*పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలి*
*జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ఉన్నాయో...ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందే చెప్పాలి*
*డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే సాగయ్యేలా చూసి... రైతు నష్టపోకుండా చూడాలి*
*హెచ్డీ బర్లే పొగాకు మెట్రిక్ టన్నుకు రూ.12,000, కోకో కేజీకి రూ.500 ధర చెల్లింపు*
*పొగాకు, కోకో పంటలను కంపెనీలు కొనుగోళ్లు చేసేలా ముఖ్యమంత్రి ఆదేశం*
*మద్దతు ధర కన్నా తగ్గితే రైతుల్ని నేరుగా ఆదుకోవాలని అధికారులకు సూచన*
*హెచ్డీ బర్లే - వైట్ బర్లే పొగాకును టొబాకో బోర్డులో చేర్చేందుకు కేంద్రంతో చర్చలు*
*రైతులు నష్టపోకుండా ఈ ఏడాది హెచ్డీ బర్లే పొగాకు రకానికి క్రాప్ హాలిడే*
*ప్యూర్ జ్యూస్‌లపై జీఎస్టీ తగ్గింపునకు కృషి - మిడ్ డే మీల్స్, టీటీడీ ప్రసాదంగా మ్యాంగో జ్యూస్*
*రైతాంగ సమస్యపై ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో చర్చించనున్న సీఎం*
*పంటలు, గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీతో సిఎం చంద్రబాబు సమీక్ష*
అమరావతి, మే 22 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో పంటల సాగు అనేది జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్‌కు అనుగుణంగా జరగాలని, ఇందుకు సంబంధించి పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏ పంటలు ఎంతమేర విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్-సప్లయ్ మధ్య సమతూకం ఉంటుందన్నారు. అలాగే కేవలం డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే సాగు చేస్తే రైతులు నష్టపోకుండా పోకుండా ఉంటారని అన్నారు. క్రాప్ ప్లానింగ్ అనేది చాలా శాస్త్రీయంగా జరగాలని, జాతీయ అంతర్జాతీయ ప్రరిణామాలు, మార్కెట్లు, దిగుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టిపెట్టాలన్నారు. కమిటీలోకి కొత్తగా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, రామానాయుడును సభ్యులుగా తీసుకున్నారు. పొగాకు, కోకో, మామిడి, ధాన్యం రైతుల సమస్యలపై సిఎం క్యాంపు కార్యాలయంలో గురువారం అధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.
*అవసరాన్ని బట్టి ప్రభుత్వం ద్వారా కోకో కొనుగోళ్లు :*
రైతుల దగ్గర ఉన్న కోకో పంట నిల్వలను కేజీ రూ. 500కు కంపెనీల ద్వారా కొనుగోళ్లు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రూ.500 కన్నా తక్కువకు రైతులు పంట అమ్మాల్సిన అవసరం లేదని... అవసరమైతే ప్రభుత్వం ద్వారా నేరుగా కొనుగోళ్లు జరపాలని చెప్పారు. ప్రస్తుతం 1,200 మెట్రిక్ టన్నుల నుంచి 1500 మెట్రిక్ టన్నుల కోకో నిల్వలు ఉన్నాయని... వీటిలో 600 మెట్రిక్ టన్నులు మాత్రమే రైతుల దగ్గర ఉన్నాయని వాటిని మాత్రమే కొనుగోళ్లు చేయాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
*హెచ్డీ బర్లే పొగాకు నిల్వల వివరాల నమోదు :*
సుమారు 20,000 మిలియన్ కేజీల మేర రాష్ట్రంలో రైతుల దగ్గరున్న హెచ్డీ బర్లే పొగాకు నిల్వలను కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. డిమాండ్ లేనందున రైతులు నష్టపోకుండా ఉండడానికి ఈ ఏడాది హెచ్డీ బర్లే పొగాకు రకానికి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్టు అధికారులు చెప్పారు. రైతుల దగ్గర హెచ్డీ బర్లే రకం పొగాకు నిల్వలు ఎంత ఉన్నాయనే దానిపై యాప్ ద్వారా కచ్చితమైన వివరాలు సేకరించాలని చెప్పారు. టొబాకో బోర్డులో ఇందుకు సంబంధించి సెల్ ఏర్పాటు చేసి రోజువారీ కొనుగోళ్ల వివరాలను నమోదు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు హెచ్డీ బర్లే, వైట్ బర్లే రకాలను టొబాకో బోర్డులో చేర్చాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. అలాగే ఈ వారం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రైతాంగ సమస్యలపై చర్చిస్తానని సిఎం తెలిపారు.
*మ్యాంగో జ్యూస్ వినియోగం పెంచేలా చర్యలు :*
మ్యాంగో పల్ప్‌కు సంబంధించి ఆర్డర్లు రాకపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందకుండా తక్షణమే పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలు కొనుగోళ్లు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అయితే పాతనిల్వలు కంపెనీల దగ్గర మిగిలి పోవడంతో కొత్తగా కొనుగోళ్లు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని అధికారులు వివరించారు. అలాగే పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం కూడా ఇందుకు కారణమైందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా అధికారులు చూడాలని సీఎం అన్నారు. ప్యూర్ జ్యూస్‌లపై సైతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం జీఎస్టీ విధించడంతో మామిడి కొనుగోళ్లు మందగించాయని... ప్యూర్ జ్యూసెస్‌కు జీఎస్టీ తగ్గించేలా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అలాగే మ్యాంగో పల్ప్ జ్యూస్ వినియోగం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్ధులకు అందించడంతో పాటు... తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మ్యాంగో జ్యూస్ అందించే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
*వరి, టొమాటా రైతుల సమస్యపైనా చర్చ :*
టొమాటో పంట గురించి కూడా ముఖ్యమంత్రి గారు చర్చించారు. రాష్ట్రంలో టొమాటో ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగేలా ప్రోత్సహించి... రైతులు ఆశించిన ధర వచ్చేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్య లేదని, ఏ ప్రాంతాల్లో అయితే తడిచిన ధాన్యం ఉందో వాటిని కూడా కొనుగోలు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదండ్ల మనోహర్, గొట్టిపాటి రవి, రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment