*నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన భారత్
*
- *మోదీ నాయకత్వాన్ని కొనియాడిన పవన్ కళ్యాణ్*
ఢిల్లీ (ప్రజా అమరావతి);
ప్రపంచంలో భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు నీతిఆయోగ్ ప్రకటించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక విజయం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి, ఎన్డీయే ప్రభుత్వ ప్రగతిశీల పాలనకు నిదర్శనమని పవన్ కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన భాగస్వామ్య పక్షాల సమావేశం ఇవాళ(ఆదివారం) ఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
"గత దశాబ్ద కాలంగా ఎన్డీయే సుపరిపాలనతో భారత్ అనేక రంగాల్లో వృద్ధి సాధించింది. ఇది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదు. ప్రపంచంలో నవభారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోంది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు, వికసిత్ భారత్-2047 వైపు నడిచేందుకు ఇది ఓ ముఖ్యమైన అడుగు" అని పవన్ కల్యాణ్ అన్నారు. ఇదే విషయాన్ని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.
అయితే ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించిన విషయం తెలిసిందే. దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో నిలిచిందన్నారు. 10వ నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచ అస్థిరత, సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. 3 ఏళ్లలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నామని వెల్లడించారు.
addComments
Post a Comment