దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్.

 దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్



- ఒకే చోట సోలార్, విండ్, హైడల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి 

- ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి 

- మూడోవంతు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ ఇది  

- అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదానికి త్వరలోనే పరిష్కారం

- గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికే ఈ ప్రాజెక్ట్ ఆదర్శం

- గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఐ.ఆర్.ఇ.పి. పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ .

* తొలుత ఏరియల్ వ్యూ... తర్వాత రోడ్డు మార్గం ద్వారా ప్రాజెక్ట్ పరిశీలన 

అమరావతి (ప్రజా అమరావతి);

'ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐ.ఆర్.ఇ.పి.) మన దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్. ఒకే చోట సోలార్, విండ్, హైడల్... ఇలా మూడు విభాగాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రాజెక్ట్ ను డిజైన్ చేసిన విధానం అద్భుతం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ అవసరాల్లో మూడో వంతు తీర్చవచ్చు. ఈ మెగా పవర్ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 వేల మంది వరకు ఉపాధి లభిస్తుంద'ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు.  ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి రంగంలో శిలాజ ఇంధనాల బదులు పునరుత్పాదక శక్తి ఇంధన విభాగమే ముందంజలో ఉంటుందని, గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికే ఈ ప్రాజెక్ట్ ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు. శనివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. సోలార్ పార్క్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ ను ఏరియల్ వ్యూ ద్వారా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “రాష్ట్రానికే పేరు తెచ్చే ప్రాజెక్టు ఇది. రాళ్లు, రప్పల్లో 10వేల మందికి ఉపాధి కల్పించారు. ఇప్పటి వరకు మన దేశంలో గ్రీన్ కో సంస్థ రూ.లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టింది. మన రాష్ట్రంలో రూ.30 వేల కోట్లు పెట్టుబడులుపెట్టారు. మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పిన్నాపురం ప్రాజెక్టులోనే దాదాపు రూ. 12వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు. మరో రూ. 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు 12 వేల మందికి ఉపాధి కల్పించారు.  

•  వివాదం పరిష్కరించాలని కేంద్రానికి విన్నవించాం

 ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు  ముందుచూపుతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఐటీ తరవాత ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది గ్రీన్ ఎనర్జీ పరిశ్రమపైనే.  శ్రీ చలమలశెట్టి అనిల్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే వెంటనే మొదలుపెట్టాలని ఎంకరేజ్ చేశారు. చాలా తక్కువ కాల వ్యవధిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మొత్తం 2,800 ఎకరాల్లో నిర్మిస్తోన్న ప్రాజెక్టు ఇది. ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదు. 2800 ఎకరాల్లో 1700 ఎకరాలను ప్రభుత్వం, రైతుల నుంచి గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది. కేంద్రం అనుమతితోనే 365 హెక్టార్ల అటవీ భూమిని సంస్థ కొనుగోలు చేసింది. అందుకు నెల్లూరులో రూ.36 కోట్ల విలువైన భూమిని సంస్థ ప్రభుత్వానికి ఇచ్చింది. ఫారెస్టు, రెవెన్యూ మధ్య 45 హెక్టార్ల భూమి వివాదంలో ఉంది. 1962 నుంచి ఈ వివాదం నడుస్తోంది. ఈ భూమి మాదంటే మాది అని రెవెన్యూ, అటవీ శాఖలు అంటున్నాయి. అందులో 11.49 ఎకరాలు రైతుల నుంచి గ్రీన్‌కో కంపెనీ కొనుగోలు చేసింది. ఈ వివాదం పరిష్కరించాలని కేంద్రానికి విన్నవించాం. అలాగే వివాద పరిష్కారానికి మా వంతు సహకారం అందిస్తాం. 

•  గొప్ప పర్యాటక కేంద్రంగా మారనుంది 

కొద్దిసేపటి క్రితమే ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించాను.  గని సోలార్‌ పార్క్, పంప్డ్‌ స్టోరేజ్‌, పవర్ హౌస్ చూశాను.  భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు గొప్ప పర్యాటక కేంద్రంగా, విజ్ఞాన కేంద్రంగా మారబోతోంది.  వేలాది మంది ఉపాధి కల్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో చిన్న చిన్న వివాదాలు ఉంటే మా ప్రభుత్వం తరఫున సహకరించి పరిష్కరిస్తాం. సీఎస్‌ఆర్‌ కింద గ్రీన్ కో చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది.  పాఠశాల అభివృద్ధి, సేంద్రియ సాగు, గో సంతతి పెంచేలా చూడాలని నా తరఫున కోరుతున్నా. 

అలాగే కర్నూలు, కడప జిల్లాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని మా దృష్టికి వచ్చింది. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తాం. ఎవరైతే ప్రభుత్వ, అటవీ భూములు అక్రమించారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

• స్వయంగా కారు నడుపుతూ... ప్రాజెక్ట్ పరిశీలన 

మధ్యాహ్నం 12 గం.కు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.  అక్కడ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఓర్వకల్లు, గని సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుతో సహా పిన్నాపురం, గుమ్మటంతాండ గ్రామాల మధ్య నిర్మించిన పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టును ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం అప్పర్‌ రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అప్పర్‌ ఇన్‌టెక్‌ వ్యూ పాయింట్‌ వద్ద  ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్  స్వయంగా కారు నడుపుతూ పవర్‌ హౌస్‌కు చేరుకున్నారు. ప్రాజెక్టు వివరాలను సంబంధిత అధికారులు ప్రజెంటేషన్‌ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ కి వివరించారు.  ప్రాజెక్టులో పని చేసే కార్మికులతో సరదాగా ముచ్చటించి వారితో సెల్ఫీలు దిగారు.  

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి శ్రీ బి.సి.జనార్ధన రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి, ఎస్పీలు శ్రీ బిందు మాధవ్, శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా, గ్రీన్ కో కంపెనీ ఎండీ శ్రీ చలమలశెట్టి అనిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments