*రూ. 4.19 కోట్ల హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన*
*2025-26 సంవత్సరానికి రూ. 97.60 కోట్ల నిధులు మంజూరు*
*దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్‌గా నిలపాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం* – *మంత్రి నాదెండ్ల మనోహర్*
కొల్లిపర 23 మార్చి 2025 (ప్రజా అమరావతి):
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో కృష్ణా కరకట్ట మీదుగా కృష్ణా-వెస్ట్ కాలువ పై రూ. 4.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ వంతెన పనులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్రప్రసాద్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు 20 వేల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, అందరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని తెలిపారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాల
నే లక్ష్యంతో నిధులు సమకూర్చి, ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు.
అలాగే, 2025-26 సంవత్సరానికి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 97.60 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని తెలిపారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేక వదిలేసిన ఈ వంతెన ప్రాజెక్టును, కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో మంజూరు చేయించుకోవడమే కాకుండా, నిధులు కేటాయించగలిగిందన్నారు.
తెనాలి నియోజకవర్గంలో నరేగా నిధులు తక్కువగా మంజూరయ్యాయని, అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కృషితో మరో రూ. 10 కోట్ల అదనపు నిధులను సాధించారని చెప్పారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి రూ. 36 కోట్ల నిధులను తీసుకురావడంలో మంత్రి విజయం సాధించారని ప్రశంసించారు.
అంతేగాక, త్వరలోనే రైతులకు ఉపయోగపడే డొంక రోడ్లకు నిధులు కేటాయించి, నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అనంతరం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్రప్రసాద్ ప్రసంగించారు
కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment