్రజా అమరావతి);
*గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు... కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు
*
• పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి
• గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు
• తిరుపతి దుర్ఘటన విషయంలో టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, పాలక మండలి సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పాలి
• నేను ప్రజల్ని ఓట్లు అడిగాను కాబట్టే.. తప్పు జరిగినపుడు బాధ్యతగా క్షమాపణ కోరాను
• అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయింది
• సొంత ఇష్టాలను పక్కన పెట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం పనిచేయండి
• పిఠాపురం నుంచే జిల్లాల పర్యటన ప్రారంభిస్తాను
• పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా గోకులాలను ప్రారంభించి పిఠాపురం బహిరంగసభలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ .
'గత ప్రభుత్వం పాడి రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో ఎవరూ బాగుపడకూడదు.. ఎవరి దగ్గరా డబ్బులుండకూడదు అనే ఒకే ఒక సిద్ధాంతంతో లక్షలాది పాడిరైతుల పొట్టకొట్టే చర్యలు ఆనాటి పాలకులు చేపట్టారు. సహకార డెయిరీలను గాలికొదిలేసి, సొంత డెయిరీలను అభివృద్ధి చేసుకోవడంపైన దృష్టి పెట్టార' ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పారు. పాడి రైతులకు ఎంతో అవసరం అయ్యే గోకులాలను గత అయిదేళ్ల పాలనలో కేవలం 268 నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల్లోనే 12,500 నిర్మించి పాడి రైతులకు అండగా నిలిచిందని, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయం అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరడం, ముద్దులు పెట్టడం కాదు... కష్టంలో ఉన్నవారికి అండగా నిలబడటడం, వారికి వృద్ధిలో తోడ్పాటునందించడమే నిజమైన రాజకీయం అన్నారు. పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలను ఒకే రోజు ప్రారంభించే కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీ పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం పాతబస్టాండు వద్ద ఉన్న మున్సిపల్ పాఠశాలలో జరిగిన సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... ‘‘నాకు స్వచ్ఛంగా రాజకీయాలు చేయడమే తెలుసు. మండల పరిషత్ అధికారి మీద దాడి జరిగితే ఆయనది ఏ కులం.. ఏ ప్రాంతం అని చూడకుండానే పరామర్శకు వెళ్లాను. ఓ ప్రభుత్వ అధికారి కొడుకుగా ఈ రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టిన జీతం సొమ్మును తిని పెరిగిన వ్యక్తిగా ఏ ప్రభుత్వ అధికారిపై, సిబ్బందిపై దాడి జరిగినా ఇలాగే స్పందించేవాడిని. ప్రభుత్వ అధికారుల మీద దాడి జరిగితే మా నాన్న మీద జరిగిన దాడిగానే దాన్ని భావిస్తాను.
అరాచక పాలన నుంచి విముక్తి అయిన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి నిబద్ధతతో పని చేయాలనే తలంపుతోనే ముందుకు వెళ్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా సరైన రోడ్లు లేక, డోలీల్లో వైద్యసేవలకు తీసుకెళ్తూ నరకయాతన పడుతున్న గిరిజనుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకే కొండల్లో తిరిగాను. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అని తెలిసినా, హెచ్చరికలు ఉన్నా తెగించి కొండల్లో నడవడం వెనుక అక్కడి ప్రజల బాధలను స్వయంగా తెలుసుకోవాలన్న తపన, వేదన నాలో ఉన్నాయి. కాబట్టే మారుమూల కుగ్రామాలకు సైతం వెళ్తున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు వేసేందుకు అప్పటికప్పుడు రూ.39 కోట్లు ముఖ్యమంత్రి పెద్ద హృదయంతో అందించడం సంతోషకరం. రూ.500 కోట్లు వెచ్చించి ప్యాలెస్ లు కట్టుకున్న వారికి, రూ.2 కోట్లతో బాత్ రూంలు నిర్మించుకున్న వారికి, గిరిజనులు కష్టాలేం తెలుస్తాయి..?
