*ఏపీ...హ్యాపీ అని పర్యాటకులు భావించాలి
*
*ఈ ఏడాది టూరిజం శాఖలో 20 శాతం వృద్ధిరేటు సాధించాలి*
*టెంట్ సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి*
*టూరిజం, కల్చరల్ రంగాల్లో ఈవెంట్ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాలు*
*పర్యాటకశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*
అమరావతి, ఫిబ్రవరి 13 (ప్రజా అమరావతి): రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ...హ్యాపీ అనుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని పర్యాటకలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు. 2025-26 మధ్య 20 శాతం వృద్ధిరేటును పర్యాటక శాఖ సాధించాలన్నారు. సచివాలయంలో పర్యాటకశాఖపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షించారు. టూరిజం ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, హోటల్ రూముల నిర్మాణం, పెట్టుబడులు, ల్యాండ్ లీజ్ పాలసీ, హోంస్టేలు వంటి వాటిపై సమీక్షలో చర్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.1,217 కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని, రూ.45 కోట్లతో 11 టూరిజం రిసార్టులు, హోటళ్లు పునరుద్ధరించామని అధికారులు వివరించారు. కేంద్రం ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకంలో భాగంగా అన్నవరం దేవాలయం, ఎస్ఎఎస్‌సీఐ కింద గండికోట, అఖండ గోదావరి, స్వదేశ్ దర్శన్ 2.0 కింద అరకు, లంబసింగి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలెప్మెంట్ కింద అహోబిలం, నాగార్జున సాగర్ ఎంపికైనట్లు అధికారులు వివరించారు. వివరించారు.
*పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈవెంట్స్*
పర్యాటకులను ఆకట్టుకునేందుకు 2025-26 ఏడాదికి సంబంధించి టూరిజం ఈవెంట్స్ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులోభాగంగా మొత్తం 37 టూరిజం ఈవెంట్స్‌లో 2 కీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, 12 మెగా ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. మెగా ఈవెంట్స్, కీ ఈవెంట్స్ యూనివర్సిటీల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. మ్యూజికల్ కల్చర్‌ను ఈవెంట్స్‌లో ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి శిల్పారామాల్లో యేడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. నంది అవార్డుల ప్రదానంపైనా కసరత్తు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు ఎంటరైన్మెంట్‌కు సంబంధించిన క్యాలెండర్ కూడా రూపొందించాలని సీఎం సూచించారు. చిల్డ్రన్స్, యూత్, మహిళలు, సీనియర్ సిటిజన్స్ వారీగా కార్యక్రమాల కేలండర్ రూపొందించాలన్నారు. కల్చరల్ ఈవెంట్స్ లో భాగంగా స్టేట్ ఈవెంట్, జిల్లా ఈవెంట్, అన్ని జిల్లాల్లో ఈవెంట్స్ నిర్వహించాలని సూచించారు. ఇందులో సంక్రాంతి సంబరాలు, ఉగాది ఉత్సవాలు అన్ని జిల్లాల్లో నిర్వహించనుండగా, 10 జిల్లాల్లో 9 స్టేట్ లెవెల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
*గండికోటను బ్రాండింగ్ చేయండి*
జల, గిరి, వన దుర్గంగా పేరుగాంచిన గండికోటలాంటి ప్రాంతం దేశంలో ఎక్కడా లేదని, దీన్ని మరింత బ్రాండ్ చేయాలని సీఎం సూచించారు. గండికోటతో పాటు కడప దర్గా, ఒంటిమిట్ట రామాలయం, సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. శ్రీశైలాన్ని శక్తి పీఠంగా మార్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం డ్యాం, అటవీ, మల్లన్న దేవాలయం అన్నీ ఒకేచోట పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందడానికి శ్రీశైలానికి కలిసొచ్చిన అంశమని, ఎకో టూరిజానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీశైలానికి రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పెరుగుతోందని, రోడ్ల వెడల్పునకు చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని ఆదేశించారు. పర్యాటక శాఖకు సంబంధించి ఎంత విలువ చేసే ఆస్తులున్నాయో అంచనా వేయాలని, ఎక్కడ రెవెన్యూ ఎక్కువగా వస్తుందో అక్కడ ప్రోత్సాహకాలు మరింత పెంచాలని అన్నారు. పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ప్రోత్సాహకాలను ఎస్క్రో అకౌంట్ ద్వారా వెంటనే మంజూరు చేయాలని సీఎం అన్నారు.
*ప్రకృతిసేద్య ఆహారాన్ని ప్రమోట్ చేయండి*
రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఇప్పటికీ సాంప్రదాయక ఇళ్లు ఉన్నాయని, వాటిని ఆధునీకరణ చేయాలన్నారు. అదేవిధంగా టూరిజం హోటళ్లలో అందించే ఆహారం విషయంలోనూ మార్పులు తీసుకురావాలన్నారు. ప్రకృతిసేద్య ఆహారాన్ని ప్రమోట్ చేయాలని సూచించారు. తద్వారా పర్యాటకుల ఆరోగ్యం బాగుండటంతో పాటు సాగురైతులకు కూడా మేలు చేకూరుతుందని సీఎం అన్నారు. ఏపీలో నెంబర్-1 ఫుడ్ లభిస్తుందన్న భావం పర్యాటకుల్లో కలిగించాలన్నారు. అవసరమైతే షెఫ్‌లకు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. ప్రపంచంలో హోటల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ట్రెడిషనల్ కాలేజీల్లో హోటల్‌మేనేజ్మెంట్‌పై శిక్షణ ఇవ్వాలన్నారు.
*టెంట్ సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి*
తిరుపతి, విశాఖపట్నంలో జూ పార్కులు ఉన్నట్లు ఇప్పటికీ చాలామందికి తెలియడం లేదని, ప్రచారం కల్పించి సందర్శకులను పెంచాలని సూచించారు. వాటర్ ఫాల్స్ రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో గుర్తించి ప్రచారం కల్పించాలన్నారు. విశాఖ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, తిరుపతిని పర్యాటకంలో యాంకర్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలన్నారు. కోనసీమలో హౌస్ బోట్స్ ప్రవేశపెట్టడంతో పాటు విశాఖ బీచ్‌ను మరింత అభివృద్ధి చేయాలన్నారు. గండికోట, సూర్యలంక, లంబసింగిని టెంట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ 90 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రూప్‌వేల నిర్మాణానికి కూడా అవకాశాన్ని బట్టి పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని సూచించారు. వీటన్నింటికీ 3 నెలల్లోనే యాక్సన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. మరో నాలుగు నెలల్లో ఏపీ హ్యాపీ స్టేట్ అని పర్యాటకులు అనుకనే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలెప్మెంట్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment