*కోవిడ్ నియంత్ర‌ణ‌లో ఆద‌ర్శంగా ఏపీ* *నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా ప‌రీక్ష‌లు పెంచ‌డ‌మే ల‌క్ష్యం* *అన్ని మార్గాల‌ను వినియోగించుకుంటున్నాం* *అత్యాధునిక ఇంటిలిజెంట్ మానిట‌రింగ్ ఎనాల‌సిస్ స‌ర్వీస్‌ను తెప్పించాం* *ప్ర‌త్యేక బ‌స్సు ద్వారా 600 మందికి ప‌రీక్ష‌లు* *45 మంది సిబ్బందితో సేవ‌లు* *చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు* *క‌రోనా ప‌రీక్ష‌ల మొబైల్ వాహ‌నం, కోవిడ్ శాంపిళ్ల సేక‌ర‌ణను ప‌రిశీలించిన ఎమ్మెల్యే గారు* కోవిడ్ నియంత్ర‌ణ‌లో దేశానికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆద‌ర్శంగా నిలుస్తోందని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా ప‌రీక్ష‌ల కోసం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు ఇంటిలిజెంట్ మానిట‌రింగ్ ఎనాల‌సిస్ స‌ర్వీస్ క్వారంటైన్ పేరుతో శాంపిళ్ల‌ను సేక‌రించి, ప‌రీక్ష‌లు నిర్వ‌హించే ప్ర‌త్యేక మొబైల్ వాహ‌నాన్ని తెప్పించారు. ఈ వాహ‌నంతోపాటు, వైద్య సిబ్బంది శాంపిళ్ల‌ను సేక‌రిస్తున్న తీరును శుక్ర‌వారం ఆమె ప్ర‌త్య‌క్షంగా వెళ్లి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌తి ప‌దిల‌క్ష‌ల మందిలో 12వేల మందికిపైగా ప్ర‌జ‌ల‌కు కోవిడ్ టెస్టులు చేశామ‌ని చెప్పారు. ఈ స్థాయిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని స్ప‌ష్టంచేశారు. ప‌రీక్ష‌ల విష‌యంలో తొలి నుంచి తాము దూకుడుగా ఉన్నామ‌ని వివ‌రించారు. ఫ‌లితంగానే దేశంలోనే అతి త‌క్కువ ఇన్‌ఫెక్ష‌న్ రేటు న‌మోద‌వుతున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింద‌న్నారు. ప్ర‌తి వంద ప‌రీక్ష‌ల్లో కేవ‌లం 1.18 శాతం మందికి మాత్ర‌మే వ్యాధి నిర్థార‌ణ అవుతోంద‌న్నారు. ఇదంతా రాష్ట్రంలో విరివిగా చేప‌డుతున్న ప‌రీక్ష‌ల ఫ‌లిత‌మేన‌ని తెలిపారు. చిల‌క‌లూరిపేట‌కు అత్యాధునిక మొబైల్ వాహ‌నాన్ని కోవిడ్ ప‌రీక్ష‌ల కోసం పంపాల‌ని ఉన్న‌తాధికారుల‌ను కోర‌గానే.. వెంట‌నే రాష్ట్రంలోనే తొలి సారి చిల‌క‌లూరిపేట‌కు వాహ‌నాన్ని పంపార‌ని, ప‌రీక్ష‌ల విష‌యంలో రాష్ట్రం ఎంత వేగంగా ఉందో చెప్ప‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏమీ ఉండ‌ద‌ని వెల్ల‌డించారు. *600 మందికి ప‌రీక్ష‌లు* ఈ వాహ‌నం ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 600 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ముందుగానే గుర్తించి వారికి, వారి వారి ప్రాంతాల‌కే వాహ‌నం వెళ్లి శాంపిళ్ల‌ను సేకరిస్తుంద‌ని తెలిపారు. వీటి ఫలితాలు కూడా ఒక్క రోజులోనే వ‌స్తాయ‌ని చెప్పారు. పెద్ద ఎత్తున చేప‌ట్టిన ఈ కోవిడ్ ప‌రీక్ష‌ల కోసం ఏకంగా 45 మంది వైద్య సిబ్బంది ప‌ట్ట‌ణానికి వ‌చ్చార‌ని, అత్యంత జాగ్ర‌త్త‌గ శాంపిళ్ల‌ను సేకరిస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా కోవిడ్‌ ప‌రీక్ష‌ల నిమిత్తం వ‌చ్చిన అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన బ‌స్సును ఎమ్మెల్యే గారు ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సీహెచ్ శ్రీనివాస‌రావు గారు, వైద్యాధికారి గోపినాయ‌క్‌ గారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ప‌ఠాన్ త‌ల్హాఖాన్‌, పార్టీ మైనారిటీ సెల్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు బేరింగ్ మౌలాలి, పార్టీ ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌రాజు,బొల్లెద్దు చిన్న, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మున్సిప‌ల్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Comments