• న్యూజిలాండ్ తరహాలో పాడి రైతులు ఎదగాలి
వైసీపీ పాలనలో సొంత డెయిరీలను, కొన్ని ప్రత్యేక డెయిరీలను ప్రోత్సహించారు. కనీసం పాడిరైతును పట్టించుకున్న దాఖలాలు లేవు. గోకులాలు నిర్మిస్తే పశువులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటే పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని తెలిసినా వైసీపీ నాయకులకు అవేవీ పట్టలేదు. ఇప్పుడు నిర్మించిన గోకులాలతో చిన్నస్థాయి పాడి రైతులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఆదాయం పెరుగుతుంది. గుజరాత్ లో మహిళలు శ్వేత విప్లవం ద్వారా రూ.60 వేల కోట్ల ఆదాయం అర్జించారు. ప్రపంచంలోనే న్యూజిలాండ్ పాడి విప్లవంతో సరికొత్త పంథాలో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలోనూ పాడి రైతులకు ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుంది. వారికి అన్ని విధాలా సహకరిస్తాం. న్యూజిలాండ్ తరహాలో పాడి రైతులు అత్యున్నతంగా ఎదగాలి అన్నదే నా ఆకాంక్ష. 90 శాతం రాయితీతో నరేగా నిధులతో గోకులాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. అతి తక్కువ కాలంలోనే గోకులాలను సుందరంగా నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చాం. గత ప్రభుత్వం స్కాంలలో రికార్డులు సృష్టిస్తే, కూటమి ప్రభుత్వం స్కీంలు, అభివృద్ధిలో రికార్డులు సృష్టిస్తోంది. గట్టిగా పని చేస్తే డబ్బులు అవే వస్తాయి. ప్రజల కోసం శ్రమ చేస్తే పెట్టుబడులు అవే వస్తాయి. వైసీపీ పాలనలో పాడి పరిశ్రమలపై ఆ పార్టీ నాయకులు గుత్తాధిపత్యం చేశారు. అమూల్ డెయిరీకు మొత్తం ఆస్తులను రాసిచ్చారు. మేం పాడి రైతుకు అండగా నిలిచేందుకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం.
• ఉపాధి హామీలో కొత్త విధానాలు
రాష్ట్రంలోని 97 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు ఎన్నడూ లేనట్లుగా వేతనాలను సకాలంలో చెల్లిస్తున్నాం. రూ.5,193 కోట్ల వేతనాలను సకాలంలో చెల్లించాం. కేవలం రూ.2 కోట్లు మాత్రమే వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. సుస్థిరమైన ఆదాయం, మౌలిక వసతులు కల్పనకు ఉపాధి పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాం. పల్లె పండుగలో గ్రామాల్లో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలతో పాటు దొంగ మస్టర్ల నిరోధానికి నూతన యాజమాన్య పద్ధతిని అవలంభిస్తున్నాం. ఫ్లైయింగ్ స్క్వాడ్ లు నిరంతరం నిఘా పెడతాయి. నాణ్యత, జవాబుదారీతనం అందించే విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదు.
