మంగళగిరి (ప్రజా అమరావతి);
*రానున్న వర్షాకాలంలో డ్రోన్లు, యాప్ ల ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి
*
*వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధుల్ని సమర్ధవంతంగా నియంత్రించాలి*
*పైనుంచి కింది స్థాయి అధికారులు ప్రోయాక్టివ్‌గా వ్యవహరించాలి*
*అలసత్వాన్ని సహించమన్న మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్*
*కోవిడ్ పై ఆందోళన అనవసరం- జాగ్రత్త అవసరమన్న మంత్రి*
*వ్యాధులను అరికట్టేందుకు సమాయత్తంపై మంత్రి సుదీర్ఘ సమీక్ష*
కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ప్రారంభంకానున్న వర్షాకాలంలో సంక్రమించే వ్యాధుల నివారణ కోసం సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో సమర్ధవంతంగా కృషి చేయాలని ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధికారుల్ని ఆదేశించారు. అపరిశుభ్రత, కలుషిత నీరు మరియు దోమ కాటు ద్వారా కలిగే సీజనల్ వ్యాధుల వలన ప్రజల జీవన నాణ్యత, ఉత్పాదకతలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ రానున్న వర్షాకాలంలో ఆయా వ్యాధులను అదుపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని మంత్రి సూచించారు. వర్షాకాలపు వ్యాధులు,- కొన్ని చోట్ల వెల్లడవుతున్న కొవిడ్ సంక్రమణలకు సంబంధించి మంత్రి శుక్రవారం సాయంత్రం మంగళగిరి లోని ఎపిఐసిసి భవనంలో సంబంధిత ఉన్నతాధికారులతో రెండున్నర గంటలు సమీక్ష చేశారు.
*ఆధునిక టెక్నాలజీతో దోమలపై యుద్ధం*
డ్రోన్లు, మస్కటీర్ వంటి యాప్ లను వినియోగించుకుని రానున్న వర్షాకాలం, తదనంతరం దోమల వ్యాప్తిపై
పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఈ దిశలో సత్ఫలితాలతో వ్యాధుల్ని అరికట్టవచ్చని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా దోమల నిరోధక రసాయనాలను చిమ్మటంతో మంచి ఫలితాలుంటాయని అన్నారు. అదే విధంగా దోమల సాంద్రతను గుర్తించడానికి ఉపయోగపడే మస్కటీర్ యాప్ ను కూడా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
*సమిష్టి పోరాటం అవసరం*
అపరి శుభ్రత, నీటి కాలుష్యం, నీటి నిల్వ, డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యం, బహిరంగ మల విసర్జన వలన సంక్రమించే వ్యాధులను అరికట్టడానికి ఆయా శాఖల స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని మంచి ఫలితాల్ని సాధించేందుకు స్థానిక జిల్లా, క్షేత్ర స్థాయి అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. గత సంవత్సరాల డేటా ఆధారంగా ఈ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల(హాట్ స్పాట్స్) వివరాల్ని ఆయా శాఖల అధికారులకు తెలిపి తగు నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని మంత్రి ఆదేశించారు. అవసరాల మేరకు బ్లీచింగ్ పౌడరు మరియు క్లోరిన్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉండేలా ఆయా శాఖలను అప్రమత్తం చేయాలని అన్నారు.
*రియాక్టివ్ గా కాదు...ప్రొయాక్టివ్ గా ఉండాలి*
వ్యాధులొచ్చాక చూసుకుందాములే అన్న రియాక్టివ్ ధోరణితో కాక ఆయా వ్యాధుల నివారణ దిశగా మున్ముందు చర్యలతో సీజనల్ వ్యాధుల్ని అరికట్టే దిశగా ప్రొయాక్టివ్ దృక్పధంతో పైనుంచి కింది దాకా ప్రజారోగ్య శాఖ అధికారులు పనిచేయాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్నీ సహించమని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారులు తరచుగా క్షేత్ర పర్యటనలు చేసి సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని అన్నారు.
*కేసుల వివరాల్ని తక్కువ చేసి చూపొద్దు*
గత ప్రభుత్వ హయాంలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులకు సంబంధించి వాస్తవ సమాచారాన్ని కప్పిపెట్టి ఆయా వ్యాధుల్ని నివారించడంలో సఫలీకృతమైనామని చెప్పుకునే ప్రయత్నం చేశారని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అవాస్తవాలతో ఆయా వ్యాధులపై తగిన పోరాటం చేయలేమని, వాస్తవ నివేదికల ఆధారంగానే ప్రభావంతమైన చర్యలు చేపట్టగలమని...కనుక క్షేత్ర స్థాయి నుంచి ఆయా వ్యాధుల సంక్రమణపై వాస్తవ సమాచారాన్ని నివేదించాలని మంత్రి ఆదేశించారుప
*కరోనాపై ఆందోళన వద్దు-జాగ్రత్త చాలు*
రాష్ట్రంలో గురువారం నాడు విశాఖపట్నంలో ఒక కరోనా కేసు నిర్ధారణ జరిగిన నేపథ్యంలో మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఈ విషయానికి సంబంధించిన పలు అంశాలపై శాఖ ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించారు. మొదటి కరోనా కేసుకు గురైన వ్యక్తి కుటుంబంలోనే మరో వ్యక్తితో పాటు, చికిత్సనందించిన ప్రభుత్వ వైద్యునికి కరోనా సోకినట్లు మంత్రి వెల్లడించారు.
ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.....అయితే ఈ విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించడం మంచిదని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సలహాలు,సూచనలు చేయలేదని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి అధికారులతో చర్చించారు.
వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సియస్ శ్రీ ఎం. టి. కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల,
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డి. వీరపాండియన్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సిరి డిఎంఇ డాక్టర్ నరసింహం, డిహెచ్ డాక్టర్ పద్మావతి తదితరులు సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు
addComments
Post a Comment