విజయవాడలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన కీర్తి వర్దన్ సింగ్
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాలు దేశ ఆర్థిక వృద్ధికి చిహ్నంగా మారుతున్నాయి: వర్దన్ సింగ్
విజయవాడ, ఏప్రిల్ 08, 2025 (ప్రజా అమరావతి);
దేశాల మధ్య ప్రయాణం మరియు వలస ప్రక్రియను సజావుగా సాగేలా సులభతరం చేయడానికి, కొత్త సాకేంతిక పురోగతి సహాయంతో ప్రభుత్వం ఆర్ఎఫ్ఐడి చిప్ ఎంబెడెడ్ పీఎస్‌పి-2 వెర్షన్ ‘‘ఇ-పాస్‌పోర్ట్’’ను ప్రవేశపెడుతోందని విదేశాంగ, పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పుల సహాయం మంత్రి శ్రీ కీర్తి వర్దన్ సింగ్ అన్నారు. విజయవాడలో పునరుద్ధరించిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు.
సభికులను ఉద్దేశించి శ్రీ కీర్తి వర్దన్ సింగ్ మాట్లాడుతూ- పాస్‌పోర్ట్ అనేది పాస్‌పోర్ట్ కలిగి ఉన్న వ్యక్తి యొక్క ఆశలు మరియు ఆకాంక్షలను మోసుకెళ్లే పత్రం అని అన్నారు. దరఖాస్తుదారులందరికీ నిర్ణీత సమయంలో పాస్‌పోర్ట్‌లు జారీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఆర్‌పీఓలను అత్యాధునిక సాంకేతిక పరిజ్నానాలతో ఆధునీకరించే పనిని చేపట్టింది. దేశవ్యాప్తంగా టాటా కన్సల్టింగ్ సర్వీసెస్‌తో సమన్వయంతో రికార్డు సమయంలో సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాలు దేశ ఆర్థిక వృద్ధికి చిహ్నంగా మారుతున్నాయని, ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగిన వారికి వ్యక్తిగత మరియు ఆర్థిక వృద్ధికి లెక్కలేనన్ని అవకాశాలను తెరుస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. భారతదేశం ద్వారా ప్రభావవంతమైన మహమ్మారి నిర్వహణ, కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి మరియు అనేక దేశాలకు పంపిణీ చేసినప్పటి నుంచి, అభివృద్ధి చెందిన దేశాలు భారత సామర్థ్యాలను ఉపయోగించుకునే దిశగా చూస్తున్నాయని ఆయన అన్నారు.
‘‘సాఫ్ట్ నైపుణ్యాలు మరియు ఆవిష్కరణల బలాలతో భారతదేశం ఇప్పుడు ప్రపంచ కథనాన్ని రూపొందిస్తోందని మంత్రి అన్నారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో గ్లోబల్ అలయన్స్ ఫర్ సోలార్ పవర్‌తో సహా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ఆయన నొక్కి వక్కాణించారు. అభివృద్ధి చెందని దేశాలు వివిధ అంశాలపై భారతదేశం నుంచి మార్గదర్శకత్వం కోరుకుంటున్నాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి మోదీ సమర్థ పరిపాలనను ప్రశంసిస్తూ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు భారతదేశం అద్భుతంగా ఎదిగిందని ఆయన అన్నారు.
తర్వాత మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ కీర్తి వర్దన్ సింగ్, దేశానికి బలమైన ఆర్థిక పునాదులు ఉన్నాయని, ఇతరుల విధానాలు ఎలా ఉన్నా మన దేశ ప్రజలపై ఏదీ ప్రభావం చూపదని హామీ ఇచ్చారు. సుంకాల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే, దేశం యొక్క సొంత అభివృద్ధి అజెండాపై సహనం మరియు విశ్వాసం ఉంచాలని విజ్నప్తి చేశారు. భారతదేశ జీడీపీని లేదా కష్టపడి పని చేసే ప్రజల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేమని మంత్రి అభిప్రాయపడ్డారు. మహమ్మారి కాలంలో కూడా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం, ఏవైనా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి సిద్ధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పాస్‌పోర్ట్ కార్యాలయ నిర్మాణం కోసం తగినంత భూమిని కేటాయించినందుకు శ్రీ కీర్తి వర్దన్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్నతలు తెలిపారు.
ఈ కార్యక్రమాల సందర్భంగా శ్రీ సింగ్ స్టాలిన్ క్యాపిటల్, ఎంజీరోడ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన విశాలమైన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని, అలాగే మొబైల్ పాస్‌పోర్ట్ వ్యాన్‌ని ప్రారంభించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు శ్రీ కేశినేని శివనాథ్, నగర ఎమ్మెల్యేలు శ్రీ వై సుజనా చౌదరి, శ్రీ గద్దె రామమోహనరావు, శ్రీ బొండా ఉమామహేశ్వరరావు కొత్త కేంద్రంలో సమావేశ మందిరం, గ్రంథాలయం, డిస్పాచ్ విభాగం మరియు ముద్రణ విభాగం, అలాగే పీఆర్ఓ కార్యాలయం వంటి సౌకర్యాలను ప్రారంభించారు.
విశాఖపట్నంలోని ఆర్‌పీఓతో పాటూ, విజయవాడ మరియు తిరుపతిలలో పీఎస్‌కే సౌకర్యాలు మరియు వివిధ పోస్టాఫీసులలో 13 కేంద్రాలు, మధ్య, దక్షిణ తీర ప్రాంత మరియు రాయలసీమ జిల్లాలకు పాస్‌పోర్ట్ సేవలలో సేవలు అందిస్తున్నాయి. విజయవాడ పీఎస్‌కే రోజుకు 1000 దరఖాస్తులను మరియు సంవత్సరానికి 3.5 లక్షల దరఖాస్తులను నిర్వహిస్తుందని చీఫ్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ మరియు జాయింట్ సెక్రటరీ డాక్టర్ కెజె శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ ఆర్‌పీఓ శ్రీ కె శివ హర్ష కూడా మాట్లాడారు.
addComments
Post a Comment