• తిరుపతి ఘటన బాధాకరం... ఛైర్మన్, ఈవో, అదనపు ఈవోలు క్షమాపణలు చెప్పాలి
సంక్రాంతి ముందు తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శన టిక్కెట్లు ఇచ్చే సమయంలో జరిగిన తోపులాటలో ఆరుగురు మృతి చెందడం బాధాకరం. కూటమి ప్రభుత్వంలో తొలి సంక్రాంతికి ఇలాంటి ఘటన నన్ను కలచివేసింది. ఎన్డీయే ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు. ఇలాంటి దుర్ఘటన జరిగినపుడు ఎవరో ఒకరు మీద మొత్తం నెపం నెట్టేసి తప్పించుకునే వాడిని కాదు. అందుకే ప్రజలను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరాను. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాల్సిన స్థానంలో ఉన్నాను కాబట్టే హిందుత్వం ఆచరించే శ్రీవారి భక్తులంతా ఈ దుర్ఘటన విషయంలో క్షమించాలని వేడుకున్నాను. తిరుపతి తొక్కిసలాట విషయంలో టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవో, పాలక మండలి లు కూడా ప్రజలను మీడియా ముందు బేషరతుగా క్షమాపణ కోరాల్సిందే. ప్రజలు మా మీద ఎంతో నమ్మకం పెట్టి కూటమిని గెలిపించారు. కూటమి వచ్చింది కాబట్టే ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ గా శ్రీ బి.ఆర్.నాయుడు, ఈవోగా శ్రీ శ్యామలరావు, అదనపు ఈవోగా శ్రీ వెంకయ్య చౌదరి కొండపై విధులు నిర్వర్తిస్తున్నారు. కీలకమైన సమయంలో ఎలాంటి బేషజాలకు పోకుండా ప్రజలను క్షమాపణ అడిగితే తప్పేం లేదు. నాకు ఘటనకు ఎలాంటి సంబంధం లేకున్నా, నేను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను కాబట్టే మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగాను. తిరుపతి ఘటనలో డీఎస్పీ చేసిన తప్పిదానికి ఎస్పీ బదిలీ కావల్సి వచ్చింది. ఓ ఘటన జరిగినపుడు నైతిక బాధ్యత వహించడం ప్రధానం. తిరుపతి దుర్ఘటనలో క్రౌడ్ మేనేజ్ మెంట్ సరిగా లేదని తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవల రోజు సుమారు 4 లక్షల మంది కొండకు వస్తారు. అలాంటపుడు పాటించే క్రౌడ్ మేనేజ్ మెంట్ ఇప్పుడు పాటించలేదని అర్ధం అవుతోంది. ఈ సమయంలో టీటీడీ ఛైర్మన్ , ఈవో, అదనపు ఈవోలు బాధ్యత తీసుకోవాల్సిందే. అందుకు నామోషీ పడాల్సిన అవసరం లేదు. క్షమాపణలు చెప్పడం వల్ల ప్రాణాలు తిరిగి రాకున్నా, ప్రజల ముందు జరిగిన తప్పుకు బాధ్యత తీసుకోవడం హుందా అనిపించుకుంటుంది.
యువత కూడా నేను వచ్చినపుడు కేరింతలు, అరుపులు మానాలి. దేనికోసం వచ్చామో, ఈ పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించి అరవండి. ఒక్కోసారి యువత అరుపులు చాలా కోపాన్ని కలిగిస్తాయి. వచ్చిన పరిస్థితికి తగ్గట్టుగా బాధ్యతగా అంతా నడుచుకోవాలి.
• సామాన్యుల సేవ ముఖ్యం
అధికారులు వీఐపీ ట్రీట్మెంట్ లను నిలువరించాలి. టీటీడీలో అయినా బయట అయినా ఈ ట్రీట్మెంట్ ఉండకూడదు. రాష్ట్రాభివృద్ధికి అధికారులు తగిన సహకారం అందించాలి. చాలామంది అధికారుల్లో నిర్లక్ష్యం, నిర్లిప్తత వీడటం లేదు. నాకు అధికారులంటే అమితమైన గౌరవం ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. 6 నెలల హనీమూన్ పిరియడ్ నాతో సహా అందరికీ అయిపోయింది. ఇకనైనా అధికార యంత్రాంగంలో మార్పు రావాలి. వ్యక్తిగత ఇష్టాలు, అభిరుచులు ఉంటే వాటిని మనసులోనే ఉంచుకోండి. రాజ్యంగబద్ధంగా ప్రజలకు సేవ చేయడం మరువకండి. ప్రజలు కట్టే పన్నుతో మనం బతుకుతున్నాం... వారికి సేవ చేసేందుకు విధుల్లో ఉన్నాము అని గుర్తుంచుకోవాలి. ఎవరు తప్పు చేసినా ఒకే న్యాయం అవసరం. తప్పు చేసిన వాడికి కులం, మతం అడ్డు రాకూడదు. ప్రజాప్రతినిధులకు అదే సూత్రం వర్తిస్తుంది. ఇక నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల్ల పర్యటిస్తాను. నించున్న దగ్గర సమీక్ష ఉంటుంది. అక్కడి నుంచే ఆదేశాలు వెళ్తాయి. దానిని కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత పాలన యంత్రాంగంపై ఉంటుంది. నేను పని చేసి మాత్రమే ప్రజలను ఓట్లు అడుగుతాను. 15 ఏళ్లు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం ఉండాలని బలంగా విశ్వసిస్తున్నాను. నాకు అధికారం అలంకారం కాదు... అదో బృహత్తర బాధ్యత. ప్రజల కోసం ఒళ్లు వంచి పనిచేస్తాను.
