- లోకేష్ ఒత్తిడి కారణంగానే మూల్యాంకనంలో తప్పులు
- వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేయాలని టీచర్లకు టార్గెట్
- విద్యాశాఖ వైఫల్యం బయటపడటంతో టీచర్లపై చర్యలు
- వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు చైతన్య, రవిచంద్ర ఆగ్రహం
పదవ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కి వినతిపత్రం సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ పార్టీ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర
- విద్యావ్యవస్థను నారా లోకేష్ భ్రష్టుపట్టించాడు
- నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలి
- పదోతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి
- వైయస్సార్సీపీ స్టూడెంట్ వింగ్ నేతలు చైతన్య, రవిచంద్ర డిమాండ్
మంగళగిరి (ప్రజా అమరావతి):
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని వైయస్సార్సీపీ పార్టీ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. పదవ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కి వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థత వల్లే పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రహాసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేయాలంటూ టీచర్లపై ఒత్తిడి తెచ్చిన విద్యాశాఖ, ఇప్పుడు జరిగిన తప్పులకు అదే టీచర్లను బాధ్యులను చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. విద్యాశాఖను సర్వనాశనం చేసిన మంత్రి లోకేష్‌కు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ఇంకా వారేమన్నారంటే...
పదో తరగతి పరీక్షలను సరిగా నిర్వహించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం, ఇప్పుడు జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ ఘోరంగా ఫెయిలైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ నిర్వహించే విద్యావ్యవస్థ పనితీరు ఇంత ఘోరంగా తయారైందంటే మిగతా వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మూల్యాంకనం జరిగిన తీరు చూస్తే విద్యాశాఖ ఎంత భ్రష్టుపట్టిపోయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులు ఒక్క సబ్జెక్టులో మాత్రం కేవలం 5, 10, 20 మార్కులతో ఫెయిలైపోయినట్టు ఫలితాలు వెలువడ్డాయి. వారు తిరిగి రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకుంటే 90 శాతం మార్కులు సాధించడం చూస్తే మూల్యాంకనం ఎంత లోపభూయిష్టంగా జరిగిందో అర్థం అవుతుంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 66,363 మంది రీవేల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకుంటే రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 11 వేల మంది పైచిలుకు ఉత్తీర్ణత సాధించారు.
- రికార్డుల కోసం విద్యార్ధుల జీవితాలతో ఆటలు
ప్రభుత్వం రికార్డుల కోసం పాకులాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంది. వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి రికార్డులు సాధించి, ఘనతగా చెప్పుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమైంది. పేపర్ కరెక్షన్ కోసం టీచర్ల సంఖ్యను పెంచకుండా ఉన్న వారితోనే మూల్యాంకనం చేయించడంతో టీచర్లు ఒత్తిడికి లోనయ్యారు. ఇది విద్యార్థుల మార్కులు, వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపించింది. వైయస్సార్ కడప జిల్లాలో గంగిరెడ్డి మోక్షిత అనే విద్యార్థినికి సాంఘికశాస్త్రంలో 21 మార్కులేశారు. రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకుంటే 84 మార్కులొచ్చాయి. బాపట్లలో తేజస్విని అనే మరో విద్యార్థినికి అన్ని సబ్జెక్టుల్లో 90 శాతంకి పైగా మార్కులొస్తే, సాంఘిక శాస్త్రంలో 26 మార్కులతో ఫెయిలైంది. రీవెరిఫికేషన్ తర్వాత ఆ బాలికకి 96 మార్కులొచ్చాయి. రాష్ట్ర చరిత్రలో రీవెరిఫికేషన్ తర్వాత కేవలం 5, 10 మార్కులు పెరిగేవి. కానీ ఇంత దారుణంగా 70కిపైగా మార్కులు పెరిగిన సందర్భాలు లేనే లేవు. ఇదంతా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థతను తెలియజేస్తుంది.
- రెడ్‌బుక్ మీద ఉన్న శ్రద్ధ విద్యాశాఖపై లేదు
చాలామంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు రీవెరిఫికేషన్ మీద అవగాహన లేక రుసుములు భరించలేక దరఖాస్తులు చేసుకోలేదని తెలుస్తోంది. వారంతా దరఖాస్తు చేసుకుని ఉంటే ఫలితాలు ఇంకా దారుణంగా ఉండేవని స్పష్టంగా అర్థం అవుతుంది. రాజమహేంద్రవరంలో మణికంఠ అనే విద్యార్థికి 505 మార్కులొచ్చాయి. హిందీలో 52 మార్కులే వచ్చాయని రీవెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకుంటే కొన్ని జవాబులను కొట్టేసి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే విద్యార్థే కొట్టేశాడని చెబుతున్నారు. పైగా కొట్టేసినవి సరైన సమాధానాలేనని వారే నిర్ధారిస్తున్నారు. అలాంటప్పుడు తాను కష్టపడి సమయం, శ్రమ వెచ్చించి కరెక్టు సమాధానాలు రాసిన విద్యార్థి, ఎందుకు కొట్టేస్తాడో లాజిక్ కి అర్థం కావడం లేదు. మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. రెడ్ బుక్ అమలు చేయడం మీద పెట్టిన శ్రద్ధ విద్యాశాఖ మీద పెడితే బాగుంటుంది. విద్యార్థులకు ఉచితంగా రీవేల్యూయేషన్, రీవెరిఫికేషన్ కి అవకాశం కల్పించాలి. దీంతోపాటు ఇప్పటికే రుసుములు చెల్లించిన విద్యార్థుల డబ్బులు తిరిగి చెల్లించాలని వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మంత్రి లోకేష్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొంతమంది టీచర్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వం చేతులు దులిపేసుకోవడం సిగ్గుచేటు.
addComments
Post a Comment