కోకో రైతులను ఆదుకుంటాం..




*కోకో రైతులను ఆదుకుంటాం..


*


*కిలో కు రూ.500 ధరకు కోకో గింజలు కొనుగోలు..*


*పది నెలల్లోనే రూ. 140 కోట్ల స్థిరీకరణ నిధి పెట్టి ఇప్పటికే రూ. 80 కోట్లు ఖర్చు చేశాం..*


*పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కె. అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి..*



ఏలూరు,మే,23 (ప్రజా అమరావతి): రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం స్దానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్ధసారధితో కలిసి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రికె. అచ్చెన్నాయుడు తో కలిసి పాత్రికేయుల సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాటలైతే గత ప్రభుత్వంలో విపరీతంగా చెప్పారు.  రూ.3 వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టామన్నారు. ఎంత ఖర్చు చేశారో చూస్తే సున్నా, ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. అందుకు సంబంధించి ఐదేళ్ళ రికార్డు మా దగ్గర ఉందని మంత్రి చెప్పారు. గత ఐదేళ్ళ రైతుకు ఎన్ని ఇబ్బందులు వచ్చిన గత ప్రభుత్వం పట్టించుకోలేదు కదా, కనీసం రైతులు, రైతు సంఘాలను ప్రభుత్వం కలవలేదన్నారు. రైతుల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రూ.140 కోట్ల స్థిరీకరణ నిధి పెట్టి ఇప్పటికే రూ. 80 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో నాలుగైదు పంటలకు ధరల్లో ఇబ్బంది వచ్చిందని, ఆయినా ప్రభుత్వం మాకు సంబంధ లేదని ఊరుకోలేదన్నారు. ఆరు మాసాల నుంచి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దానిపైనే దృష్టిపెట్టారన్నారు. మిర్చి పంటకి ఇబ్బందులు వస్తే మిర్చి పండించిన రైతుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంతో మాట్లాడి పరిష్కరించామన్నారు. మళ్లీ ఈ మద్య కాలంలో  ఏలూరు జిల్లాలో కోకో రైతులకు ఇబ్బంది వచ్చిందని, అదే విధంగా ప్రకాశం జిల్లాలో (నల్లబర్లీ) పొగాకు రైతులకు ఇబ్బంది వచ్చిందని, అదే విధంగా మామిడి పండించిన రైతులకు ఇబ్బందులు వచ్చాయని, వీటిపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి కేబినెట్ సబ్ కమిటీ వేశారన్నారు. మీరు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పంటలు పండుతున్నాయి, ధరలు ఏ విధంగా ఉన్నాయి మీరు దగ్గరగా చూచి రైతుకు ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడమని ఆదేశించామన్నారు. గత రెండు మాసాల నుంచి జిల్లాలో కోకో మీదచాలా ఇబ్బందులు వచ్చాయన్నారు.  మేము ఎప్పుడూ తప్పించుకోలేదన్నారు. రెండు మూడు సార్లు మీటింగు పెట్టామన్నారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీగారు, కమీషనర్ గారు పెట్టారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని, రైతులు ఆంధోళన చెందుతున్నారని ఈ దృష్ట్యా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుల దగ్గరకే వచ్చి సమావేశం నిర్వహించి  సుమారు 3 గంటలు వారితో చర్చించామన్నారు. ఈ సంవత్సరానికి కోకో కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకున్నామని ఈ విషయంలో దాపరికం లేకుండా ఒక మధ్యస్థ ధర ఉండేలా కంపెనీలతో మాట్లాడటం జరిగిందన్నారు. కంపెనీల వారు రూ. 450/-కి కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ మరో రూ.50/-లు ప్రభుత్వం భరించి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు.  కోకో ను కిలో రూ.500/-లు కొనుగోలు చేయాలని ప్రస్తుతం రైతుల దగ్గర ఉన్న కోకో గింజలను అన్నింటిని కొనుగోలు చేయాలని  స్పష్టం చేయడం జరిగిందన్నారు. చాలా స్పష్టంగా, గట్టిగా చెప్పాం రైతులకు ఎక్కువ ధర వచ్చేలా కంపెనీలతో మాట్లాడాలని సీఎం చెప్పారన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో చాక్లెట్ల తయారీ ఉత్పత్తులు తగ్గాయని దీని మూలంగా కూడా కొంత సమస్య ఏర్పడిందన్నారు.  అయితే కంపెనీలను రేపటి నుంచి కోకో కూడా ఎన్ని టన్నులు ఉంటే అంతా కంపెనీలు కొంటాయని, కంపెనీలు ఇచ్చే ధరలకు అదనంగా ప్రభుత్వం కొంత భరిస్తుందన్నారు. భవిష్యత్తులో కోకోకి కూడా ఒక చట్టం తెచ్చే యోచనలో ఉన్నామని, అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న ధర వచ్చేలా చట్టం రూపొందిస్తున్నామన్నారు. కోకో పంట నాణ్యత విషయంలో రైతులకు శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.  కోకో అంతర పంట, రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. మరోపక్క నల్ల బర్లీ పొగాకులో చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఎగుమతులు ఆగిపోయాయన్నారు.  ప్రకాశం జిల్లాలో కూడా రైతులు, కంపెనీలు, పొగాకు బోర్డును కూర్చో బెట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం నల్లబర్లి పొగాకు కొనాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. వచ్చే ఏడాది నుంచి డిమాండ్ ఆధారంగా పంట వేసే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు. రైతులు ఏ పంటకు ధర వస్తే అదే పంటను ఎక్కువగా వేస్తున్నారని, ఈ సందర్బంలో ధర పతనమైతే నష్టపోతున్నారన్నారు.  ధరలు రాలేదని, కౌలు పెరిగిందని రైతులు ఎవరు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి హితవు పలికారు.  ఈ ప్రభుత్వం మీదని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు తావులేకుండా ప్రభుత్వం ఆన్ని ప్రయత్నాలు చేస్తున్నదన్నారు.  ఇది రైతుల ప్రభుత్వమని, వారికి అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 


సమావేశంలో వ్యవసాయశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్, ఉధ్యానవన శాఖ కమీషనరు కె. శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), సొంగా రోషన్ కుమార్, తదితరులు ఉన్నారు. 


Comments