ప్రతిపక్ష హోదాపై వైసీపీ కలలు కనొద్దు..

 *ప్రతిపక్ష హోదాపై వైసీపీ కలలు కనొద్దు..*



- *ఈ ఐదేళ్ళూ మీరు సంయమనం పాటించాల్సిందే..* 

- *వైసీపీ నేతలకు గట్టి సమాధానమిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్*

- *అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ 'జనసేన'గా వెల్లడి*


అమరావతి (ప్రజా అమరావతి);:

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గట్టిగా సమాధానం ఇచ్చారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నామని.. ఇప్పుడు ప్రతిపక్ష ఇవ్వాలని వైసీపీ కోరినంత మాత్రానా ఇవ్వడం ఉండదని స్పష్టం చేశారు. అసెంబ్లీ రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉందని తెలిపారు. కనీసం జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కూడా వారికి ప్రతిక్ష హోదా దక్కేదని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతామని అనడం సరైనది కాదని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టగానే... వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఆ తర్వాత కాసేపటికి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇక, గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది.

అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ తీరును తప్పుబట్టారు. గవర్నర్ ప్రభుత్వం తరఫున సందేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో వైసీపీ వ్యవహరించిన తీరు బాగోలేదని విమర్శించారు. గత కొద్ది రోజులుగా గవర్నర్‌కు ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ... సభకు వచ్చి ప్రసంగించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సీనియర్ నాయకులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేయడంతో పాటు, పేపర్లను సైతం చించివేశారని చెప్పారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని.. అది ప్రజలు ఇస్తేనే వస్తుందని అన్నారు.

‘‘జనరల్‌గా అత్యధిక మెజారిటీ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.నెక్ట్స్ స్టేజ్‌లో ఉన్నవారికి ప్రతిపక్ష హోదా ఇస్తారు. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా... ప్రతిపక్ష హోదా కావాలని అడిగితే ఇవ్వరు. కనీసం జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వారికి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈరోజు ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన. వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, ప్రసంగాలను అడ్డుకుంటామని అనడం సరైన విధానం కాదు’’ అని వైసీపీపై విమర్శలు చేశారు.

వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని... 11 సీట్లు ఇచ్చారని, దానిని గౌరవించి వారు అసెంబ్లీకి రావాలని సూచించారు. నిబంధనల ప్రకారం వారు మాట్లాడేందుకు ఇవ్వాల్సిన సమయం ఇస్తారని అన్నారు. వైసీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గొడవ పెట్టుకోవాలనే ఆలోచనతో అసెంబ్లీకి రావడం దిగజారుడు ఆలోచన విధానమమని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష రాదని... ఇందుకు వారు మానసిక సిద్దమైపోవాలని అన్నారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన డిసైడ్ చేసేది కాదని... రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


Comments