* లోక్ సభ స్పీకర్ కు నివేదిక సమర్పించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
దిల్లీ/ఏలూరు, మార్చి 10 (ప్రజా అమరావతి): కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సోమవారం జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక సమర్పించారు. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధి ఆధారపడి ఉందని, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉందని, దాదాపు 4 నుండి 5 లక్షల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్ తన నివేదికలో పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు ఆక్వాకల్చర్‌పై ఆధారపడి ఉన్నారని, తరచుగా ఈ ప్రాంతంలో తలెత్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు మునిగిపోయి, ప్రజల ఆర్థికంగా నష్టాలు చవిచూశారని స్పీకర్ కు ఎంపీ మహేష్ కుమార్ వివరించారు. 1975లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేపల తొట్టెల ఏర్పాటు ద్వారా 144 మత్స్యకారుల సొసైటీల స్థాపనకు అనుమతి ఇచ్చి, స్థానిక ప్రజలను ఆక్వాకల్చర్ వైపు మళ్లేలా చేసి జీవనోపాధి అభివృద్ధికి కేంద్రంగా కొల్లేరును నిలబెట్టిందని ఎంపీ నివేదికలో స్పష్టం చేశారు. 1999 సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని సుమారు 77,000 ఎకరాలను వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించడంతో ఇక్కడి ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిందని ఎంపీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించబడిన ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు, శ్మశాన వాటికలు, రహదారి విస్తరణలు, దేవాలయాలు మరియు తాగునీటి వనరులతో సహా అవసరమైన కమ్యూనిటీ మౌలిక సదుపాయాల కోసం స్థలం అందుబాటులో లేకుండా పోయిందని, దీంతో పాటు ఇక్కడికి నిర్వాసితులు వలసబాట పట్టాల్సిన దుస్థితికి దారితీసిందని ఎంపీ పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభయారణ్యం నుండి ప్రైవేట్ జిరాయతి భూములు, అసైన్డ్ భూములను తొలగించాలని కోరుతూ రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన రెండు తీర్మానాలను జాతీయ వన్యప్రాణి బోర్డు సమీక్షించి, బాధిత రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఎంపీ తెలిపారు. వారి జీవనోపాధిని కాపాడేందుకు అభయారణ్యం నుండి సుమారు 22,000 ఎకరాలను మినహాయించడాన్ని ఆమోదించిందని, 2019 భీమవరం ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలు ఈ క్లిష్ట సమస్యను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలమైన హామీ ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ సమస్య అపరిష్కృతంగానే ఉందని, దీని ఫలితంగా ఇక్కడి ప్రజలు నిరంతర న్యాయ పోరాటాలు చేస్తున్నారని, ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో క్షీణత వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని, సమస్యను పరిష్కరించడంలో సుదీర్ఘ జాప్యం వల్ల ఈ ప్రాంత ప్రజలకు అపారమైన ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు, అనిశ్చితి ఏర్పడిందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, కొల్లేరు ప్రాంత రైతులు, ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ తన నివేదికలో స్పీకర్ కు విన్నవించారు.
addComments
Post a Comment