గుంటూరు (ప్రజాఅమరావతి):జూన్,24; రక్తదాతలు నిజమైన ప్రాణదాతలు -కరోనా ఆపత్కాలంలో రక్తమిచ్చి ఆదుకుందాం.. - ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పిలుపు -28న ఏపీఎంవీపీసీ, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన సిబిరం --------------------------------------------------------------- గుంటూరు: ర‌క్తం అవ‌స‌రం ప‌డేవారికి లాక్ డౌన్ పెను స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. బ్ల‌డ్ బ్యాంక్స్ లలో ర‌క్త నిల్వ‌లు అడుగంట‌డంతో ఆస్ప‌త్రి వ‌ర్గాల్లోనూ తీవ్ర‌ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌జ‌లు విరివిగా ర‌క్త‌దానం చేయాల‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అయన స్థానిక రామన్నపేటలోని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు‌. గాల్వన్ లోయలో అమరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ ఈనెల 28వ తేదీన ఆదివారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ (ఏపీఎంవీపీసీ), రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్థానిక రెడ్ క్రాస్ భవనం ఆవరణలో జరిగే ఈ శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదాతలవ్వాలని కోరారు. లాక్ డౌన్ వేళ ర‌క్త దాత‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిందని.. ర‌క్తం ఇచ్చేవారు లేక‌ కొర‌త ఎక్కువ‌గా ఉందన్నారు. దీంతో ఆస్పత్రులలో రోగులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారని చెప్పారు. త‌ల‌సేమియా-క్యాన్సర్ వ్యాధిగ్ర‌స్తులు, బైపాస్ స‌ర్జ‌రీ – హార్ట్ రోగులు.. ప్ర‌మాదాల‌కు గురైన వారు.. ఎనీమియా వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారని వివరించారు. ఇలాంటి స‌మ‌యంలో ర‌క్తం లేక ఇబ్బంది ప‌డుతున్న వారిని ఆదుకునేందుకు ప్ర‌జ‌లు ముందుకు రావాలన్నారు. స్వ‌చ్ఛందంగా ర‌క్త‌దానం చేస్తే ప్రాణ‌దానం చేసిన‌వారు అవుతారని యువత గుర్తెరగాలన్నారు. ఈ బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉందన్నారు. ర‌క్తం దొర‌క్క చ‌నిపోతున్నార‌నే ప‌రిస్థితి రాకుండా కాపాడాలనే బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించాలని లక్ష్మణరెడ్డి కోరారు. రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి మన సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని, రక్తదానంతో సహా అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయని చెప్పారు. భారతదేశంలోని వివిధ బ్లడ్ బ్యాంకుల అంతటా రక్త యూనిట్లలో కొరత ఉందన్నారు. ఈ కొరత మిలియన్ యూనిట్లకు పైగా ఉందని, ఇలాంటి అత్యవసర సమయంలో రక్తదానం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. రక్తాన్ని నిరవధికంగా నిల్వ చేయలేని నేపథ్యంలో రక్తదాన శిబిరాలను సురక్షితమైన పద్ధతిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో రెడ్ క్రాస్ కార్యదర్శి జీవైఎన్ బాబు, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాసరావు, ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments