ఆర్టీజీఎస్ లాంటి వ్యవస్థలు ప్రభుత్వాలకు అవసరం.

*ఆర్టీజీఎస్ లాంటి వ్యవస్థలు ప్రభుత్వాలకు అవసరం*


ఏపీ ప్రభుత్వానికి అధ్భుతమైన ఆలోచన

స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిస్సాఫీ

ఆర్టీజీఎస్ ను సందర్శించిన స్విట్జర్లాండ్ ప్రతినిధులు


అమరావతి  (ప్రజా అమరావతి ); ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వ్యవస్థ అద్భుతమని, ప్రభుత్వాలకు ఇలాంటి వ్యవస్థల అవసరం ఎంతో ఉందని స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిస్సాఫీ అన్నారు. బుధవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ ను స్విట్జర్లాండ్ రాయబారి, ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్టీజీస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రఖర్ జైన్ స్వాగతం పలికి వారికి ఆర్టీజీఎస్ పనితీరు గురించి వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే సదాశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకొందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య  ఈ సంస్థ ఒక వారధిలా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరేలా ఈ సంస్థ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేలా, ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు కావాల్సిన సాంకేతిక తోడ్పాటును ఈ సంస్థ అందజేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా అందించడానికి వీలుగా మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందిస్తోందన్నారు. ప్రభుత్వ సేవల కోసం ప్రజలెవ్వరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా కేవలం తమ సెల్ ఫోన్ లోని వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలు పొందే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం 290 వరకు వివిధ రకాల సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కల్పిస్తున్నామని, రాబోయే రోజుల్లో వెయ్యి రకాల సేవలు ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తామని వివరించారు. ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అర్జీలు పెట్టుకునే సదుపాయం కూడా కల్పించామన్నారు. ప్రజలకు సేవలు అందించడమే కాకుండా ఆ సేవలపైన ప్రజల్లో సంతృప్తి చెందారా లేదా అనేది కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటికనుగుణంగా ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపరుస్తున్నామన్నారు. వాతావరణ మార్పలను నిరంతరం పర్యవేక్షించేలా ఆర్టీజీఎస్ లో ప్రత్యేకంగా అవేర్ హబ్ ఏర్పాటు చేసి, వాతావరణం గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఏర్పాటు చేశామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వినియోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా పయనిస్తోందని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు డ్రోన్ సేవలు వినియోగించుకునేలా ప్రభుత్వం చేస్తోందన్నారు. భారదేశానికి ఏపీ డ్రోన్ రాజధానిగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలు డ్రోన్ సేవలను విరివిగా వినియోగించుకునేలా ప్రజలకు ప్రోత్సహిస్తున్నామన్నారు. స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిస్సాఫీ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం  పాలనలో, ప్రజలకు మెరుగైన సేవలందించడానికి సాంకేతికతను వినియోగిస్తున్న తీరు ఆదర్శప్రాయమన్నారు. ప్రభుత్వాలకు ఆర్టీజీఎస్ లాంటి ఒక కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థ ఎంతో అవసరమని, దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు.

Comments