సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలి.



*ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష*


*సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలి


*


*ఈనెల 30న క్వాంటమ్ మిషన్‌పై విజయవాడలో వర్క్ షాప్*


*క్వాంటమ్ మిషన్‌పై ఐటీ రంగ నిపుణులతో సిఎం చంద్రబాబు సమీక్ష*


*క్వాంటమ్ వాలీ ఎకోసిస్టం ఏర్పాటుపై అభిప్రాయాల సేకరణ*


అమరావతి, జూన్ 9 (ప్రజా అమరావతి): సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐకి ఏపి స్టేట్ క్వాంటమ్ మిషన్ దారి చూపాలని సిఎం అన్నారు. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌పై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ రంగ నిపుణులతో సమీక్ష చేశారు. అమరావతిలో క్వాంటమ్ వాలీ ఎకో సిస్టం ఏర్పాటుపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నెల 30న క్వాంటమ్ మిషన్‌పై రాజధానిలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం నుంచి ప్రతి అంశంపై అత్యంత శద్ధ తీసుకోవాలని, ఐకానిక్‌గా బిల్డింగ్ నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ అంటే నాడు నిర్మించిన బిల్డింగ్ ఎలా ఐకానిక్‌గా నిలిచిందో... అమరావతిలో నిర్మించే క్వాంటమ్ వ్యాలీ అలా ప్రత్యేకంగా నిలవాలని సిఎం అన్నారు.


*రెండు దశల్లో మిషన్... రూ.4,000 కోట్ల వ్యయం :* 


సమీక్షలో అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ అజెండాను, కార్యాచరణను వివరించారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్‌గా రాష్ట్రాన్ని నిలపడం, జాతీయ క్వాంటమ్ మిషన్‌లో భాగస్వామ్యం కావడం, నాలెడ్జ్ ఎకానమీని బలోపేతం చేయడం... ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ విజన్‌. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్-మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్-డివైజ్‌లపై ప్రధానంగా దృష్టి పెడతారు. క్వాంటమ్ మిషన్‌కు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. ఇంకా ఐటీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ కార్యదర్శి, ఆర్ధిక శాఖ కార్యదర్శి, మిషన్ డైరెక్టర్, నిపుణుల కమిటీ మిషన్‌లో భాగస్వామిగా ఉంటారు. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌ను రెండు దశలుగా పూర్తి చేయనున్నారు. 2025-27 మొదటి దశగా, 2027-2030 రెండవ దశగా చేపడతారు. మొదటి దశలో మౌలికవసతుల కల్పన, ఎడ్యుకేషన్-రీసెర్చ్, పైలెట్ ప్రోగ్రాంలు...రెండవ దశలో గ్లోబల్ లీడర్‌షిప్‌గా ఏపీ ఎదగడం, వాణిజ్యం, ఎగుమతి సామర్ధ్యం పెంపొందిచుకోవడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఈ మిషన్‌కు వచ్చే 5 ఏళ్లలో రూ.4,000 కోట్లు ఖర్చు కానుందని అధికారులు అంచనా వేశారు. క్వాంటమ్ ఆధారిత పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పడంలో ఏపీ పైలెట్ రాష్ట్రంగా వ్యవహరిస్తోంది. త్వరలోనే ఈ క్వాంటమ్ మిషన్ కోసం డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌కు ఐబీఎం సారధ్యం వహిస్తుంది. ఈ నెలలో జరిగే క్వాంటమ్ మిషన్‌ వర్క్‌షాపునకు ఐటీ, ఫార్మా, ఆగ్రో, హెల్త్, యూనివర్సిటీలు, కాలేజీలు, స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులు, ఇన్నోవేటర్లను ఆహ్వానించనున్నారు.

Comments