• అమ్మాయిలను వేధిస్తే తొక్కి నార తీయండి
పిఠాపురం నియోజవర్గం నుంచి వచ్చే పలు సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. అధికారులు వాటి పరిష్కారంపై మీద దృష్టి సారించాలి. ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసులు దృష్టి సారించాలి. పిఠాపురంలోని అగ్రహారం, రథాల వీధి, ఇందిరా నగర్ తదితర చోట్ల గంజాయి వాడకం ఎక్కవైంది. గత నెలలో ఎస్సీ బాయ్స్ వెల్ఫేర్ హాస్టల్ లోకి చొరబడి విద్యార్థులను బెదిరించి డబ్బులు గుంజుకున్నట్లు తెలిసింది. ఈ నెల 2వ తేదీన బెదిరించి ఓ వ్యక్తి దగ్గర నుంచి బంగారు గొలుసు దోచుకున్నట్లు తెలిసింది. ఈవ్ టీజింగ్ పెరిగినట్లు సమాచారం వచ్చింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిలను ఇబ్బందిపెడుతున్నారు అని కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకీ తెలిపారు. ప్రైవేట్ కాలేజీలు దగ్గర, బస్టాండు ప్రాంతాల్లో యువతులపై ఈవ్ టీజింగ్ ఎక్కువ అయిందని తెలుస్తోంది. దీనిపై పోలీసులు దృష్టి సారించాలి. తక్షణం అరికట్టాలి. అమ్మాయిలను వేధించడం మగతనం కాదు. దేశ సేవ కోసం సైన్యంలో చేరితే మగతనం. క్రీడల్లో రాణించండి. అమ్మాయిలను, మహిళల్ని ఇబ్బందిపెట్టి వేధిస్తే తొక్కి నార తీయండి.
పిఠాపురం నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నాను. కొన్ని సమస్యలు లీగల్ గా వచ్చే ఇబ్బందులతో మిగిలిపోతున్నాయి. నేను ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాను. ఇంకా నా మీద ఆరోపణలు, అసత్యాలు మాట్లాడితే నేనేం చేయలేను. ప్రతి జిల్లాకు వెళ్లి కొన్ని రోజులపాటు జిల్లాలోనే ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించుకున్నా. మొదట నా సొంత నియోజకవర్గం చక్కబెట్టుకున్న తర్వాతే రాష్ట్రమంతటా తిరగడానికి ఇక్కడికి వచ్చాను. 14 రోజులపాటు ఇక్కడే ఉండి ప్రతి గ్రామ సమస్య పరిష్కరిస్తాను. నేను ప్రేమకు ప్రేమ, ద్వేషానికి ద్వేషం.. దేనికైనా సిద్ధంగానే ఉన్నాను. తుపాకీ విడిచిన ఓ విప్లవకారుడు ఓటును నమ్మి జనంలోకి వస్తే ఎలా పాలిస్తాడో అదే విధంగా నేను ముందుకు వెళ్తాను" అన్నారు.
addComments
Post a Comment